మీ అడ్రస్ ఏమిటి?…. – మహమ్మద్ ఖదీర్‌బాబు
ఎవరికైనా అడ్రస్ లేకపోతే ‘వాడో ప్లాట్‌ఫామ్ గాడు’ అంటుంటారు. ‘లాపతా లేడీస్’లో ప్లాట్‌ఫామ్‌నే ఒక అడ్రస్‌గా చేసుకుని ఆత్మగౌరవంతో ఉంటుందో హోటలావిడ. ‘మొగుడుండేవాడు. కొడుకు ఉండేవాడు. నా డబ్బులు తిని నన్ను వేధించేవారు. తన్ని తగలేశాను’ అంటుందామె.
పతా అంటే అడ్రస్. లాపతా అంటే అడ్రస్ లేకపోవడం. లేకుండా పోవడం. సరిగా చెప్పాలంటే తమ గుర్తింపును తాము కోల్పోవడం. గుర్తింపు నుంచి తప్పిపోవడం. ‘జాగ్తే రహో’ అని ఈ సినిమాలో ఒక ముసలాడు మంచాన పడి సగం తెరిచిన కళ్లతో ఉండి ఉండి అరుస్తుంటాడు. ఈ దేశంలో స్త్రీలు, స్త్రీల గురించి పురుషులు సగం మెలుకువగా సగం మగతగా ఉన్నారు. పూర్తిగా మెలకువ రావడానికి చాలా కాలం పడుతుంది.
ఫోన్లు, వాట్సప్‌లు వచ్చాక ఏమో కాని ముప్పై ఏళ్ల క్రితం వరకూ ఏ ఇంటికైనా ఏ ఉత్తరమైనా వచ్చేది మగవాడి పేరు మీదే. స్త్రీలకు వచ్చినా మదరాఫ్, వైఫాఫ్, డాటరాఫ్ అని సదరు మగవాడి పేరు చెప్తేనే ఆ ఉత్తరం అందుతుంది. చిరుమానా అంటే అది. మగాడిదే చిరునామా.
‘లాపతా లేడీస్’ పెళ్లయ్యి పెళ్లికూతురు అత్తారింటికి బయలుదేరడంతో మొదలవుతుంది. ఒక స్త్రీ తన చిరునామా కోల్పోయి పరాయి ఇంటికి పోవడం, లేదా పరాయి ఇంటికి పోవడం వల్ల తన చిరునామా కోల్పోవడం… సింబాలిజం.
అంతదాకా ఆమె గాయని కావచ్చు. ఆ చిరునామా పోతుంది.
అంతదాకా ఆమె చిత్రకారిణి కావచ్చు. ఆ చిరునామా పోతుంది.
బాగా చదువుకోవాలని అనుకుని ఉండొచ్చు. ఆ చిరునామా పోతుంది.
బాగా ఉద్యోగం చేయాలని అనుకొని ఉండొచ్చు. ఆ చిరునామా పోతుంది.
పెళ్లయ్యాక భర్త, అత్తారింటి అనుమతి దొరికితే చిరునామా ఉంటుంది. లేదా పోతుంది. ఆమె చిరునామాకు వారు పెత్తందార్లు ఎలా అయ్యారు?
‘స్త్రీ కనగలదు. పెంచగలదు. పండించగలదు. వండగలదు. చెప్పాలంటే ఆమెకు పురుషుడితో పెద్దగా పని లేదు. ఇది స్త్రీకి తెలియనివ్వకుండా పురుషుడు జాగ్రత్త పడుతున్నాడు. దీనికి మించిన స్కామ్ లేదు’ అని ప్లాట్‌ఫామ్ ఆవిడ హీరోయిన్‌తో అంటుంది.
ఈ జవాబు తెలియకుండా ఉండటం కోసమే స్త్రీలకు దారులు తెలియకుండా, చిరునామాలు తెలియకుండా పరిమితం చేస్తారు. ఆమెకు కాలేజీ అడ్రస్, ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్ అడ్రస్, స్కిల్స్ సెంటర్ అడ్రస్, అంట్రప్రెన్యూర్‌షిప్ అడ్రస్, అసెంబ్లీ పార్లమెంట్‌ల అడ్రస్ ఏదీ తెలియనివ్వరు. ఒకవేళ తెలుసుకుని ప్రయత్నించాలనుకున్నా అందుకు ‘మగవాడి తోడు/అనుమతి’ ఉండేలా ఇంటా బయటా పకడ్బందీ వ్యవస్థను నిర్మించి ఉంటారు.
‘ఏదో పెళ్లానికి రెండు ముద్దలు పెట్టగలిగితే చాలు’ అని నేటికీ బీద, దిగువ వర్గాల్లో అబ్బాయి పనీ గినీ అడ్రస్ మనస్తత్వం ఏమిటో తెలుసుకోకుండా కట్టబెట్టేవాళ్లు లేరా? వాడితో బయలుదేరి వెళ్లి ఎందరు ఏమవుతున్నారో ఎందరు లాపతా అవుతున్నారో లెక్కలు లేవు.
సరిగ్గా అడ్రస్ పట్టుకుని మెట్టినింటికి వెళ్లి సరిగా అడ్రస్ పట్టుకుని తిరిగి పుట్టింటికి రాగల చదువు, లోకజ్ఞానం కలిగిన ఆడపిల్లలు తయారు కాలేని వర్గాలు ఈ అమృత భారతాన దేవుని దయవల్ల అలరాలుతూనే ఉన్నాయి.
‘నేనేదైనా దొంగిలించానంటే నా జీవితం నుంచి ఒక అవకాశాన్నే’ అంటుంది హీరోయిన్ ఈ సినిమాలో. తమ గమ్యమేదో తెలుసుకుని ఆ చిరుమానాను వెతుక్కుంటూ వెళ్లడానికి జీవితం నుంచి ఒక అవకాశాన్ని దొంగలించగల ధైర్యం ప్రదర్శించే స్త్రీలు ఎందరు– ఇప్పటికీ.
గొప్ప ప్రతిభ, నైపుణ్యం, ప్రావీణ్యం, ఆసక్తి, అర్హత, సమర్థత, యోగ్యత… ఇవన్నీ కలిగీ– ఇష్టంగానే కావచ్చు ఎంపికతోనే కావచ్చు పెళ్లీ సంసారాల్లో ఉంటూ ఆ చిరునామాలన్నీ కోల్పోయిన స్త్రీలు వాటిని ఒకసారి తలుచుకుని నిద్రలో ఉలికిపాటుకు గురయ్యే సినిమా– లాపతా లేడీస్.
కిటికి రెక్క కొద్దిగా తెరిచి లేశమాత్రపు గాలి పీల్చుకోవడానికి కూడా బెరుగ్గా భర్త వైపు చూడాల్సి వచ్చే స్త్రీలు తలవొంపులతో తల ఒంచుకునేలా చేసే సినిమా– లాపతా లేడీస్.
– మే, 2024
పి.ఎస్: లాపతా లేడీస్– కిరణ్ రావ్ దర్శకత్వం వహించిన సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అత్తారింటికి వెళుతూ రైల్లో తప్పిపోయిన ఇద్దరు పెళ్లికూతుళ్ల కథ ఇది…
Share this Article