Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సారు వస్తాడు… సారు చూస్తాడు… సారు ఆక్రమిస్తాడు..!

May 26, 2024 by M S R

వస్తాడు…చూస్తాడు…ఆక్రమిస్తాడు!

విలేఖరి:-
సార్! మీరు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర 65 ఎకరాలు కొంటానని నమ్మించి…ఆ భూముల అసలు యజమానులను తన్ని…తరిమేసి…భూములను ఆక్రమించి…అనుభవిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిమీద మీ స్పందన ఏమిటి?

మాజీ ఎమ్మెల్యే:-
తమ్మీ! మీకు జర్నలిజంలో అత్యంత సరళంగా రాయాలి; అత్యంత తేలిక పదాలతో మాట్లాడాలి అనే మౌలికమైన జర్నలిజం భాషా శాస్త్ర పాఠాలు చెప్పారో! లేదో! నాకు తెలియదు. ఒక వాక్యంలో నువ్వు ఎన్ని క్రియా పదాలు వాడావో చూడు! “కొంటానని, నమ్మించి, తన్ని, తరిమేసి, ఆక్రమించి, అనుభవించి, కేసు పెట్టి…”. వీటిని సంక్లిష్ట వాక్యాలంటారు. అర్థాన్వయానికి చాలా ఇబ్బంది అవుతుంది. నేనంటే భూ భాషను చెరపట్టాను కాబట్టి నాకు అర్థమవుతుంది. సామాన్య పాఠకులకు, ప్రేక్షకులకు సులభంగా అర్థం కాదు కదా? కాబట్టి ఈసారికి చెప్తాను కానీ…ఇకపై నీ ప్రశలో ఒక వాక్యంలో ఒక కర్త- ఒక కర్మ- ఒక క్రియా పదమే ఉండేలా జాగ్రత్తపడు. అప్పుడు నీకు భవిష్యత్తు ఉంటుంది.

Ads

…అయినా జర్నలిస్టులంటే నాకు అపారమైన గౌరవం కాబట్టి…నువ్వడిగిన అనేక క్రియా పదాల సంక్లిష్ట ప్రశ్నా వాక్యానికి క్రమాలంకారంలో బాధ్యతగా సమాధానం చెప్తాను.

వి:-
ఈరోజు నా కర్మ ఇలా కాలాలని రాసి పెట్టి ఉంటే…నా విధికి నేనే కర్తను. నా చెడిన బతుక్కు నేనే క్రియను. కానివ్వండి…

మా. ఎం:-
మొదటిది నేనెవరినీ కాలితో తన్నలేదు. నా తల్లిదండ్రులు నన్ను ఉగ్గుపాల బదులు సంస్కారవంతమైన త్రిబులెక్స్ సోప్ వుడ్ వర్డ్స్ గ్రయిప్ వాటర్ పోసి పెంచారు. తన్నినట్లు షో మీ వీడియో! కమాన్!

వి:-
సార్! “తన్ని తరిమేయడం” అన్నది తెలుగు పలుకుబడి. అంటే మీరు ఆ భూములను కొనకుండా వారిని బయటికి పంపి అక్రమంగా ఆక్రమించారని అర్థం.

మా. ఎం:-
ఆక్రమిచడంలో అక్రమం, సక్రమం ఉంటాయా తమ్మీ! విశేషణాలు తెలుసు కదా అని ఎలా పడితే అలా వాడేస్తే ఎలా చెప్పు? నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారమిది. నేను ఓడిపోగానే బయటికి వచ్చిందంటే ఇందులో ప్రతిపక్షాల కుట్ర కొట్టొచ్చినట్లు కనపడడం లేదా తమ్మీ?

వి:-
అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. దాంతో భయపడ్డారట. ఇప్పుడు ధైర్యం కూడగట్టుకుని కేసు పెట్టారట.

మా. ఎం:-
మళ్లీ మనం క్రమాలంకారంలోకే వెళదాం. అనుభవిస్తున్న మాట నిజం. వారు తరతరాలుగా అనుభవించరు. ఇంకొకరిని అనువభవించనివ్వరు. అటుగా ఒకరోజు వెళుతుంటే మా ఆవిడ ఇక్కడ మనకొక మల్లె తోట ఉంటే ఎంత బాగుంటుందో! అని మనసు పడింది. మా కోడలు ఇక్కడొక తులసి కోట కట్టుకుని రోజూ ఉదయాన్నే బాపూ సినిమాలోలా రాగి చెంబుతో నీళ్లు పోసి ప్రదక్షిణ చేయాలని మనసుపడింది. ఇక్కడొక క్యాంప్ ఫైర్ వేసి రాత్రి మింట చుక్కలు పొడిచేవేళ మంట ముందు ఫ్రెండ్స్ తో చుక్కలు తాగాలని మా అబ్బాయి మనసుపడ్డాడు. ఇక్కడ మామిడి కొమ్మకు ఊయల ఊగుతూ స్కూల్ ఎగ్గొట్టి గోళీలు ఆడుకుంటూ భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎలా కావాలో కలలు కంటానని మా మనవడు మనసుపడ్డాడు.

కుటుంబ పెద్దగా ఇవన్నీ తీర్చాల్సిన బాధ్యత నామీద ఉంటుంది కదా? దాంతో బాధ్యతగల ఎమ్మెల్యేగా ఒకటిన్నర సంవత్సరం అన్ని పనులు మానేసి…ఈ పని పూర్తి చేశాను. అయితే ఈలోపు మా నియోజకవర్గానికి ఇది బాగా దూరం. వారం వారం రాను పోను కష్టంగా ఉందని మా ఇంట్లో వారందరూ ఒకటే గోల చేస్తే…మా ఊరి మధ్యలోనే మూడెకరాల్లో ఇవే ఏర్పాట్లు చేశాను.

వి:-
ఆ మూడెకరాలు కూడా ఇదే మోడల్లో యజమానులను తన్ని…తరిమేసి…ఆక్రమించిందేనట కదా!

మా. ఎం:-
తమ్మీ! నువ్వు ముందు సరళ వాక్యాల్లో మాట్లాడ్డం నేర్చుకో. నేను స్కూల్లో టెంత్ టెన్ టైమ్స్, ఎలెవెన్త్ ఎలెవన్ టైమ్స్ రాసే రోజుల్లో నాకు బాగా నచ్చిన మాట; వచ్చిన మాట- జూలియస్ సీజర్ చెప్పిన-
“I came, I saw, I conquered”. ఈ మాట స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడంలో మా ఇంగ్లిష్ టీచర్ చేతిలో ఎన్ని బెత్తం దెబ్బలు తిన్నానో లెక్కే లేదు. చివరికి ఒక్క తప్పు లేకుండా ఎమ్మెల్యే అయ్యాక రాయగలిగాను. నేనిది రాయడమే కాకుండా…ప్రాక్టికల్ గా సాధించానని మా ఇంగ్లిష్ టీచర్ నాముందు సిగ్గుతో తలదించుకుని వెళ్లిపోతున్నారు. అట్లుంటది మనతోని.

వి:-
అవును సార్.
“మీరు వస్తారు.
మీరు చూస్తారు.
మీరు ఆక్రమిస్తారు”.

మీ ఇంగ్లిష్ సార్ కు నైతిక మద్దతుగా నేను కూడా సిగ్గుతో, భయంతో, బాధతో, అవమానంతో తలవంచుకుని వెళ్లిపోతున్నాను!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions