Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జీవితం క్షణ‘భంగు’రం అంటే ఏమిటో అప్పుడే అర్థమైంది..!!

June 15, 2021 by M S R

……….. By……….. Taadi Prakash…………. శ్రీశ్రీకి… అశ్రుదీపాల అల్విదా!… Last Journey of the greatest poet of 20th century

———————————————

రాయగడలో సూర్యోదయంతోపాటే లేచారు శ్రీశ్రీ. ఉదయం 8.30కే చర్చావేదిక. ప్రశ్న జవాబు సెషన్. సాయంత్రం బహిరంగ సభ.

Ads

1981 మే నెల 2వ తేదీ శనివారం.

రాయగడ మున్సిపల్ టౌన్ హాలు. శ్రీశ్రీకి సన్మానం.

రచయితలు అర్నాద్, మంథా వెంకట రమణ, పంతుల జోగారావు ముఖ్య అతిథులు. జర్నలిస్టు ‘జోత్స్న’, వెలుగు రామినీడు మరికొందరు నిర్వాహకులు. శ్రీశ్రీ ఉపన్యాసకుడు కాదు. గంభీరమైన గొంతూ లేదు. ఐనా సాయంత్రం సభలో ఉత్తేజకరంగా మాట్లాడారు. నల్ల టెరీకాట్ ప్యాంటూ, లేత పసుపు వన్నె టెరీకాట్ షర్ట్ టక్ చేసుకుని హుందాగా వున్నారు. లోకల్ ఫోటో గ్రాఫర్ ని పిలిచి, శ్రీశ్రీని అదిరిపోయే ఫోటో తీసి ప్రింట్ వేసి రాత్రికే యిమ్మని చెప్పాను. శ్రీశ్రీ చనిపోయినపుడు ఆ ఫోటోనే ‘ఈనాడు’లో వాడాను.

ఉత్తరాంధ్ర రచయిత ‘అర్నాద్’ గుర్తున్నాడా?

చీకటోళ్లు నవల, రిక్షా ప్రయాణం కథలతో అప్పట్లో బాగా పాపులర్. ‘కథ-వాస్తవికత’ అనే విషయమ్మీద అర్నాద్ అద్భుతంగా మాట్లాడారు. ఆ రోజు రాయగడ ‘ప్రగతి’ సాహితీ సంస్థ 4వ వార్షికోత్సవం. సోదర సంస్థలు వికాసం (బరంపురం) కవిత (ఖుర్దా రోడ్) భారతి (జయపురం) పాల్గొన్నాయి. చాలా పెద్ద బహిరంగ సభ. ఉదయం నుంచీ సాయంత్రం దాకా శ్రీశ్రీ ఉత్సాహంగా వున్నారు. అందరితో సరదాగా మాట్లాడారు. యువ కవులూ, రచయితలూ మహాకవిని ఎంతో మురిపెంగా చూసుకుని థ్రిల్ అయ్యారు.

మర్నాడు బ్రేక్ ఫాస్ట్ అయ్యాక, లోకల్ పండగ స్పెషల్ అని జర్నలిస్టులు, రచయితలూ కొందరికి భంగు యిచ్చారు. నాటుసారా అనుకుని భయపడ్డా. చూస్తే పెద్ద గ్లాసుడు పాలల్లో కొబ్బరికోరు, కోవా, క్రీం, భంగు కలిపి యిచ్చారు. తియ్యగా రుచిగా వుంది. రెండో గ్లాసు కూడా ముగించాక రచయితలది వ్యక్తావ్యక్తాలాపన, కవులది పేలాపన! జర్నలిస్టులయితే గాల్లో తేల్తున్నారు. జీవితం క్షణ‘భంగు’రం అంటే ఏమిటో అప్పుడే అర్థమైంది.

చిన్న వూళ్లలో వుండే సరదాలే వేరు కదా!

*** *** ***

సరిగ్గా 37 సంవత్సరాల క్రితం….

1983, జూన్, 15, బుధవారం…

రేణిగుంట, ఈనాడు దినపత్రిక ఆఫీసు.

ఆ సాయంకాలం చల్లగా, ఆహ్లాదకరంగా వుంది.

ఆ రోజు సూర్యాస్తమయ వేళ మద్రాసులో శ్రీశ్రీ తుదిశ్వాస విడిచారు.

