.
కేవీపీ రామచంద్రరావు… అవును, మరిచిపోయారా..,? వైఎస్ ఆత్మ అనేవాళ్లు అప్పట్లో… ఆ ఆత్మకూ, వైఎస్ కొడుకు ఆత్మకూ శృతి కుదరలేదు… ఆస్తులు, బినామీ సంపాదన ఎట్సెట్రా ఏం యవ్వారాలున్నాయో తెలియదు గానీ… ఆయన పాపం, కాంగ్రెస్‌లోనే ఉండిపోయాడు… పార్లమెంటులో తెలంగాణ విభజన బిల్లుపై చర్చ సమయంలో కూడా ఓ ప్లకార్డు పట్టుకుని స్పీకర్ పోడియం దగ్గర రాయిలా నిలబడిపోయాడు…
సహజంగానే ఆయన మొహంలో భావోద్వేగాలు కనిపించవు… ఆయన తెలంగాణ కాంగ్రెసో, ఏపీ కాంగ్రెసో కూడా ఎవరికీ అంతుపట్టదు… కానీ జగన్ మాత్రం తనను అస్సలు దగ్గరకు రానివ్వలేదు, ఏవో సహేతుక కారణమే అయి ఉంటుంది… కేసీయార్ ప్రభుత్వ హయాంలో ఏదో కులచక్రం తిప్పాడు అంటారు గానీ నిర్ధారణలు, ఆధారాలు ఉండవు, అలా కనిపించడం కేవీపీకి అలవాటే ఉండదు కూడా…
Ads
ఇప్పుడిదంతా ఎందుకూ అంటే… పవన్ కల్యాణ్ అనే కేరక్టర్ విజ్ఞత కోల్పోయి జాగీర్‌దార్ భాషలో అందరి మీద ఏవేవో వ్యాఖ్యలు చేసేస్తున్నాడు కదా అదుపు తప్పి… చివరకు గద్దర్ మీద కూడా… పనిలోపనిగా ఎక్కడో వైఎస్ మీద కూడా ఏదో తూలాడు… తన మీద కేసులు పెట్టాలని ఎవరో ఐపీఎస్‌ను వైఎస్ ఆదేశించాడట…
అదుగో అక్కడ కాలింది కేవీపీకి… ఏయ్, ఏం మాట్లాడుతున్నావ..? వైఎస్ మీద మాట తూలితే బాగుండదు అని నేరుగా చెప్పొచ్చు కదా… లేదు, అత్యంత విచిత్రమైన శైలిలో ఓ లేఖ రాశాడు… ఆయన తత్వం, మాటతీరు, కెరీర్ లాగే ఓపట్టాన అర్థం కాదు… వాక్యం వాక్యం కూడబలుక్కుని కష్టపడితే తప్ప… ఈ లేఖను ఎవరు రాసిచ్చారో గానీ… నమోనమః… విదేశాంగశాఖలో ఉండాల్సినవాడు…
ఇంతకీ అందులో ఏమంటాడయ్యా అంటే..? ‘‘ఏమయ్యా పవన్ కల్యాణ్, నువ్వు ప్రజారాజ్యం యువవిభాగంలో ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడితేనే వైఎస్ నిన్నేమీ అనలేదు… కేసులు పెట్టలేదు… అలాంటి వైఎస్ తరువాత నీమీద కేసులు పెట్టాలని ఐపీఎస్ ఆఫీసర్లను పురమాయించాడని నిందలేల..? అసలు వైఎస్‌కూ ఇప్పటి వైసీపీకి సంబంధం లేదని తెలియదా నీకు..?
వైఎస్ మరణించి 17 ఏళ్లయినా వైఎస్ మీద నిందలేమిటి..? నీమీద కేసులు పెట్టాలని వైఎస్ ఆదేశించాడని అంటున్నావు కదా, సదరు ఐజీ ఎవరో లైడిటెక్టర్ పరీక్షకు తీసుకురా, నిజం తేలితే నేను 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తా, లేదంటే నువ్వు చెప్పినోడికి ఇస్తా, సవాల్ స్వీకరించు’’ అని సవాల్ చేశాడు… కష్టమ్మీద ఆ లేఖ చదివితే అర్థమైంది ఇదే…
వివరాలు కావాలంటే పైన పీడీఎఫ్ లింక్ చదవండి… ఇక్కడ మరో డౌట్, 10 కోట్లు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దేనికి..? సదరు ఐజీ తెలంగాణ కేడర్‌లో ఉన్నాడా..? లేక కేవీపీ కూడా తెలంగాణ కాంగ్రెస్‌లోనే ఉన్నాడనా..? ఇంతకీ ఆ ఐజీ ఎవరో..!! ఐనా రాజకీయ బలప్రత్యర్థి చంద్రబాబు వియ్యంకుడు ఓ కాల్పుల సంఘటనలో అడ్డంగా దొరికితేనే క్షమించేసి వదిలేసిన వైఎస్ అప్పట్లో ఏమీకాని పవన్ కల్యాణ్ మీద కేసులు పెట్టాలని సూచించాడా..? హేమిటో… నోటికి ఏదొస్తే అది వాక్రుచ్చడమే కదా పవన్ స్టయిల్..!!
Share this Article