తెలుగులో ఓ పదం ఉంది కదా… పిచ్చి కూత..! చంద్రబాబు తాజా మాటలు వింటే ఆ పదమే గుర్తొస్తోంది పదే పదే… నానోట వెంకటేశ్వర స్వామే చెప్పించాడు అనే మాట… చేసేది చేసి, దేవుడే చేయించాడు అనడమేంటి..? నిజమేనా..? మరి నాడు అలిపిరి దాడి కూడా సాక్షాత్తూ ఆ శ్రీవారే చేయించాడంటావా..?
ఒకవైపు కల్తీ వెల్లడైన ఆ నాలుగు ట్యాంకర్లను తిప్పి పంపించామని, ఆ నెయ్యి వాడలేదని నువ్వు పెట్టిన ఈవో శ్యామలరావే చెబుతున్నాడు… మరి ఆయన నీకు చెప్పిందేమిటి..? నువ్వు జనానికి చెప్పిందేమిటి..? ఎందుకు చెప్పినట్టు..? ఇప్పుడేమో దేవుడే చెప్పించాడు అని దేవుడి వైపు చూపించడం ఏమిటి…
ఎస్, చంద్రబాబు మాటలకు, చేతలకు విశ్వసనీయత ఎంతో అందరికీ తెలుసు… కానీ కోట్లాది మంది భక్తులు శ్రీవారికి అపరాధం జరిగిపోయిందని బాధపడుతున్న తరుణంలో… మళ్లీ ఇవేం నాటకాలు..? ఒకాయనేమో ప్రాయశ్చిత దీక్ష చేస్తాడట, తప్పు చేసిందెవరో కదా, చేతనైతే శిక్షించండి, తను ఎందుకు ప్రాయశ్చితం చేసుకోవడం..? సంప్రోక్షణ, ప్రక్షాళన, ప్రత్యేక హోమాలు ఏం చేయాలో ఆగమ పండితులతో చర్చించి చేయిస్తారట…
Ads
ఆ శ్రీవారికి ఏ తప్పూ అంటదు, ఏ సంప్రోక్షణ లేకపోయినా తను పవిత్రుడే… లడ్డూల్లో ఇప్పుడు కొవ్వుల నెయ్యిని వాడలేదని ఈవో చెబుతున్నాడు… సరే, మరి అంతకుముందు వాడారా..? అది ఏ కంపెనీ సప్లయ్ చేసిన నెయ్యి..? దాన్ని చంద్రబాబు ఇప్పుడు నిరూపించగలడా..? అది కష్టం కాబట్టే దేవుడి వైపు చూపిస్తున్నాడా..?
రేప్పొద్దున ఏ వేల కోట్ల కుంభకోణం నిందితుడో… తిరుమలకు వచ్చేసి, అంతా ఆ దేవుడే నాతో చేయించాడు అంటే… దాన్నీ నమ్మేద్దామా బాబు గారూ… పోనీ, నమ్మాల్సిందే అంటావా..? ఇదెక్కడి వాదన..? కొవ్వుల లడ్డూ అని జనంలోకి తీసుకెళ్తున్నప్పుడు, కోట్లాది మంది భక్తుల మనోభావాలు గుర్తుకురాలేదా..? పోనీ, అసలు ఆ నెయ్యే వాడలేదనేదే నిజమైతే… మరెందుకు నువ్వు జనానికి ఏం చెప్పినట్టు..? ఎందుకు చెప్పినట్టు..? కొవ్వల నెయ్యి వాడకం జరిగిందని చెబుతున్నావా..? నెయ్యి తెచ్చారు గానీ వాడలేదు అని చెబుతున్నావా..? వాడకపోతే ఏమిటీ రాద్ధాంతం..?
నిజంగానే జగన్ చెప్పినట్టు రాజకీయ దురుద్దేశంతోనో, ఏదో మార్మిక వ్యూహంతోనో జగన్ మీద ఈ అడ్డూ అస్త్రం ప్రయోగిస్తే… ఆ దేవుడితో ఆడుకుంటే తను ఊరుకుంటాడా..? అలాగని జగన్ పాలనలో తప్పులు జరగలేదని కాదు… బేసిక్‌గా ధర్మారెడ్డి, భూమన, వైవీ సుబ్బారెడ్డిలే అయిదేళ్లు తిరుమల పాలనను భ్రష్టుపట్టించారని జనమంతా, జగమంతా నమ్ముతోంది… వాళ్ల క్రెడిబులిటీ, వాళ్ల పనితీరు అది… వాళ్లను నమ్మి జగన్ ‘మునిగాడు’…
రివర్స్ టెండరింగులు, కక్కుర్తి యవ్వారాలతోపాటు రోజా మందలకుమందలుగా జనాన్ని తీసుకుపోయి ప్రదర్శించిన దిక్కుమాలినతనం దగ్గర నుంచి అన్నప్రసాదాల నాణ్యత, లడ్డూ నాణ్యత, ఇతర సేవల్లో కూడా భక్తుల అసంతృప్తి బాగా కనిపించింది… కావాలనే జగన్ ఇవన్నీ చేయించాడనేది తప్పు, కాకపోతే వాళ్లను అక్కడ నియమించిన బాధ్యుడు తనే…జంబో జెట్ పాలకమండలి ఏర్పాటు ప్రయత్నాలు మరో దిక్కుమాలిన ఆలోచన… సరే, ఇవన్నీ వదిలేస్తే… ఒకటి చెప్పి ముగిద్దాం…
ఈవో శ్యామలరావు అక్కడ ల్యాబ్ లేదంటాడు ఓసారి, పరీక్షలు చేసి ట్యాంకర్లు వాపస్ పంపించాం అంటాడు… కల్తీ నిజమే అంటాడు, కానీ ఆ నెయ్యి వాడలేదు అంటాడు… మరోసారి కేవలం వనస్పతి మాత్రమే కల్తీ అంటాడు… ఇంకోసారి కొవ్వుల కల్తీపై కేంద్ర ప్రయోగశాల రిపోర్టు ఇచ్చిందీ అంటాడు… ఏదో ఉంది, తెర వెనుక ఎవరో పలికిస్తున్నారు; ఆడిస్తున్నారు; ఏదో మర్మం ఉంది… ఏమిటది..? అదీ దేవుడి పనే అని మాత్రం చెప్పకు సీఎం చంద్రబాబూ..!! చంద్రబాబులాగే జగన్ కూడా ‘‘అంతా ఆ దేవుడే చేయించాడు’’ అనలేదు, అక్కడికి సంతోషం..!!
Share this Article