ఈనాడులో టెలీ ప్రింటర్ ఆపరేటర్, మా ఏలూరు కుర్రవాడు రామచంద్రశర్మ రాత్రి ఏడు గంటలకి వార్త వచ్చిందని చెప్పాడు. అమిత యిష్టం వల్లా, వల్ల మాలిన ప్రేమ వల్ల కొందరు ఎప్పటికీ మనతోనే వుంటారని అనుకుంటాం. సాధ్యం కాదది. నేను shatter అయిపోయాను.

చటుక్కున పెద్ద గాలీ… వర్షం…

కొద్దిసేపు కరెంటు పోయింది.

అప్పుడు ఈనాడు జిల్లా వార్తలు చూసే డెస్కులో నామిని సుబ్రమణ్యం నాయుడు, దాట్ల నారాయణమూర్తి రాజు, మేర్లపాక మురళి పని చేస్తున్నారు. వాళ్లు ముగ్గురూ రాయడం కాదు, దుమ్ము రేపేస్తారు. వాళ్లందరినీ కలిపి ఒక వార్త రాయమని, నేనొక వార్త రాస్తూ కూచున్నాను. అక్కడ మా బాస్, ప్రఖ్యాత రచయిత పతంజలి గారు. అంతకు ముందు రోజే రామోజీరావు ఆఫీసు నుంచి ఫోనొస్తే, హైద్రాబాద్ వెళ్లారు. ఇక బాధ్యత అంతా నాదే. ఆరుద్ర గారితో మాట్లాడాలని మద్రాసుకి ఫోన్ బుక్ చేయమన్నాను. ఆరుద్ర దొరికారు. ‘‘సర్, శ్రీశ్రీ గురించి…’’ అన్నాను. ఆయన గంభీరంగా ‘‘శ్రీశ్రీ నా మిత్రుడు, నా శత్రుడు’’ అంటూ ఆరుద్ర సొంత స్టైల్లో సంతాపం ప్రకటించారు. గబగబా రాసుకున్నా.

నేను తడి కళ్లతోనే తిరుగుతూ,

సిగిరెట్ కాలుస్తూ,

వార్తలు సెట్ చేస్తూ హడావిడిపడుతున్నా.

నా సంవేదన… శ్రీశ్రీ.

శ్రీశ్రీ- నా నిర్వికల్ప సమాధి.

శ్రీశ్రీ కవితా విశ్వవిద్యాలయ alma mater నేను.

ఒక ఉద్విగ్నత నన్ను కుదిపేస్తోంది.

దినపత్రికల కార్యాలయాల్లో కన్నీళ్లకీ, మనోభావాలకీ తావుండదు. రేపు ఉదయం ఆరు గంటల లోగా రాయలసీమలోని అన్ని ప్రాంతాలకూ ‘ఈనాడు’ చేరిపోవాలి. డెడ్ లైన్లు వుంటాయి.

ఇన్ టైమ్ లో పని ముగించాలి.

రష్… వొత్తిడి… కలచివేస్తున్న విషాదం.

‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరిపోయిన శ్రీశ్రీ’’ అన్న పెద్ద హెడ్డింగ్ పెట్టాను. ‘సీలు వేసిన రైలు పెట్టెలో డైనమేట్’ (లెనిన్ గురించి శ్రీశ్రీ అన్న మాట) అన్న సబ్ హెడ్డింగ్ యిచ్చి, శ్రీశ్రీది పెద్ద ఫోటో వేసి, ‘మహాకవి మరణ వార్తని కన్నీళ్లతో తెలియజేస్తున్నాం’ అంటూ వార్తని Flash చేశాను.

గాలి బాగా తగ్గింది. వర్షం వెలిసింది.

కాళ్లు తొక్కుకుంటున్నా. ప్రాణం కొట్టుకులాడుతోంది. మద్రాస్ వెళ్లాలి. అంతిమయాత్రలో ఉండాలి… దాన్ని వార్తగా రాయాలి. రచయిత నామినీ, నేనూ మంచి దోస్తులం. ఇద్దరం అర్థరాత్రి రేణిగుంట నుంచి తిరుపతి వెళ్లి బస్సు ఎక్కాం. తమిళ్ రాదు. మద్రాసు తెలీదు. శ్రీశ్రీ ఇంటి అడ్రస్ లేదు. ఎలా వెళ్లడం? మొండిగా కూర్చున్నాం. బస్సు బయల్దేరిన కాసేపటికి, యాధాలాపంగా వెనక్కి తిరిగి చూస్తే చివరి సీట్లో ‘తిరుపతి మావో’ త్రిపురనేని మధుసూదనరావు వున్నారు. పలకరించి హమ్మయ్య అనుకున్నాం.

