Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాడండి… పాడించండి… పిల్లలకు అదే సాధన, అదే బోధన, అదే వినోదం…

December 4, 2023 by M S R

Language by Songs:

పల్లవి :
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే…  వింధ్య విలాసిని  వారాహి త్రిపురాంబికే
భవతీ విద్యాందేహీ… భగవతి సర్వార్థసాధికే… సత్యార్థచంద్రికే

మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

Ads

చరణం 1 :
ఆపాత మధురము… సంగీతము
అంచిత సంగాతము… సంచిత సంకేతము
శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము… అమృత సంపాతము… సుకృత సంపాకము
సరిగమస్వరధుని సారవరూధినీ… సామనాదవినోదినీ
సకల కళాకళ్యాణి సుహాసినీ… శ్రీ రాగాలయ వాసిని

మాం పాహి మకరంద మందాకిని
మాం పాహి సుజ్ఞానసంవర్ధినీ

చరణం 2 :
ఆలోచనామృతము సాహిత్యము… సహిత హిత సత్యము… శారదా స్తన్యము
సారస్వతాక్షర సారధ్యము… జ్ఞానసామ్రాజ్యము… జన్మసాఫల్యము
సరసవచోభిణి సారసలోచని వాణీ పుస్తకధారిణీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణీ
మాం పాహి సాలోక్య సంధాయినీ
మాం పాహి శ్రీచక్ర సింహాసినీ…

కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ సినిమా స్వాతికిరణం(1992). వీనులవిందైన సినిమా పాటలకు మేనమామ కె వి మహదేవన్ సంగీతం. తెలుగు సినీగీత రచనా వైభవ పతాకను మోసిన చివరి రచయిత సిరివెన్నెల సాహిత్యం. గొంతులో అమృతం చిలికించగల వాణీజయరాం గానం.

ఒక చరణంలో సాహిత్యం, మరో చరణంలో సంగీతం గొప్పతనమేమిటో నిర్వచించారు సిరివెన్నెల. పొద్దుపోవడానికి వినాల్సిన పాటలు కొన్ని. అర్థంతో సంబంధం లేకుండా శబ్దాల హోరుకు ఎగరాల్సిన పాటలు కొన్ని. ఆ కథా సందర్భం నుండి బయటికి తీస్తే అర్థం కాని పాటలు కొన్ని. సందర్భం దాటి లక్షణ గ్రంథాలుగా, సిద్ధాంత వ్యాసాలుగా, ఆయా విషయాలకు రెఫెరెన్సులుగా, నిఘంటువులుగా నిలిచి ఉండే పాటలు కొన్ని. ఈ పాట అలా సంగీత సాహిత్యాలకు సిద్ధాంతగీతం.

“సంగీతము- సంగాతము- సంకేతము
సంప్రాప్తము- సంపాతము- సంపాకము”

“హితసత్యము- శారదా స్తన్యము- సారస్వతాక్షర సారధ్యము- జ్ఞానసామ్రాజ్యము- జన్మ సాఫల్యము”

సంస్కృతంలో బాగా ప్రచారంలో ఉన్న “ఆలోచనామృతం సాహిత్యం;  ఆపాతమధురం సంగీతం” అన్న వాడుకమాటను సిరివెన్నెల తన కలంతో అజరామరమైన గీతంగా తీర్చి దిద్దారు. వాణీజయరాం తీయటి కంచు కంఠం ఈ సాహిత్య స్వర్ణానికి సువాసనలను అద్దింది. ఇది రాస్తే, చెబితే అర్ధమయ్యే అమృతం కాదు. వింటే దొరికే కర్ణామృతం. అనుభవిస్తే దొరికే సంగీత సాహిత్య రసామృతం.

