.
ఈ వర్షం సాక్షిగా…
ఈ వజ్రం సాక్షిగా…
ఎక్కడైనా దున్నితే దుమ్ము రేగుతుంది-
ఇక్కడ దున్నితే వజ్రాలు దొరుకుతాయి.
ఎక్కడైనా నాగేటి చాళ్ళల్లో తొలకరిలో విత్తనాలు చల్లుతారు-
ఇక్కడ తొలకరిలో వజ్రాలు మొలకెత్తుతాయి.
Ads
ఎక్కడైనా చేలల్లో కలుపు తీస్తారు-
ఇక్కడ చేలల్లో వజ్రాలు తీస్తారు.
ఎక్కడైనా పొలంలో సేద్యం చేసి గింజలను బస్తాలకెత్తుతారు-
ఇక్కడ పొలంలో వజ్రాలను వెలికి తీసి వార్తలకెక్కుతారు.
అది కృష్ణా- పెన్నా పరివాహక ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మద్దికెర, జొన్నగిరి, తుగ్గలి, వజ్రకరూరు మండలాల్లో తొలకరికి వజ్రాలు తేలే యథార్థగాథలకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఒక ప్రాంతం పేరే వజ్రకరూరు అని అనాదిగా ఉందంటే ఇక విడిగా చెప్పాల్సిన పనిలేదు.
జూన్, జులై వర్షాలు మొదలయ్యాక ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వేలమంది ఈ వజ్రాలవేటలో ఎలా పొలాల్లో పడి ఆశగా తవ్వుతున్నారో ఇంగ్లిష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో జర్నలిస్ట్ ఉమామహేశ్వర రావు లోతైన వార్త రాశారు. రెండు లక్షల నుండి అయిదు కోట్ల రూపాయలదాకా విలువైన వజ్రాలు దొరికిన ఉదంతాలను తారీఖులు, దస్తావేజుల ఆధారాలతో వివరించారు.
చివరకు స్థానికులే కాకుండా తెలంగాణ, కర్ణాటక నుండి కూడా ఇక్కడికొచ్చి వర్షం పడ్డ మరుసటిరోజు వజ్రాలవేటలో వేలమంది తమ అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటున్నారో చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన 105 క్యారెట్ల కోహినూర్ వజ్రం దొరికింది కూడా ఈప్రాంతంలోనే. నూటికో, కోటికో ఒక్కరికి దొరికే వజ్రం తమకు దక్కకపోతుందా అని ఎలా పొలాల్లో అలుపు సొలుపు లేకుండా తవ్వుతూ ఉంటారో ఈ వార్త చక్కగా వివరించింది.
ఈ వార్తనుండి కొంచెం వెనక్కు వెళితే…
రాయలసీమ- రత్నాలు రాశులు పోసి వీధుల్లో అమ్మిన రోజులను చూసిన కంటితోనే
వరుస కరువులను నెత్తిన పెట్టుకుని వలసలు వెళ్లిన రోజులను కూడా చూసింది.
రాయలసీమ- నెలకు ముమ్మారు వర్షాలు పలకరించి…పులకరించినప్పుడు చూసిన కంటితోనే ఏళ్లకేళ్ల వరుస కరువుల కన్నీళ్లను కూడా చూసింది.
గోరటి వెంకన్న పాటలో రాసినట్లు నిజంగానే వాన గాలికి సీమ స్నానమాడినప్పుడు నేలపై వజ్రాలు పొంగుతాయి. “వజ్రకరూరు”ను నిజంగానే కడుపులో దాచుకుంది రాయలసీమ.
నాలుగయిదు దశాబ్దాల్లో రైతులకు నిజంగా వజ్రాలు దొరికినా… చివరకు ఆ రైతు చేతికి దక్కే సొమ్ము ఆ వజ్రం విలువలో పది శాతం కూడా ఉండదని రుజువైన సందర్భాలు అనేకం. వజ్రం దొరికినప్పుడు వార్తల హడావుడే తప్ప… నికరంగా ఆ రైతుకో, కూలీకో మిగిలేది బూడిదేనని తాజా రుజువులు కూడా ఉన్నాయి.
అనుభవంలో నుండే సామెతలు పుడతాయి. వజ్రాలవేటలో దళారులు, వ్యాపారులకు సొమ్ము; వజ్రాన్ని వెలికి తీసినవాడికి దుమ్ము మిగులుతుందని ఈ ప్రాంతంలో అనాదిగా వాడుకలో ఉన్న సామెత!
1. ఫలానా ఊళ్లో, ఫలానా రైతు పొలంలో వజ్రం దొరికింది. దాని బరువింత. దాని విలువ ఇన్ని కోట్లు అని మీడియాలో వార్తలు చదవడానికే బాగుంటాయి కానీ… ఆ వజ్రం దొరికిన రైతుకు ఆ క్షణం నుండే ఎక్కడ లేని కష్టాలు వచ్చి పడతాయి.
2. మొదట రెవిన్యూ వారు, తరువాత పోలీసులు ప్రవేశిస్తారు. వజ్రం విలువ కట్టి… భద్రంగా ప్రభుత్వ ఖజానాకు తరలిస్తారు.
3. ఆ రైతును పోలీసులు దొంగలా చూస్తారు. రెవెన్యూ వారు దోషిలా చూస్తారు. సమాజం అసూయతో చూస్తుంది.
4. వారం, నెల, సంవత్సరాలు వజ్రం విలువను ఊహించుకుంటూ పొలం పనులు మానేసి… రైతు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ… పిచ్చివాడై… రోడ్డున పడతాడు.
5. ఒక తరం గడిచేలోపు అనేక దశల్లో ఫైలు కదిలి… ఆ వజ్రాన్ని బహిరంగ వేలం వేసి… మార్కెట్లో అమ్ముడుబోయిన విలువలో పది శాతానికి మించకుండా… రైతు చేతికి దక్కాలంటే… ఆ రైతు పెట్టి పుట్టాలి. లేదా… ఈలోపు వజ్రం కలలతో ఆ రైతు శాశ్వతంగా పోయినా… పోవచ్చు. దానికి రెవిన్యూ, పోలీసు వారి పూచీ ఉండదు!
ఇక్కడే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయో శాస్త్రీయంగా కారణాలను ఏనాడో విశ్లేషించారు. అయిదారు వందల ఏళ్ళకిందటి విజయనగర రాజుల కాలం నాటికే ఇక్కడ దొరికే వజ్రాల్లో రాజ్యానికెంత? యజమానికెంత? అన్న లెక్కలు స్పష్టంగా ఉండేవి.
కాకపోతే అప్పుడు వజ్రం విలువలో దాదాపు ఎనభై శాతం ఆ భూమి యజమానికిచ్చి… ఇరవై శాతం (కొందరు ఇది పదహారు శాతమే అన్నారు) మాత్రమే రాజ్యం ఖజానాకు జమకట్టమనేవారు. అది దక్షిణాపథంలో స్వర్ణయుగం కాబట్టి… అప్పుడలా ఉండేది. ఇప్పుడున్నవి మనకోసం, మనచేత, మనవలన, మనకై, మనమే ఎన్నుకున్న ఆదర్శ మనస్వామ్య ప్రజా ప్రభుత్వాలు. అందువల్ల విలువలో పదహారు శాతం కూడా ఆశించకూడదు. ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ అదే.
వజ్రం దొరికినప్పటి బాగోగుల సంగతి ఎలా ఉన్నా…
“వజ్రం మనకోసం వెతకదు- మనమే వజ్రసంకల్పంతో వజ్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి” అనుకుంటూ ఇక్కడ వజ్రాల వేట సాగుతూనే ఉంటుంది. ప్రతి ఏటా వర్షాలు మొదలుకాగానే ఎక్కడెక్కడినుండో వజ్రాలు దొరుకుతాయన్న ఆశకొద్దీ వచ్చేవారి తాకిడి ఎక్కువై… ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు.
“వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి!”
- పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article