లావు గలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుడౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్టు మహిలో సుమతీ!
లావుగా ఉన్నవారి కంటే నీతిపరుడే బలవంతుడని, కొండంత ఏనుగుపై మావటివాడు ఎక్కలేదా అని ఈ పద్యం తాత్పర్యం. 1260లో కాకతీయ సామ్రాజ్యంలో జీవించిన బద్దెన కాలానికి ఏనుగులెక్కడం పురుషుల పని మాత్రమే అయి ఉంటుంది గాక, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కాదు, ఒకావిడ మార్చింది. ఆమె పేరు పార్బతి బారువా. భారతదేశపు తొలి మహిళా మావటి. మగవారికే ప్రాణాంతకమైన ఈ పనిని ఆమె అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అతి తక్కువ మంది మహిళా మావటుల్లో ఆమె ఒకరు. ‘Queen of Elephant in Assam’గా ప్రఖ్యాతి పొందారు. ఈ ఏడాది కేంద్రం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆమె గురించి తప్పక తెలుసుకోవాలి.
“ఏనుగులను అదుపు చేయడం కష్టమైన పని కదా! మీరెలా చేయగలుగుతున్నారు?” అని పార్బతి బారువాని అడిగితే, ఆమె ఒకే సమాధానం చెప్తారు. “ఏనుగులను అదుపు చేసేందుకు కావాల్సింది బలం కాదు, దాని మనసులో ఏముందో గ్రహించే శక్తి. ఆపై మన అదృష్టం” అంటారామె. ఏనుగులను మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టే నాటికి ఆమె వయసు 14. ఇప్పుడు ఆమె వయసు దాదాపు 70 ఏళ్లు. అస్సాం రాష్ట్రం ధుబ్రీ జిల్లాలో ఓ మూలన ఉండే గౌరీపూర్ అనే చిన్న పట్టణం ఆమె స్వస్థలం. శివుడి భార్య పార్వతి పేరిట ఆమె తల్లిదండ్రులు ఆమెకు పార్బతి అని పేరు పెట్టారు. ఆమెకు ఒక నెల 17 రోజుల వయస్సున్నప్పుడే వాళ్ల కుటుంబం షిల్లాంగ్ నుంచి గౌరీపూర్ వస్తూ మధ్యలో దామ్రా వద్ద ఉన్న ఏనుగుల క్యాంపు వద్ద ఆగింది. వన్యజీవితం పట్ల తనలో ఆసక్తి మొదలయ్యేందుకు బీజం అక్కడే పడింది అంటారు పార్బతి.
పార్బతి తండ్రి పరీక్షిత్ బారువాది గౌరీపూర్ రాజుల వంశం. ఆయనకు వన్యప్రాణుల సంరక్షణ పట్ల ఆసక్తి. ఆయనకు నలుగురు భార్యలు, తొమ్మిది మంది పిల్లలు. ఏడాదికి ఎనిమిది నెలల పాటు అడవుల్లోని క్యాంపుల్లోనే కుటుంబమంతా ఉండేవారు. వారికి సాయంగా 70 మంది పనివాళ్ళు, పిల్లలకు చదువు చెప్పేందుకు ట్యూటర్లు కూడా వారి వెంట వచ్చేవారు. చిన్ననాటి నుంచి ఆ క్యాంపుల్లో ఉంటూ అడవిలోని విశేషాలను గమనించేవారు పార్బతి. శిక్షణ పొందిన ఏనుగులు (కుమ్‌కీలు) మదపుటేనుగులను తరమడం, దారులకు అడ్డంగా పెరిగిన చెట్లు, తీగలను ఏనుగులు తొలగించడం, దారులపై పడిన చెట్లను తీసేయడం వంటివాటిని ఆసక్తిగా చూసేవారు. ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక రాజాభరణాలు రద్దు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పార్బతి తండ్రి అడవుల్లోనే ఉండి వన్యప్రాణులను పెంచుతూ, కలప అమ్ముతూ జీవనం సాగించారు. ఆయనకు ఏనుగులంటే ప్రాణం. వాటిని తన బిడ్డలతో సమానంగా చూసేవారు. వాటికి స్నానం చేయించడం, తిండి పెట్టడం వంటి పనులు చేసేవారు.
