భాష అనే నేను…!
———————
న్యుజిలాండ్ లో కొత్తగా ఎన్నికయిన భారత సంతతి ఎంపి మొదట న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో ప్రమాణం చేసి, తరువాత సంస్కృతంలో కూడా ప్రమాణం చేశాడు. గుజరాత్ లో జరిగిన స్పీకర్ల సదస్సులో చట్టసభల్లో ప్రజాప్రతినిథుల భాష హుందాగా ఉండాలని భారత రాష్ట్రపతి సూచించారు. ఈ రెండు వార్తలకు ఎలాంటి సంబంధం లేదు- భాష అన్న ఒక్క విషయంలో తప్ప.
ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనం రాసిపెట్టుకున్న పదవీ స్వీకార ప్రమాణ వాక్కు చాలా గంభీరంగా, భాషాపరంగా పలకలేనంత సంక్లిష్టంగా, సంస్కృత సమాస పదబంధురంగా, అనేక ద్విత్వాక్షరాలతో ఉంది.
Ads
“….. అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని; భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని; నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని; భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను”
దేశ సార్వభౌమాధికారాన్ని అన్న మాటదగ్గర చాలా మంది భౌ.. బౌమ.. అంటూ ఒకటికి రెండుసార్లు తడబడుతున్నారు. సమగ్రతను కాపాడ్డం దగ్గర కూడా ఉచ్చారణలో సమగ్రత, స్పష్టత లోపిస్తోంది. ఇక అంతఃకరణ శుద్ధిలో విసర్గ పలకడానికి చుక్కలు కనపడుతున్నాయి. మొత్తమ్మీద ప్రమాణ వాక్కు వాగ్దోషాలతో ఆదిలోనే హంసపాదుగా తయారవుతోంది. ఎవరెవరు భౌమ భౌమ అన్నారో? ఎవరెవరెవరు శ ష స తేడా తెలియక పలికారో? అంతఃకరణంలో విసర్గ అశ్వథామ హతః కుంజరః అయ్యిందో? ఎవరెవరు ప్రమాణవాక్కు చూసి చదవడంలో నిలువెల్లా వణికిపోయారో? సామాజిక మాధ్యమాల నిండా లెక్కలేనన్ని రుజువులున్నాయి. ఆ వివరాలు ఇక్కడ అనవసరం.
వందేళ్ల కిందటి పరిస్థితులు, భాషాభిమానం, ఉచ్చారణ పద్ధతులు ఇప్పుడు ఉండాలనుకోవడం తప్పు. జనం ఓట్లేసి గెలిపించేది చట్టసభల్లో తమ సమస్యలను వినిపించమనే కానీ- సార్వభౌమ, అంతః కరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం… అన్న సంక్లిష్ట భార పదబంధుర సమాసాలను ఎలా చదువుతారో చూద్దామని కాదు. రాజ్యాంగ విధివిధానాల ప్రకారం ప్రమాణస్వీకారం చేసి తీరాలే కానీ- ప్రమాణ వాక్కులో ఉచ్చారణ దోషాలు ఉంటే ఆ ప్రమాణం చెల్లదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఉండాలని కోరుకోకూడదు.
ముప్పయ్, నలభై ఏళ్లుగా అంతా ఇంగ్లీషు మీడియం చదువులు. తెలుగు మాట్లాడగలమే కానీ- చక్కగా రాయడం, చదవడం అంటే నిజంగా అగ్ని పరీక్షే. ప్రమాణ వాక్కుకు ముందు అభ్యాసం, పరీక్షలు ఉండవు. అలా పరీక్షలు పెడితే మళ్లీ అందులో నారాయణ- చైతన్య కోచింగ్ తీసుకున్నవారు మాత్రమే పాస్ అవుతారు కాబట్టి- అది రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అవుతుంది. ఈ సమస్యకు పరిష్కారం లేకపోలేదు. భాషా శాస్త్రవేత్తలు, పండితులు కూర్చుని ఒత్తులు, కఠిన పదాలు, పదబంధాలు లేకుండా ప్రమాణ వాక్కును సులభతరం, సరళతరం చేయాలి.
“మంత్రహీనం
క్రియాహీనం
భక్తిహీనం
గణాధిప యత్పూజితం మయాదేవ!”
అని పూజ అంతా అయ్యాక డిస్ క్లైమర్ విధిగా చెప్పి అక్షింతలు నీళ్లు విధిగా వదలాలి. ఇది ఆచారం. పూజావిధి. అంటే నేను చెప్పిన మంత్రాల్లో ఏదయినా తప్పుగా పలికి ఉంటే మన్నించమని వేడుకోలు.
“యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవి శ్రీమాతానమో స్తుతే”
అక్షరం, పదం, చివరికి అరసున్న, విసర్గ తప్పు చెప్పినా మన్నించు అని మరో మంత్ర సమాప్తి వాక్యం.
ప్రజాస్వామ్య దేవాలయానికి మూల స్తంభమయిన చట్ట సభల్లోకి ప్రవేశించే, లేదా చేపట్టబోయే పదవికి ముందు చేసే ప్రమాణవాక్కులో తప్పులు దొర్లితే ఇంకెన్ని క్షమాపణలు చెప్పుకోవాలి? తప్పుల్లేకుండా చదవనయినా చదవాలి. లేదా ప్రమాణ వాక్కును చాలా సరళమయినా చేయాలి. ఎంత సరళం చేసినా తెలుగు చదవలేని జాతి పుట్టి పెరిగి ఉంది కాబట్టి పెద్దగా ఈ విషయం చర్చకు నిలబడదు. ఎర్లీ మార్నింగ్ టెనో క్లాక్కే నిద్ర లేచారా? అన్న అద్భుతమయిన తెలుగు వ్యక్తీకరణ తెలుగులో రాస్తే- ఇప్పుడు చదవడం కష్టం.
తెలుగు సినిమా పాటలను ఇంగ్లీషు లిపిలో రాసినట్లు- yarly marning teno klakke nidra lechara? అని రాస్తేనే ఠక్కున చదవగలం. ఇది ఫ్యాషన్. ట్రెండ్. కొంతకాలానికి తెలుగు భాష గోచీ గుడ్డతో మిగిలి, లిపి మాత్రం అంతరించిపోవచ్చు. దానికి శక్తివంచన లేకుండా మనం చేస్తున్న లిపి ధ్వంస రచన వృథాపోదు.
అన్నట్లు- న్యూజిలాండ్ ఎంపి సంస్కృతంలో ప్రమాణం చేయడం మనలో స్ఫూర్తి నింపి భారతదేశంలో కూడా చట్టసభల్లో సంస్కృతంలో ప్రజాప్రతినిథులు ప్రమాణం చేస్తున్నట్లు ఒకసారి ఊహించుకోండి. అప్పుడు ఈ భౌమ భౌల తడబాట్లు ఎంత గొప్పవో, ఎంత వీనుల విందయినవో బోధపడుతుంది.
చట్టసభల్లో ప్రజాప్రతినిథుల భాష హుందాతనం గురించి రాష్ట్రపతే సెలవిచ్చారు కాబట్టి మనం ఆశగా, హుందాగా ఎదురు చూద్దాం.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article