.
. ( రమణ కొంటికర్ల ) .. …. మంచు కురిసే వేళలో…. చెడ్డీదోస్తుల లంబసింగి టెయిల్స్!
చలి చంపుతున్న చమక్కులో గిలిగింతకొచ్చిందంటూ పాడుకుంటున్న చలికాలపు సాయంత్రాల్లో… పూర్తిగా మంచుదుప్పట్లోకే చొరబడ్డాం!
Ads
చూసొచ్చినవాళ్లు చెప్పే ముచ్చట్లు.. యూట్యూబర్స్ ఊరించే కబుర్లు.. సోషల్ మీడియాలో వైరలయ్యే రీల్స్.. ఎంత కాదన్నా ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉంటాయి. పైగా చాలాకాలంగా ఒకేచోట తిష్ఠ వేసి కూర్చోవడం.. అటు వెళ్లాలి, ఇటు వెళ్లాలనుకుంటూ ప్లాన్స్ గీసుకోవడం.. అవేవీ ముందడుగు పడకపోవడంతో.. ఎలాగైనా వెళ్లాలన్న ఓ గట్టి తపన నుంచి పట్టుదల అగ్గిలా రాజుకుంది.
కట్ చేస్తే కట్టెలు కాల్చి ఆ అగ్గి మంటలు పెట్టుకున్న క్యాంప్ ఫైర్ తో మేం లంబసింగిలో తేలాం! అంతా అన్ ప్లాన్డే.. కానీ, టూర్ ముగిసేసరికి ఎంత ఆర్గనైజ్డ్ అనేలా సాగింది ప్రయాణం!!
సుమారు ఆరేడు డిగ్రీల మధ్యనున్న రాత్రి ఉష్ణోగ్రతలో… వర్షం పడటం లేదు గానీ… బట్టలు, బ్యాగులు, కుర్చీలు, బయట ఏవుంటే ఆ వస్తువులన్నీ తడుస్తున్నాయి. ముద్దైతున్నాయి. కారణం పైనుంచి కురుస్తున్న మంచు. అప్పటివరకూ వాన కురిసే దృశ్యాలను మాత్రమే చూసిన మాకు.. కశ్మీరంలోనో, సిమ్లాలోనో, స్విస్ లోనో మంచు కురుస్తుందని విన్న మాకు… ఆ మంచు కురిసే వేళ కొత్త అనుభూతినిచ్చింది. అదే సమయంలో ఆందోళనకూ గురిచేసింది.
అప్పటికే ఆ మంచులో అక్కడి కాటేజెస్ అన్నీ ఫుల్ ఐపోయాయి. నిజానికి ఆ వేళలో ఆ కాటేజెస్ కంటే కూడా అక్కడుండే గుడారాల్లో పడుకోవడమే ఓ థ్రిల్. కానీ, అంత మంచు దుప్పటిలో ఏ దుప్పటి కప్పుకుంటే మాత్రం చలినాపగలం. అలాంటిది గుడారాల్లో పడుకోవడమా..? నెవర్..
మన నుంచి కాదనుకున్నాం. కాబట్టి, ఎలాగైనా ఏదైనా రూమ్ దొరకబట్టుకోవాలనుకున్నాం. ప్రయత్నించాం.. విఫలమైనాం. కానీ, మదిలో ఎక్కడో గుడారాల్లో ఆ మంచులో పడుకుంటే ఎలాగుంటుందని రగులుతున్న ఓ కోరిక మాత్రం అలాగే బలంగా ఉంది. కోరిక బలంగా ఉంటే అనుకున్నదైపోదూ..? అందుకే గుడారంలోనే అలసిసొలసిన శరీరం గురకకుపశ్రమించింది.
ఎన్నింటికి..?
సుమారు రాత్రి ఒంటిగంటైంది. కానీ, మళ్లీ ఉదయాన్నే కనీసం నాలుగ్గంటలకైనా లేవాలి. అలాంటి మెలకువతోనే లంబసింగి అందాలను పూర్తిగా ఆస్వాదించగల్గేది.
తప్పుతుందా శరీరం సహకరించకపోయినా.. సంకల్పం లేపింది. అప్పుడు ఆ మంచువాన చూడాలి.. ఎవరు నోరు తెరిచినా సిగరెట్ తాగుతున్నంత పొగ. పొగ తాగుతున్నవాణ్ని చూసినా.. మంచు వల్లనేమోననేంత విభ్రమ!
అలాంటి సమయంలో హీటర్ కూడా సదరు డేగా రిసార్ట్స్ లో పనిచేయక గడ్డ కట్టే నీళ్లతో బ్రష్ మమ అనిపించాం. అప్పటికే ప్రయాణ బడలికకు తోడు నిద్ర కూడా లేకుండా.. లంబగిరి వ్యూ పాయింట్ హిల్ స్టేషన్ కు బయల్దేరాం నల్గురం చెడ్డీ దోస్తులం.
అప్పటికే ఐదు కొడుతోంది. ఆ.. ఇంత మబ్బున్నే ఎవడు వస్తాడులే.. మనమే అనవసరంగా తొందరపడి పోతున్నామేమోనన్నంత జనమ్మీదున్న అపనమ్మకమొకవైపు.. మాపై మాకు అనుమానమింకోవైపు! కానీ, అక్కడికెళ్లేసరికే ఎక్కడ్నుంచి వచ్చార్రా వీళ్లంతా అనుకునేంత ఇసుక వేస్తే రాలని జనం.
రయ్ రయ్ మంటూ ఆ చీకట్లోనే లంబసింగి హిల్ స్టేషన్ లో పర్యాటకులను డ్రాప్ చేసే మహీంద్రా జీపులు. అంత మబ్బున ఆ పాయింట్ వద్ద వేడి వేడి ఛాయ్‌లు, కాఫీలు, బొంగుల చికెన్, చికెన్ రోస్ట్ వంటి ఫుడ్ తో బిజీబిజీ ఒకవైపు!
ఆ జనసమ్మర్దంలో ఓ మహీంద్రా జీపును పట్టుకునే క్రమంలో ఇంకింత గజిబిజి మరోవైపు!! ఆ మంచు దుప్పటి వాతావరణం మమ్మల్ని ఒకింత థ్రిల్ కు గురిచేస్తుంటే… మరోవైపు నిట్టనిలువుగా పైకెక్కితే జీపు కిందకు జారిపోదా అన్నట్టుగా ఉన్న గుట్టపైకి పదిమంది చొప్పున వాహనాలెక్కిన సమయంలో ఇంకొంత ఆందోళన!
ముందూ, వెనుకా జీపుల వరద.. మరోవైపు ఆ ఘాట్ రోడ్డుకు ఎక్కేది, దిగేది ఒకటే మార్గం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకింత వణుకుతో సాహసోపేతమైన ఓ అడ్వెంచరెస్ జర్నీ లంబసింగి.
కట్ చేస్తే… పక్కనే ఉన్న కైలాసగిరి బీచ్ తలపిస్తూ కొండల మధ్యన మయసభను ముందుంచే మేఘాలు… నీళ్లేనేమో దూకి స్నానం చేద్దామా అని విభ్రమకు గురిచేసే దృశ్యాలు.. ఇంకోవైపు రవివర్మ, ఎం.ఎఫ్. హుస్సేన్, పికాసోలంతా కలిసి గీసిన చిత్రాల్లా కొండల్లోంచి చెట్ల ఆకుపచ్చదనాన్ని అందంగా పులుముకున్న కొండలు..
వాటిపై అప్పుడప్పుడే మాకంటే కాస్త లేటుగా లేచి అక్కడికొస్తున్న ఆ సూరీడు… మొత్తంగా ఎందుకు లంబసింగికి అంత జనం విరగబడుతున్నారో ఎరుకైన సమయమది. కింద వైజాగ్ లో బంగాళాఖాతం సంద్రం… పైన లంబసింగిలో మంచుసంద్రం!
అన్నవరం సత్యదేవుడి ఆశీర్వచనం!
కరీంనగర్ టూ లంబసింగి.. వయా హైదరాబాద్!
శుక్రవారం రోజు కరీంనగర్ నుంచి షార్పుగా అనుకున్నట్టే ఉదయం తొమ్మదిన్నరకు బయల్దేరి.. హైదరాబాద్ చేరేసరికి 12.30 అయింది. అక్కడి ముగ్గురు దోస్తులనెక్కించుకుని లంబసింగి దారుల్లో పడేసరికి.. సరిగ్గా 3 గంటలైంది. నాల్గింటికి హైదరాబాద్ శివార్లలో పంతంగి టోల్ ప్లాజాకు ముందున్న తాటిబెల్లం హోటల్ లో చేసిన భోజనం ఇచ్చిన మజాతో బ్రేవ్ మన్నాం.
అక్కడినుంచి ప్రారంభమై.. విజయవాడకు ముందు ఓ వేడి వేడి ఛాయ్.. మళ్లీ ఏలూరుకు ముందు ఓ ఫిల్టర్ కాఫీ… ఆ తర్వాత డ్రైవర్ కు నిద్ర రావద్దని అన్నవరానికి ముందు మరో ఛాయ్.. ఇలా సాగింది జర్నీ!
అదే జోరుతో రాజమండ్రి దాటేసి… సుమారు రాత్రి రెండు గంటలకల్లా అన్నవరం చేరుకున్నాం. ఓ హోటల్లో రాత్రికి స్టే. మబ్బున్నే లేస్తేనేగానీ సత్యదేవుడి దర్శనం కాస్త సులభమన్నారు. తప్పుతుందా.. టూర్ అంటే ఎంజాయ్ మెంట్, ఎగ్జైట్ మెంటే కాదు.. అలసట, నిద్రలేమీ బోనస్!
దాంతో, మళ్లీ ఐదింటికల్లా లేచిపోయాం. స్నానాలు పూర్తి చేసుకున్నాం. ఆ సత్యదేవుడి చెంతకు ఓ బస్ ఎక్కి ఈమధ్యకాలంలో అంత తక్కువకు ఏదీ కొనలేని పది రూపాయల ధరలో టిక్కెట్లను కొని.. కొండపైనున్న ఆలయానికి చేరుకున్నాం.
పడుకోవడం ఆలస్యమైంది.. మళ్లీ, ఇంత ఉదయమే లేవడమా అన్న అంతృప్తిని పోగొట్టేలా.. ఆ సత్యనారాయణస్వామి దర్శనానికి గర్భగుడే మాకు వేదికైంది. అందుకేనేమో.. మా ప్రయాణమాసాంతం శుభసూచకంగా సాగిందనే ఓ విశ్వాసమూ కుదిరింది.
అన్నవరపు ఆధ్యాత్మిక యాత్ర పూర్తి చేసుకున్న భక్తిభావనతో బయల్దేరి.. రక్తి కట్టించే వైజాగ్ బీచులవైపు మా ప్రయాణం మొదలైంది. మార్గమధ్యంలో మాంచి పెసరట్టు, ఓ ఇడ్లీ దట్టించి.. అక్కడ్నుంచి అప్పన్న దర్శనంకై సింహాచల బాట పట్టాం.
మామీద ఆ అప్పన్న కరుణించలేదో.. మేమే భక్తిభావంతో దర్శించుకోవాలని తీర్మానించుకోలేదోగానీ.. ఇసుక వేస్తే రాలనంత భక్త జనసందోహంతో ఇక ఇదిప్పుడయ్యే పనికాదని సుదురాయించి వెనక్కి తిరిగాం. అక్కడి నుంచి వైజాగ్ రిషికొండ బీచుకు చేరుకున్నాం.
ఇవాళ, రేపట్లో దొంతి కూర్చున్నా, ఉరికినా, వాకింగ్ చేసినా, ఇంట్లోనైనా, నట్టింట్లోనైనా ఫోటోలు తీసుకునే సౌకర్యాన్ని, సౌలభ్యాన్నిచ్చిన మోబైల్ తో మేమూ.. యథావిధిగా మాకు మేమే హీరోలమన్నట్టు వివిధ భంగిమల్లో ఓ ఫోటో ఎగ్జిబిషనే ఏర్పాటు చేసేన్ని ఫోట్వోలు దిగాం.
కావల్సినవారు స్నానాలు, బోటింగ్ వంటివి పూర్తి చేసుకుని.. సుబ్బయ్య గారి హోటల్లో.. గోదారోళ్ల మర్యాదల మధ్య పంచభక్ష్య పక్వాన్నాలతో వడ్డించిన సుష్ఠు భోజనం గావించాం. అక్కడ్నుంచి ఆర్కేబీచ్ కు వెళ్లి సరదాగా సాయం సమయాన ఆ బ్యూటీ స్పాట్ పై కాస్సేపు చర్చించుకున్నాం.
ఇక అప్పుడసలు తలపెట్టిన టూర్.. లంబసింగి దారుల్లో పడ్డాం. అంటే బ్యాక్ టూ అన్నవరం రోడ్. నర్సీపట్నం మీది నుంచి.. ఆదీవాసీలు, ఒకనాడు మావోయిస్టులకు పెట్టింది పేరైన చింతలపల్లికి… అక్కడ్నుంచి లంబసింగికి రీచ్ అయ్యాం. లంబసింగి క్యాంప్ ఫైర్, డేరాల్లో నిద్ర.. సుఖజీవితాలను ఒకింత ఇబ్బంది పెట్టినా.. వెళ్లిందే ఆ అనుభూతి కోసమాయె!
అలా మా లంబసింగి యాత్ర ముగించుకుని.. అక్కడ్నుంచైతే బయల్దేరాం గానీ.. డేగ రిసార్ట్స్ లో హీటర్ పనిచేయకపోవడంతో స్నానాలు పూర్తి కాలేదు. కానీ, పిఠాపురంలో శక్తిపీఠం, దత్తపీఠం, కుకుటేశ్వరుణ్ని దర్శించుకోవాలన్నది మా దోస్తుగాడి సంకల్పం. ఎలా..?
చూద్దాం.. అక్కడికెళ్లేసరికి మార్గమధ్యంలో ఏవైనా డార్మెటరీస్ దొరక్కపోతాయా అని వెహికిల్ ఎక్కాం. సంకల్పం గట్టిగా ఉండటం.. ఆ అన్నవరం సత్యదేవుడి ఆశీర్వచనం.. తన గుడికి వచ్చి లోనికి రాకుండా వెళ్లారన్న కోపం చూపని ఆ అప్పన్న దయ… ఆ పురుహూతిక అమ్మవారి దీవెనలతో… మేం వెళ్లే దారిలో కొబ్బరితోటల నడుమ స్వచ్ఛమైన గాలిలో కాళేశ్వరం పంపులను తలపించేలా ఓ బోర్ కనిపించింది.
ఇంకేం అక్కడే స్నానాదులు ముగించుకుని.. మళ్లీ ప్రయాణం. సాయంత్రానికిగానీ పిఠాపురం ఆలయం తెరవరంటే.. దగ్గరే కదా కాకినాడ చూసొద్దామని బయల్దేరాం. బీమాస్ రెస్టారెంట్ లో మళ్లీ మంచి వెజిటేరియన్ భోజనం చేసి.. ఇక అక్కడ్నుంచి మళ్లీ పిఠాపురం ప్రయాణం.
పిఠాపురంలో ముందుగా కుక్కుటేశ్వరుడిని దర్శించుకుందామనుకున్నా.. భక్తుల రద్దీతో ప్రెస్సే కదా అప్పుడప్పుడైనా దీన్ని వాడాలి కదా అని అక్కడి సూపరింటెండెంట్ ను కలిశాం. ముందు అమ్మవారి దగ్గరకు వెళ్లమని పంపారు, పురహూతిక అమ్మకు దండం పెట్టుకుని రాగానే.. ఓ మనిషిచ్చి కుకుటేశ్వరుడి గర్భగుళ్లో దర్శనం చేయించారు సదరు సిబ్బంది. అక్కడ్నుంచి శ్రీపాద వల్లభుడి దత్తపీఠంలో నమస్కారం పెట్టుకుని.. ఇక మా తిరుగు ప్రయాణం ప్రారంభమైంది.
అలుపెరుగకుండా మా ఇన్నోవా డ్రైవర్ సంపత్ చొరవతో.. ఏకంగా రాత్రి రెండు గంటల వరకే సూర్యాపేటకు చేరుకున్నాం. కానీ, తానూ మనిషే… అలసట తప్పదు. సార్ కాస్సేపు పడుకుంటానన్నాడు. తప్పకుండా అన్నాం. మళ్లీ ఐదింటికే మెలకువైంది. ఆరున్నరకల్లా హైదరాబాద్ లో ఒక్కొక్కర్నీ దింపేస్తూ.. సుమారు ఏడున్నరకల్లా కరీంనగర్ కు రిటర్న్ జర్నీ ప్రారంభించాం.
అప్పటికింకా ముఖం కడుక్కోకపోవడంతో మధ్యలో బృందావన్ హోటల్ మరో స్టాప్ పడింది. అక్కడే బ్రష్ పూర్తి చేసి.. ఓ ఛాయ్ తాగేద్దాం కడుపు టైట్ గా ఉందనుకుంటే… పొంగల్ కూడా ఉందనే విషయం మనసును లాగేసింది. జిహ్వాచాపల్యం ఆగలేకపోయింది.
అలా నేనో పొంగల్ తింటుంటే.. అప్పటికే, ఇడ్లీ వడ చెప్పిన మా డ్రైవర్ సంపత్ కూడా పొంగల్ వైపు చూసి ఆగలేక తానూ జై పొంగల్ అన్నాడు. పొంగల్ పనైంది.. ఛాయ్ చమక్కురా భాయ్ అని చిరంజీవి పాటనోసారి తల్చుకుని.. ఇరానీ ఛాయ్ తాగి మళ్లీ మా టూర్ ప్రారంభమైంది. రిటర్న్ జర్నీ టూ కరీంనగర్. మొత్తానికి పదకొండు గంటలకల్లా ఇంటికి చేరుకోవడంతో… కథ లంబసింగికి.. నేనింటికి!
Share this Article