మానవత్వమే మతం కావాల్సిన చోట.. మతం అమానవీయమైన మంటల్ని పుట్టిస్తోంది. మనిషి.. తన ఉనికి, జాడ లేని మునుపు లేని కులాన్ని… తమ అస్తిత్వాలకంటూ ముందరేసి కులచిచ్చుల్లో చలిమంట కాగుతున్నాడు. ఇలాంటి శాంతి కరువైన సందర్భంలో.. తెల్లార్లేస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు విచ్చిన్నమైన చోట ప్రారంభమై… దేశాల మధ్య ఆధిపత్య పోరు కోసం జరుగుతున్న మారణహోమాల వరకూ మానవ పయనం పతనం వైపే దూసుకెళ్లుతుండటం దురదృష్టకరం, విషాదం!
మరోవైపు ఉదయం లేస్తే ఎప్పుడో ఇంటికి చేరేవరకూ మెకానికల్ లైఫ్ కు అలవాటుపడ్డ రోజుల్లో.. కాసింత సేదతీరే సమయం.. అందుకు కావల్సిన వాతావరణం కూడా కొరవడి.. అశాంతి జీవితాల్లో ఓ కేరాఫ్ లా మారిపోయిన దుస్థితి. ఇదిగో ఇలాంటి సమయంలోనే మెడిటేషన్ సెంటర్స్ చాలామందికి ఊరటనిస్తున్నాయి. అయితే విపశ్యన, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామచంద్ర మిషన్ వంటి ఎన్నో మెడిటేషన్ సెంటర్స్ కు క్యూ కట్టేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా… ధ్యానానికి కేరాఫ్ అయిన కాశీలోని ఓ ధ్యాన కేంద్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
కాశీ అంటేనే ఓ భూకైలాసం. బిడ్డను కనే తల్లి మునిగే గంగా ఒక్కటే… భవబంధాలను విడిచి అనాథ శవంలా అంత్యక్రియలకు కూడా నోచుకోక కొట్టుకొచ్చే మృతదేహాల కేరాఫైన గంగా ఒక్కటే! అలాంటి చోట ఓవైపు కాశీ విశ్వనాథుడు… పక్కనే విశాలాక్షి… తలపై గంగమ్మ.. మరోవైపు గంగతో పోటీ పడే భక్తజనం… ఇంకోవైపు బాహ్యసౌందర్యాన్ని వదిలి అంతర్ముఖ ప్రయాణం చేస్తూ కనిపించే అఘోరాలు… ఇలా ఈ ఆధ్యాత్మిక కేంద్రం వాస్తవానికి దానికదే ఓ ధ్యాన కేంద్రం!
Ads
ఇలాంటి చోట సరిగ్గా వారణాసికి 12 కిలోమీటర్ల దూరంలో గంగానదీ తీరాన ఉమ్రాహ్ లో వెలిసిన స్వర్ వేద్ మహామందిర్ గురించి కూడా ఇప్పుడు చెప్పుకోవాలి. ఇదిప్పుడు స్వర్ వేద్ మహామందిర్ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం. ఈ మధ్యే ప్రధాని మోడీ ఈ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అసలు కాశీలో ఇప్పుడు స్వర్ వేద్ మహామందిర్ అవసరమేమొచ్చింది..?
స్వర్ వేద్ మహామందిర్ అనేది ఆధ్యాత్మిక మార్గమే ఆత్మజ్ఞానమని నమ్మిన సద్గురు సదాఫల్ దేయోజీ మహారాజ్ రచించిన స్వర్ వేద్ గ్రంథానికి ఓ భౌతిక రూపం. ఆయన సమాధిస్థితిలోని ఆధ్యాత్మిక అనుభవాల సమాహారం. అంతేకాదు, వడివడిగా ఇంకేదో చేయాలన్న పరిశోధనతో పరితపిస్తున్న మానవ మేథస్సుకు మోరల్స్ ని, స్పిర్చ్యువాలిటీని అందించేందుకు ఏర్పాటు చేయబడ్డ ఓ ధ్యాన కేంద్రం.
ఒక్క మాటలో చెప్పాలంటే కాశీ వంటి మహాక్షేత్రంలో వచ్చి చేరిన మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం స్వర్ వేద్ మహామందిర్. ఏకంగా 20 వేల మంది ఒకేసారి ధాన్యం చేయగల్గేలా దీన్ని నిర్మించారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది… ఓ ఫలానా మతానికో, కులానికో ఉద్ధేశించింది అస్సలు కాదు.. మతాలు, కులాలకతీతంగా… మానవత్వమే మతమనుకునేవారెవ్వరైనా ఇక్కడికొచ్చి ధ్యానం చేసుకునేలా ఈ మహామందిర నియమావళిని రూపొందించడం ప్రస్తుత ప్రపంచంలో గొప్పగా చెప్పుకోవాల్సిన మరో విశేషం.
3 లక్షల చదరపు అడుగులకు మించిన విస్తీర్ణంలో ఏడంత్రాల చూడముచ్చటైన భవనంతో… ఎటు చూసినా వేదాలు, శ్లోకాలతో కనిపించే గోడలతో… ఆధ్యాత్మికతను కోరుకునే అన్వేషకులకు ఊరటనిచ్చే ఓ చలివేంద్రం ఈ మహామందిరం. 3137 మార్బుల్స్ పై చెక్కిన ఆధ్యాత్మిక గ్రంథాల సారం అక్కడికి వెళ్లిన వారిలో కచ్చితంగా ఎంతో కొంత పరివర్తనకు కారణమవుతుంది.
సామాజిక, సాంఘిక దురాచారాలను పారద్రోలే సత్సంగాలు ఈ మహామందిరంలో వినిపిస్తాయి. గ్రామీణ భారతంలో శాంతిస్థాపన కోసం, పల్లెల్ని మరింత దృఢం చేయడం కోసం ఇక్కడి ప్రసంగాలు ఆకట్టుకుంటాయి. చుట్టూ ఔషధ మూలికల తోటతో విస్తరించిన స్వర్ వేద్ మహామందిర్.. గులాబీరంగు ఇసుక రాళ్లతో నేత్రానందాన్నే కాకుండా… ఇప్పుడెందరో భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్నందిచే చైతన్య వేదిక. ధ్యానంతో జీవన పరమార్థాన్ని, అంతకుమించిన మనశ్శాంతిని ప్రసాదించే ఓ మహాప్రసాదం. మొత్తంగా ఇప్పుడు కాశీ సిగలో వెలసి సువాసనలు పంచుతున్న ఓ సుగంధ పరిమళ పుష్పం….. (రమణ కొంటికర్ల)
Share this Article