ఏనుగులకు మావటులు ఇస్తున్న శిక్షణ గమనిస్తూ ఉన్న పార్బతి వాటి గురించి వారిని అడిగి తెలుసుకునేవారు. వారి ద్వారా ఏనుగుల ఆలోచనలు అంచనా వేసేవారు. వాటికి సంబంధించిన ఎన్నో కథలు వినేవారు. కొక్రాజర్ జిల్లాలోని కాచుగాన్ అడవుల్లో తొలిసారి ఏనుగును పట్టుకున్నారామె. 14 ఏళ్ల వయసులో అంతటి సాహసం చేసిన ఆమెను తండ్రి ‘శెభాష్ బేటీ’ అని మెచ్చుకున్నారు. అదే తన పాలిట అరుదైన ప్రశంస అని అంటారామె. అక్కడ మొదలైన ఆమె ప్రస్థానం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఒక్కో ఏనుగును మచ్చిక చేసుకొని శిక్షణ ఇచ్చేందుకు ఆరునెలల కాలం పడుతుంది. అందుకే మావటిగా మారేందుకు చాలా ఓర్పు, నేర్పు కావాలంటారు పార్బతి. పైగా ఏ క్షణంలో ప్రమాదం జరుగుతుందో చెప్పలేమంటారు.
పార్బతి మూడు ఏనుగులను పెంచుతున్నారు. వాటి పేరు లక్ష్మీమాల, అలోక, కాంచనమాల. వాటితో కలిసి ఆమె చేసే అడవి ప్రయాణం అత్యంత విలక్షణంగా ఉంటుంది. అస్సాంతోపాటు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కడైనా మదపుటేనుగులు గ్రామాలపై దాడి చేస్తే తన ఏనుగులతో వెళ్లి ఆమె వాటిని అదుపు చేస్తారు. ఏనుగులు పట్టణ ప్రాంతాల్లోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆమె వివరిస్తారు. కొత్త మావటీలకు శిక్షణ ఇస్తారు.
అడవి జీవనం ఎంతో సౌకర్యవంతమని పార్బతి బారువా అభిప్రాయం. ఆ అలవాటు కారణంగానే మామూలు వేళల్లోనూ ఆమె టూత్ పేస్ట్ బదులు బూడిద వాడతారు. పరుపుల మీద కాక మామూలు చాప మీద తలగడ లేకుండా నిద్రిస్తారు. తన మంచం పక్కనే తన తండ్రి యవ్వనంలో ఉన్న ఫొటో ఎల్లప్పుడూ ఉంచుకుంటారు. ‘అడవిలోకి వెళ్ళి ఏనుగులను చేయడం చాలా ప్రమాదకరమైన పని. అందుకే ప్రతిసారీ నేను ఇంటికి తిరిగి వస్తానా అని ఆలోచిస్తూనే వెళ్తాను’ అంటారామె. వెళ్లే ముందు కాళీమాత, గణపతి, సాట్‌షికారి (వనదేవత) దేవతలతోపాటు ముస్లిం సాధువు మాహౌట్ పీర్‌కు పూజలు చేస్తారు. ఈ నియమాన్ని తప్పక పాటిస్తారు. మామూలు సమయాల్లో అస్సాం సంప్రదాయ దుస్తుల్లో కనిపించే ఆమె అడవిలోకి వెళ్ళేప్పుడు జీన్స్, జాకెట్, టోపీ, సన్ గ్లాసెస్ వంటివి ధరిస్తారు. తను పెంచుకున్న ఏనుగులనూ అందంగా అలంకరిస్తారు.
International Union for Conservation of Nature (IUCN)లో పార్బతి సభ్యురాలు. ‘Queen of the Elephants’ పేరుతో బీబీసీ ఆమె జీవితంపై డాక్యుమెంటరీ చిత్రీకరించింది. “నేను చేసే పని నిండా ప్రమాదాలే ఉన్నాయి, కానీ నేను ఎప్పటికీ రిటైర్ కాను” అంటూ నేటికీ ధీమా వ్యక్తం చేస్తున్నారామె… – విశీ
Ads
Share this Article