*** *** ***

srisri…………

Sri sri at Rayagada. Velugu Raminedu, Jyosthna, Sri Sri, Prakash……….



కోయీ హస్ రహా హై, కోయీ రో రహాహై

…. అని ఏనాడో శ్రీశ్రీ ఒక గల్పిక రాశారు. ఒక పెద్దాయన హడావుడిగా వెళుతూ, చేతి వాచీని రోడ్డు మీద ఎవరికో యిచ్చేస్తాడు. పర్సు ఇంకొకరికి… కోటు తీసి మరొకరికి యిచ్చేస్తాడు. గబగబా పెద్ద వంతెన మీదకి వెళ్లి, దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. నాకు పూర్తిగా గుర్తులేదు. ఇది శ్రీశ్రీ కలెక్టెడ్ వర్క్స్ లో వుంటుంది. అచ్చంగా అలానే మనకి కవిత్వాన్ని యిచ్చి.. తిరుగుబాటు వేదాంతం నేర్పీ, నాటికలూ, అనువాదాలూ, కొల్లలుగా కొంటె కవితలూ కానుకగా యిచ్చి… మౌనంగా వెళ్లిపోయారు శ్రీశ్రీ.

తన మరణం గురించి శ్రీశ్రీ 1975లోనే, ‘నేను కీర్తిశేషుణ్ణయితే…’’ అని ఒక గల్పిక రాశారు.

‘‘నేను చచ్చిపోయిన తర్వాత నా తరఫున కొన్ని పనులు జరగాలి. అందుకే ఈ మరణ శాసనం! ముందుగా నా శవంతో ప్రారంభిస్తాను. దాని చుట్టూ చేరి చాలా మంది ఏడుస్తారు. నా అభ్యంతరం లేదు. ఎంతసేపయినా ఏడవ్వచ్చు. ఏడ్చి ఏడ్చి వాళ్లే మానేస్తారు. తర్వాత నా శవానికి దహన సంస్కారం చేస్తామంటారు. అదే వీల్లేదంటున్నాను నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండలకీ నా శవాన్ని అంకితం చెయ్యడానికి నేను సుతరామూ అంగీకరించను.

After all its my corpse, is n’t it? or is it?

పత్రికల వాళ్లు యిష్టం వచ్చినట్లు రాస్తారు. నా అభ్యంతరం లేదు. నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానంటాడు. అదే వీల్లేదంటున్నాను నేను. మతంలోనూ మతం తాలూకు మూఢ విశ్వాసాలతోనూ పోరాడుతూనే మరణించే నన్ను మళ్లీ వూబిలోకి ఎవరు దించదలచుకున్నా నేనంగీకరించను. కాబట్టి నేను చచ్చిపోయాక జరగవలసిన మొట్ట మొదటి పని నా శవాన్ని విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రికి అప్పగించడం…’’

మనిషి మీద, మనీషి మీద విశ్వాసాన్ని జీవితాంతమూ ప్రచారం చేస్తాను. నేను చనిపోయినా, నన్ను నా ప్రజలు మర్చిపోరు. ఎప్పుడూ వాళ్ల సంస్కృతిలో సజీవంగా వుంటాన్నేను. అదే నా స్మృతి చిహ్నం! ఇదీ నా మరణ శాసనం! అని స్పష్టంగా రాశారు శ్రీశ్రీ.

ఇది ప్రజాతంత్ర వార పత్రికలో 1975 ఆగస్ట్ 3వ తేదీన పబ్లిష్ అయింది.

*** *** ***

ఉదయం పది దాటుతోంది.

మద్రాసులో మహాకవి యింటికి చేరుకున్నాం.

*** *** ***

అక్కడ లక్షలాది జనం పోటెత్తి ఉన్నారు. సుత్తీకొడవలి హత్తిన వేలాది ఎర్రజండాలు రెపరెపలాడుతున్నాయి. తెలుగు, తమిళ సినీ రంగాల ప్రముఖులంతా రోడ్డుమీదే నిలబడి ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. వారం రోజులు సంతాపదినాలు… అని నాకు రాయాలని వుందిగానీ, అక్కడ అలాంటి దృశ్యమేదీ లేదు. ఒక మిడిల్ క్లాసు వాళ్లింట్లో పెద్దాయన చనిపోతే ఎలా వుంటుందో అంతే నార్మల్ గా ఉంది. జనమూ లేరు… జండాలూ లేవు.

