.
కర్నాటక, హుబ్లి… బీహార్, పాట్నా నుంచి కూలీగా వలస వచ్చిన వాడి పేరు రితేష్ కుమార్… వయస్సు 35… ఓ ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఐదేళ్ల పాపకు చాక్లెట్లు ఆశ చూపి, ఎత్తుకుని వెళ్లాడు…
అత్యాచార యత్నం చేశాడు, పాప ప్రతిఘటించింది, ఏడ్చింది, రక్కింది… వాడు ఆమెను చంపేశాడు… ఈలోపు బిడ్డ కనిపించక ఆ తల్లి ఇరుగూపొరుగూ వాళ్లను పిలిచింది, అడిగింది…
Ads
ఆ పాప తండ్రి ఓ పెయింటర్, తల్లి ఇళ్లల్లో పనిమనిషి… గుమికూడిన జనం అటూఇటూ చూశారు… తీరా చూస్తే విజయనగర్‌లోని ఓ షెడ్‌లో పాప మృతదేహం కనిపించింది… అందరికీ విషయం అర్థమైంది… ఈలోపు వాడు పారిపోయాడు…
ఐదేళ్ల పాపను అలా చూసేసరికి జనం కన్నీళ్లు ఆపుకోలేకపోయారు… ధర్నాకు దిగారు… రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వాడు బాలికను ఎత్తుకుని పోతున్నట్టు కనిపించింది… వాడిని అదుపులోకి తీసుకున్నారు…
తరువాత వాడు ఎక్కడైతే ఉంటున్నాడో, తరిహాల వంతెన సమీపంలోని ఓ శిథిలావస్థలోని ఇంటికి వాడిని తీసుకెళ్లారు, నీ వివరాలు, పత్రాలు చూపించు అన్నారు… (పోలీస్ కథనం)… వాడు పోలీసుల పైకి రాళ్లు విసిరి తప్పించుకుని పోవడానికి ప్రయత్నించాడు…
అప్పటికే పాప మృతదేహం చూసి ఏడ్చేసిన ఓ మహిళా పోలీస్ అధికారిణి పీఎస్ఐ అన్నపూర్ణ వాడిపైకి కాల్పులు జరిపింది… కాళ్లపై, వీపుపై షాట్స్… వాడిని కిమ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగానే మధ్యలోనే మరణించాడు…
కర్నాటకలో సోషల్ మీడియా ఇప్పుడు సదరు పోలీస్ అధికారిణి అన్నపూర్ణపై ప్రశంసలు కురిపిస్తోంది… వాడి రాళ్ల దెబ్బలకు గాయపడి ఆమె, ఇద్దరు పోలీసులు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు జిల్లా ఎస్పీ శశికుమార్ చెబుతున్నాడు…
మనకు తెలంగాణ, ఇతర చోట్ల రేపిస్టుల ఎన్‌కౌంటర్ కథలు తెలుసు… ఆ ఎన్‌కౌంటర్లను జనం హర్షించారు… అబ్బే, రూల్ ఆఫ్ లా ప్రకారం శిక్షించాలని అనేవారు కొందరే… కానీ మన న్యాయవ్యవస్థలో శిక్షలు, అమలు ఎంత ప్రయాసో, ఎన్ని లూప్‌హోల్సో, ఆశించిన న్యాయం ఓ జీవితకాలం లేటు అని తెలుసు కదా, ఇదే సరైన శిక్ష అనేవారూ కొందరు…
కర్నాటకలో ఇలాంటి సంఘటన కొత్తే… కన్నడనాట ఇంటింటా ఇప్పుడు అన్నపూర్ణ మీద చర్చ, ప్రశంసలు… సరే, ఎన్‌కౌంటర్ బూటకమా, సరైన పద్ధతేనా అనే చర్చ నడుస్తుంటుంది కానీ సోషల్ మీడియా ఆమెను సివంగితో పోలుస్తూ పోస్టులు పెడుతోంది… లేడీ సజ్జనార్…
Share this Article