Doubts Death Of Vanijayaram

“మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ
పలుగాన లహరి యింపుల రాల్గరంగ
బలసి వినువారి చెవి బడలిక దొలంగ”

అని అన్నమయ్య ఒక లాలిపాటలో తెలుగు సాహిత్యంలో ఎవ్వరూ ప్రయోగించని ఒక మాటన్నాడు. శరీర బడలిక తెలిసిందే. చెవి కూడా విని వినీ బడలికకు గురవుతుంది. అప్పుడు మలయ మారుతాలు వీచాలి. మాటల్లో కర్పూర పరిమళాలు గుప్పుమనాలి. రాళ్లు కరిగే రాగాలు వినిపించాలి. ఈ గానామృతానికి చెవి బడలిక తొలగిపోవాలి. ఈ స్థాయిలో వెంకన్న చెవి బడలిక తీర్చిన పదాలు కాబట్టి వెంకన్న మళ్లీ మళ్లీ వాటినే రీ ప్లే చేసుకుని వింటూనే ఉన్నాడు. ఇంకో అన్నమయ్య పుట్టే అవకాశమే లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా వాటినే వింటూ ఉంటాడు.

అలా చెవి బడలిక తొలగిపోయే పాటలకు మాటరాని పసి పిల్లలు కూడా మైమరచిపోతారని; భాషలో మాటలకన్నా ఆ మాటలు పాటగా మారినప్పుడు పసి పిల్లలు మరింత చెవి ఒగ్గి వింటారని; పాటల ద్వారానే భాషను పసి పిల్లలు బాగా పట్టుగోగలుగుతారని-బ్రిటన్ కేంబ్రిడ్జ్ -ట్రినిటీ కాలేజీల సంయుక్త అధ్యయనంలో శాస్త్రీయంగా రుజువయ్యింది. ఈ అధ్యయన బృందంలో భారత మూలాలున్న శాస్త్రవేత్త కూడా ఒకరున్నారు.

ఈ అధ్యయనం తేల్చిన విషయాలు:-
1 . సంవత్సరం లోపు పిల్లలు మాటకంటే పాటకే ఎక్కువగా ఆకర్షితులవుతారు.
2 . తల్లిదండ్రులు ఏడాది లోపు పిల్లలతో గేయరూపంలో సంభాషిస్తే…పిల్లల ఉచ్చారణ, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
3 . భాషలో శబ్దానికి ఉన్న అక్షర రూపం పిల్లలకు అంత ప్రధానం కాదు. వారికి శబ్దమే ప్రధానం. ఆ శబ్దం రాగంతో ఉంటే పిల్లలకు అమితానందం.

“సడిసేయకో గాలి… సడి సేయబోకే
బడలి ఒడిలో మా బాబు/పాప పవ్వళించేనే
రత్నపీఠిక లేని… రారాజు/రారాణి నా స్వామి/దేవి 
మణికిరీటము లేని… మారాజు/మారాణి గాకేమి?
చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే
ఏటి గలగలలకే… ఎగసి లేచేనే
ఆకు కదలికలకే… అదరి చూచేనే
నిదుర చెదిరిందంటే నేనూరుకోనే
సడి సేయకే
పండువెన్నెలనడిగి… పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు… నిదుర తేరాదే
విరుల వీవనపూని… విసిరి పోరాదే”

అని మన దేవులపల్లి కృష్ణశాస్త్రి మనకిచ్చి వెళ్లిన జోలపాట పాడతారో!

“చిట్టి చిలకమ్మా!
అమ్మ కొట్టిందా?”
అని చిలుక అవుతారో!

“ఏనుగమ్మ! ఏనుగు!
మా ఊరొచ్చిందేనుగు!”
అని ఏనుగు అవుతారో!

“చికుబుకు రైలు వస్తోంది…
దూరం దూరం జరగండి…”
అని రైలు బండి అవుతారో!
మీ ఇష్టం .

పసిపిల్లల ముందు మీరు పాటయి…పల్లవించాలి అని మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏడాదిలోపు తడబడే వారి చరణాలకు మీ చరణాలే ఆలంబన అని తెలుసుకుని గొంతు విప్పి పాడండి. పాడితే పోయేదేమీ లేదు…మీ పిల్లల భాష మెరుగుపడడం తప్ప… – పమిడికాల్వ మధుసూదన్, 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions