35 కోట్లు ఖర్చు అట… కొంత అసాధారణం అనిపిస్తున్నా సరే… ఖర్చు మాత్రం భారీగా పెడుతున్నారనేది నిజం… ఆహా ఓటీటీ వాళ్లు తెలుగు ఇండియన్ ఐడల్ కోసం..! ఆర్కెస్ట్రా, థమన్, కార్తీక్, శ్రీరామచంద్ర, గీతామాధురిలకు ఇచ్చే రెమ్యునరేషనే చాలా ఎక్కువ ఈ ఖర్చులో… ఇవిగాకుండా ఆడిషన్స్ ఏర్పాట్లు, ప్రతివారం షూటింగ్ ఎట్సెట్రా… సరే, ఆమేరకు యాడ్స్, స్పాన్సరర్స్ కూడా బాగానే ఉన్నట్టున్నయ్…
ఎటొచ్చీ… మొదటి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి గాయకులకు ఏవైనా ఇన్‌స్ట్రుమెంట్లలో ప్రవేశం ఉంటే ఎక్కువ మార్కులు వేస్తున్నట్టున్నారు… అన్‌వీల్ రోజు జడ్జిలు అదే గొప్పగా చెప్పుకున్నారు… బహుశా హిందీ ఇండియన్ ఐడల్ పవన్ దీప్ రాజన్‌ను చూసి ఇన్‌స్పయిర్ అయ్యారేమో… తను వేరు, ఎక్సట్రార్డినరే టాలెంట్…
ఆ ప్రతిభ అందరికీ ఉండాలని లేదు, ఉండటమే అర్హత కాబోదు, కాకూడదు… ఇది వోకల్ టాలెంట్‌కే పరీక్ష… ప్రదర్శన… ఓ గిటార్, ఓ వయోలిన్, ఓ తబలా, ఓ మృదంగం, ఓ కీబోర్డు గట్రా వాయించగలిగితే అది అదనపు ఫ్లేవర్ అవుతుందే తప్ప అసలు పరీక్ష దానికి కాదు… పైగా ఒకటో రెండో ఇన్‌స్ట్రుమెంట్లలో ప్రవేశం ఉంటే ఏకంగా కంపోజింగ్ సామర్థ్యం ఉన్నట్టూ కాదు… కంపోజింగ్ క్వాలిటీలు వేరు… అవి సంగీత వాయిద్యాల మీద ప్రతిభతో రావు… పైగా మంచి ఆర్కెస్ట్రా ఉండనే ఉంది… మళ్లీ గాయకులు విడిగా వాయించడం దేనికి..?
Ads
మరొక లోపమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది… ఆడిషన్స్‌కు వస్తున్నవారు చెప్పే ఏవో వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు కూడా ఎంపికల్ని ప్రభావితం చేస్తున్నట్టుగా ఉంది… అదీ కరెక్టు కాదు… లోపాలు, సమస్యలు లేని వ్యక్తులు ఎవరుంటారు..? నా తల్లికి ఈ ఆడిషన్ అంకితం చేస్తున్నాను ఓ అభ్యర్థి చెబితే, వెంటనే థమన్ కదిలిపోయి, తన ఫీలింగ్స్ ఏవో షేర్ చేసుకుని, కదిలిపోయి, సదరు అభ్యర్థి పట్ల వెంటనే ఓ పాజిటివ్ ఫీలింగ్ చూపించడం కరెక్టు కాదు…
పైగా ఇలాంటి ఎమోషన్స్ కొంతమేరకు షోను ఆసక్తికరంగా మారుస్తాయేమో తప్ప అల్టిమేట్‌గా ఆయా కంటెస్టెంట్ల సాధన, పాటించే మెలకువలు, గొంతు, ఎంచుకునే పాటలు, రాగసహితమైన ఆలాపన, పదాల ఉచ్ఛరణలో స్పష్టత, కొన్ని పదాలు పలికేటప్పుడు కనిపించే ఉద్వేగం… ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి, రావాలి… ఎలాగూ ముగ్గురు జడ్జిలు, హోస్ట్ అందరూ సినిమా పాటల ప్రపంచంలో బతుకుతున్నవారే, సీనియర్లే, మెరిటోరియసే కాబట్టి ఎవరి ప్రతిభ ఏమిటో ఇట్టే పట్టేయగలరు, మిగతా అంశాలు తీర్పును ప్రభావితం చేయకూడదు…
ఏదో షో సరదాగా ఉండటం కోసం కొందరు నాన్ సీరియస్, ఫేక్ కంటెస్టెంట్లతో పాడిస్తున్నారు… చూస్తున్నంతసేపూ సరే, ఏదో నవ్వుకుంటున్నా… ఓవరాల్‌గా షో సీరియస్‌నెస్ తగ్గిస్తుంది… అనేక దేశాలు, అన్ని వేల మందిని వడబోయడం నిజంగానే పెద్ద టాస్క్, వారిలో 12 మందిని సెలక్ట్ చేసి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్, ఇంటర్వ్యూస్ దాకా తీసుకొచ్చి చివరకు వాళ్లను అంతిమ పరీక్షకు నిలబెట్టాలి…
అలాగే కొందరికి నేరుగా టికెట్టు గాకుండా (అంటే తదుపరి పరీక్షకు ఎంట్రీ) నేరుగా గోల్డెన్ మైక్ ఇచ్చేస్తున్నారు… ఫస్ట్, సెకండ్ సీజన్లలో కూడా కొందరికి అలా ఇచ్చారు… పర్లేదు, వాళ్లంతా ప్రూవ్ చేసుకున్నారు… కానీ కొందరికి నేరుగా గోల్డెన్ మైక్ ఇవ్వడం, కొందరికి టికెట్లు ఇచ్చి మళ్లీ పరీక్షించడం సరికాదేమో… అందరినీ ఒకేలా చూసి, అందరినీ మలిదశలో పరీక్షించడం కరెక్టు పద్ధతి… ఐనా ఏముందిలే… తమన్ ఏది చెబితే అది… సార్, ఏ కుర్చీ మడతబెడితే అదే ప్రామాణికం..!!
Share this Article