*** *** ***

చాలా మంది నిశ్శబ్దంగా నిలబడి వున్నారు.

హాల్లో ఒక పక్కన పెద్ద iceblock మీద శ్రీశ్రీ.

హిమాలయాన్ని తలకింద దిండుగా పెట్టుకుని నిద్రపోతున్న అగ్నిపర్వతంలా…..

గత సాయంకాలమే ఆ అగ్ని చల్లారిపోయింది.

శ్రీశ్రీ ఊపిరి ఆగిపోయింది.

తెలుగు కవిత్వం గడ్డకట్టుకుపోయింది.

ఆ గదిలో ఒక స్వరం రణగర్జనలా ధ్వనిస్తోంది.

శ్రీశ్రీ తలవైపు, కింద కూర్చుని వున్న సాహితీ శిఖరం కె.వి.రమణారెడ్డి…

‘‘తాచుల వలెనూ, రేచుల వలెనూ… ధనంజయునిలా సాగండి…

పదండి ముందుకు…పదండి తోసుకు…’’ అంటూ మహా ప్రస్థానం గీతాల్ని ఆవేశంగా చదువుతున్నారు. ఆయన తల నుంచీ వొళ్లంతా చెమటలు ధారగా కారుతున్నాయి. కేవీఆర్ వేసుకున్న తెల్లని గ్లాస్కో లాల్చీ తడిచిముద్దయి ఆయన వొంటికి అతుక్కుపోయి వుంది. చాలా మందిలాగే, నామిని సుబ్రమణ్యం నాయుడూ, నేనూ నించుని వున్నాం. పొడవుగా హుందాగా వున్న ఒకావిణ్ణి చూసి ఆవిడెవరు? అని నా పక్కనున్న వ్యక్తిని అడిగాను. ‘‘వరూధుని గారు, కొ.కు.భార్య’’ అని చెప్పాడు. బైటికి చూస్తే, తెల్లటి బట్టల్తో దాసరి నారాయణరావు వొస్తున్నారు. కొద్దిసేపట్లో మాదాల రంగారావు వచ్చాడు. ఆవేశంగా పిడికిలి బిగించాడు. మహాకవి మీద ఎర్రజెండా కప్పాడు. చలసాని ప్రసాద్ రెస్ట్ లెస్ గా అటుయిటూ తిరుగుతున్నారు. విరసం పెద్దలు శ్రీశ్రీ భార్య సరోజతో మాట్లాడుతున్నారు. ‘‘వీల్లేదు తమిళ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగాలి’’ అని పట్టుబట్టింది ఆవిడ. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుదర్లేదు. అంత్యక్రియల ఏర్పాట్లన్నీ దాసరి చూస్తున్నారు. పాడె సిద్ధం అయింది. మహా అయితే ఓ వంద మంది వుంటారేమో! రోడ్డు మీద నవతా కృష్ణంరాజు, ఇంకొందరు సినిమా ప్రముఖులు నిలబడ్డారు.

నలుగురైదుగురు శ్రీశ్రీని ఎత్తి పట్టుకొచ్చి రోడ్డు మీదున్న పాడె మీద పెట్టారు. దండలు, నినాదాలు… ఆరుద్ర ముందుండి, కుడి భుజమ్మీద పాడె పెట్టుకున్నారు. ముందున్న నేను… నా ఎడమ భుజమ్మీద పాడె… వెనుక మరో యిద్దరు… శ్రీశ్రీ అమర్ రహే… అంటున్నారు. పాడెకు ముందు శ్రీశ్రీ తనయుడు వెంకటరమణ నడుస్తున్నాడు. ముందున్న ఫోటోగ్రాఫర్లు హడావుడి పడుతున్నారు. పది అడుగులు వేశామో లేదో ఒక పెద్దాయన గబాగబా వచ్చి, నన్ను వెనక్కి తోసి పాడెని భుజమ్మీద పెట్టుకున్నాడు. ఆయన త్రిపురనేని మహారధి. నేను మధ్యకి వచ్చాను. స్మశాన వాటికకి చేరుకున్నాం. పూజలు, మంత్రాలూ, తతంగం… సాయంకాలమైంది. వాళ్ల సంప్రదాయం ప్రకారం మట్టి, పేడతో శ్రీశ్రీని కప్పేశారు. అలాగే గొయ్యి లోపలికి దించారు. లోపలే తగలబడుతుంది. మనకి పొగ మాత్రం కనిపిస్తుంది. అదేంటో నాకు బాగా అన్పించలేదు. ప్రముఖులంతా ఒక్కరొక్కరే వెళ్లిపోయారు. అక్కడంతా నిశ్శబ్దం. ఒక స్తంభానికి ఆనుకుని చలసాని ప్రసాద్, మరో పక్క సినీ నటుడు కాకరాల దిగులుగా మిగిలిపోయారు. ఇక నేనూ, నామినీ… మా నలుగురమే మిగిలాం. అలా తన దేహాన్ని విశాఖ ఆస్పత్రికి ఇవ్వాలన్న శ్రీశ్రీ కోరిక అక్కడే మట్టిలో కలిసిపోయింది.

*** *** ***

తిరుపతి ఈనాడుకి వార్త పంపాలి. నామినీ నేనూ ‘మద్రాసు సితార ఆఫీసుకి వెళ్లాం. రెండుగా డివైడ్ చేసి వున్న పెద్ద కాబిన్ లో కూర్చుని వార్త రాసుకుంటున్నా. దూరం నుంచి వచ్చామని అక్కడి సినీ రిపోర్టర్ ఒకాయన కాఫీ తెచ్చియిచ్చాడు. సిగిరెట్ కావాలన్నా. కాబిన్ లో అటు ఒక పెద్దాయన వున్నట్టు తెలుస్తోంది. కర్టెన్ వల్ల క్లారిటీ లేదు. ఆయనెవరు? అని రిపోర్టర్ ని అడిగాను. వేటూరి సుందర రామ్మూర్తి అని చెప్పాడు. ఏం చేస్తున్నారిక్కడ? అడిగాను. ఈనాడుకి శ్రీశ్రీ మీద సంపాదకీయం రాస్తున్నారు అని చెప్పాడు.

వార్త వివరంగా రాసి, రేణిగుంట ఆఫీసుకి పంపి నామినీ, నేనూ తిరుపతి బయల్దేరాం.

‘‘లెనిన్ నేడు లేడూ… చూడు జనంలో వున్నాడు’’ అన్న మయకోవస్కీ మాటలు తలుపునకు వచ్చాయి.

జర్నలిస్టులు ఏం చేయగలరు? వార్తలు రాసి ఏదో సాధించాం అనుకోడం తప్ప!

మయకోవస్కీ లెనిన్ కావ్యంలో…

లెనిన్ నా కనుపాప

క్షుద్ర కావ్యంతో అవమానిస్తానా? అన్నాడు.

మయకోవస్కీ లాంటి ఒక మహాకవి మాత్రమే అనగలిగిన మాట అది.

*** *** ***

మహాకవి శ్రీశ్రీ ఎవరు?

అనివార్యమైన, తుచ్ఛమైన మరణాన్ని జయించడం నేర్పినవాడు…

జనం కోసం జీవించండని మనల్ని దీవించినవాడు… కవితామృతాన్ని పంచియిచ్చి కనుమరుగైపోయినవాడు.

ఇంతకీ నేనెవర్ని?

నేను శ్రీశ్రీతో మాట్లాడిన వాణ్ణి, శ్రీశ్రీని తాకినవాణ్ణి!

అచేతనంగా దీర్ఘ నిద్రలో వున్న మహాకవిని చూసినవాణ్ణి…

ఆయన పాడె మోసిన వాణ్ణి!

చివరిగా- విస్ఫోటనంలాంటి ఆ విషాదాన్ని

వార్తగా రాసినవాణ్ణి.

ఇపుడు, శ్రీశ్రీ గురించి, మీరు నాతో మాట్లాడాలనుకుంటే…

అది ఆషామాషీ వ్యవహారం కాదు.

కనీసం నాకో కాఫీ యిప్పించాలి.

ఒక సిగిరెట్ కొనివ్వాలి.

పైగా… దాన్ని మీరే వెలిగించాలి.

– తాడి ప్రకాష్, 97045 41559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions