కళాభినేత్రి… తెలుగువారు కళాభినేత్రి అని గర్వంగా పిలుచుకున్న నటి వాణిశ్రీ బర్త్ డే రేపు… తెలుగు సినీ ప్రేక్షకులకు వాణిశ్రీ గా పరిచయమైన కళాభినేత్రి అసలు పేరు రత్నకుమారి. వాణీ ఫిలింస్ వారి చిత్రంలో తొలిసారి నటించడం చేత వాణిశ్రీ అయ్యింది. వాణీ ఫిలింస్ అంటే మహానటుడు ఎస్వీఆర్ కంపెనీయే. అలా ఎస్వీఆర్ తో తెరనామకరణం చేయించుకుంది వాణిశ్రీ…
తెలుగు తెర మీద చివరి లేడీ సూపర్ స్టార్ వాణిశ్రీ. తనకు ముందు ఓన్లీ సావిత్రి. తన తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేసిన వారెవరూ లేరు. అదీ వాణిశ్రీకి తెలుగు సినిమా రంగంలో ఉన్న స్థానం. వాణిశ్రీ తర్వాత తరంలో వచ్చిన హీరోయిన్లందరూ భారీ రికమండేషన్లతోనో వారసత్వంతోనో నేరుగా హీరోయిన్లుగా తెరమీదకు దిగుమతై వచ్చినవాళ్లే. వాణిశ్రీ మాత్రం అలా రాలేదు.
చెలికత్తె వేషాలతో ప్రారంభించి కామెడీ పాత్రలతో మెప్పించి కథానాయికగా ఎదిగి వాణిశ్రీ లేకపోతే ఎలా అని ఇండస్ట్రీ అనుకునేలా చేయగలగడం సామాన్యమైన విషయం కాదు. నెల్లూరు నుంచీ చెన్నైకి వచ్చిన తెలుగు కుటుంబం నుంచీ ఇండస్ట్రీలోకి కాలుపెట్టారు. ఆంధ్ర మహిళాసభలో భరతనాట్యం నేర్చుకున్న అనుభవం ఒక్కటే క్వాలిఫికేషను. సావిత్రి అంతటి హీరోయిన్ కావాలనేది యాంబిషను. సావిత్రి పాతాళభైరవిలో ఒక చిన్న స్కిట్ లో కనిపించినట్టే వాణిశ్రీ కూడా తెలుగుతెర వేల్పు ఎన్టీఆర్ ఉమ్మడి కుటుంబంలో ఓ వీధి నాటకంలో కనిపిస్తుంది.
Ads
నటిగా వాణిశ్రీ జీవితాన్ని ఓ మలుపు తిప్పిన సినిమా సుఖ దుఃఖాలు. ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్ రాసిన మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని తమిళ్ లో సినిమాగా తీశారు. అదే సినిమాను తెలుగులో విజయభట్ మూవీస్ వారు ఐ.ఎన్.మూర్తి డైరక్షన్ లో తెలుగులో రీమేక్ చేశారు. తమిళ్ లో జయలలిత చేసిన పాత్రనే తెలుగులో వాణిశ్రీ చేసింది. ఇది మల్లెల వేళయనీ పాట చాలా పెద్ద హిట్.
నటిగా వాణిశ్రీలోని ప్రతిభను ఇండస్ట్రీ గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. వాహినీ లాంటి సంస్ధలో అవకాశం రావడమే తనకు దొరికిన తొలి గుర్తింపు. బి.ఎన్ డైరక్షన్ లో రంగుల రాట్నం సినిమాలో నటించిన వాణిశ్రీతో ఆ వెంటనే బంగారు పంజరం హీరోయిన్ రోల్ చేయించారు. బిఎన్ లాంటి డైరక్టరు వరసగా రెండు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం మామూలు విషయం కాదు కదా…
నటిగా వాణిశ్రీకి సావిత్రే ఆదర్శం. తొలిరోజుల్లో సావిత్రిలాగానే నడిచేది. సావిత్రిలాగానే నిలబడేది. సావిత్రిలాగానే డైలాగులూ చెప్పేది. ఈ విషయం సాక్షాత్తూ సావిత్రే కనిపెట్టి … నాలాగా చేయడానికి నువ్వెందుకు? నేనున్నాగా … వాణిశ్రీలా చేయగలిగితేనే నీకు ఫ్యూచరుంటుందని నాదీ ఆడజన్మే టైమ్ లో వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత వాణిశ్రీ తనదైన పద్దతికి ఒరవడి దిద్దుకున్నారు.
డెబ్బై దశకం ప్రారంభం అవుతూనే వాణిశ్రీని సూపర్ స్టార్ ని చేసేసింది. నటిగా అప్పటి వరకు తెలుగువారికి పరిచయం ఉన్న వాణిశ్రీని వారి కలల రాణిని చేసిన రెండు సినిమాలూ డెబ్బై ఒకటిలోనే విడుదలయ్యాయి. అందులో మొదటిది దసరాబుల్లోడు. ఆ సినిమాలో నిజానికి జయలలిత చేయాల్సింది. తను బిజీ కావడంతో గత్యంతరం లేక వాణిశ్రీని తీసుకున్నారు.
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ అంటూ తెర మీద అక్కినేని అంటే … తెలుగు ప్రేక్షకలోకం కోరస్ పాడేసింది.
దసరాబుల్లోడు సినిమా కలిగించిన ప్రేరణతో రామానాయుడు కసిగా తీసిన సినిమా ప్రేమనగర్. నిజానికి ప్రేమనగర్ సినిమా ఎఎన్నార్, కె.ఆర్.విజయలతో తెరకెక్కించడానికి అప్పటికే సన్నాహాలు జరిగాయి. దర్శకుడు వి.మధుసూదనరావు. అదే ప్రాజెక్టును టేకోవర్ చేసిన రామానాయుడు హీరోయిన్ గా వాణిశ్రీనీ దర్శకుడుగా కె.ఎస్.ప్రకాశరావునీ తీసుకుని చారిత్రాత్మక విజయం అందుకున్నారు.
ప్రేమనగర్ సురేష్ మూవీస్ బ్యానర్ ను నిలబెట్టింది. వాణిశ్రీని నవలా నాయకిని చేసింది.
జయలలిత, కె.ఆర్.విజయ చేయాల్సిన పాత్రలకు తాను ప్రాణప్రతిష్టచేసి స్టార్ హీరోయిన్ గా జండా ఎగరేసిన వాణిశ్రీ గ్లామర్ కోసం ఎన్నడూ నటనను బలిపెట్టలేదు.
నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే సినిమాలు చేస్తూనే వచ్చారు. అది వాణిశ్రీ కెరీర్ సుదీర్ఘకాలం నడిచేందుకు దోహదపడింది కూడా. స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న దశలోనే నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్రలు వస్తే వదులుకునేవారు కాదు వాణిశ్రీ. గ్లామర్ పరంగానూ నటనా పరంగానూ కూడా తన పరిమితులేమిటో తనకు స్పష్టంగా తెలుసు. సావిత్రికి ఏకలవ్య శిష్యురాలు కావడంతో సావిత్రి లోపాలను కూడా ఆకళింపు చేసుకుని మరీ తనకు అన్వయించుకుంది.
ఎఎన్నార్, ఎన్టీఆర్ ల సినిమాలు చేయడానికే డేట్స్ సర్దుబాటు చేయాల్సిన టైమ్ లో బాపు కోసం గోరంత దీపం చేసి వావ్ అనిపించారు వాణిశ్రీ. గ్లామర్ తార వాణిశ్రీలోని నటిని చూసిన పట్టించుకున్న మరో దర్శకుడు శ్యామ్ బెనెగల్.
కొందూర అనే ఓ మరాఠీ నవలను తెలుగులో సినిమాగా తీయదల్చుకున్నప్పుడు అందులోని అనసూయ పాత్రకు వాణిశ్రీ మాత్రమే న్యాయం చేయగలదనుకున్నారు. అప్రోచ్ అయ్యారు. తను ఇలాంటి అవకాశాల కోసమే చూస్తోన్న సందర్భంలో శ్యామ్ ఆఫర్ ఎలా కదనగలదు?
హీరోయిన్ గా అక్కినేనితో ఎక్కువ సినిమాల్లో జోడీ కట్టారు వాణిశ్రీ. కానీ తెర బయట మాత్రం తనకు నచ్చిన హీరో ఎన్టీఆర్ అంటారామె.
కో- ఆర్టిస్టు బాగా చేస్తే మెచ్చుకోవడం … అలాగే కో- ఆర్టిస్టు ఇతర సినిమాల్లో చేసిన నటనను మెచ్చుకోవడం లాంటి మంచి లక్షణాలు ఎన్టీఆర్ లో పుష్కలం అనీ చెప్తారు వాణిశ్రీ. కథానాయిక మొల్లలో తన నటన చాలా బాగుందని ఎన్టీఆర్ చెప్తే చాలా గొప్పగా అనిపించిందంటారు.
ఎన్టీఆర్ తో నటించిన ఎదురులేని మనిషి చిత్రం గ్లామర్ తారగా తానిక విరమించుకోవడం మంచిదనే విషయం అర్ధం చేయించిందంటారు వాణిశ్రీ. ఆ సినిమాలో కొన్ని నృత్యభంగిమలు అసభ్యంగా ఉన్న విషయం అన్నగారి దృష్టికి తీసుకువెళ్లారట వాణిశ్రీ. మనం చేయకపోతే వేరే వారితో చేయించేసుకుంటారు. విలువలు పడిపోతున్నాయి… అని మనం అనుకోవచ్చు … కానీ ఇది ఈ జనరేషన్ టేస్ట్ అంటే మనం ఏం మాట్లాడగలం? మనం రాజీ పడి కొనసాగడమా లేక తప్పుకుని వెళ్లిపోవడమా అనేది మనమే నిర్ణయించుకోవాలని గీతోపదేశం చేశారట ఎన్టీఆర్.
ఆ రెండోదే మంచిదనుకుని సినిమాలు తగ్గించుకున్నారు వాణిశ్రీ. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ తో రెండు మూడు సినిమాలు చేశారు.
ఎదురులేని మనిషి అనుభవం నుంచీ వివాహం వైపు వాణిశ్రీ దృష్టిమళ్లింది. తన ఫ్యామ్లీ డాక్టర్ నే పెళ్లాడేశారు. ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేద్దామనుకున్నారు. కానీ కొంత గ్యాప్ తర్వాత అల్లు అరవింద్ కోరిక మేరకు అత్తకు యముడు అమ్మాయికి మొగుడులో పొగరుబోతు అత్తగా నటించి తన గ్రిప్ సడలలేదని నిరూపించుకున్నారు.
అదే ఊపులో మరో నాలుగైదు అత్త పాత్రలూ చేసి అదరగొట్టారు. వాటిలో ఆయనకిద్దరు, సీతారత్నంగారబ్బాయి, బొబ్బిలిరాజా లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. నటిగా హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా ఏం చేసినా వాణిశ్రీ విజయవంతంగానే చేశారు. జీవితంలోనూ అంతే సక్సస్ ఫుల్ గా నిలబడ్డారు. ఆత్మాభిమానం గల కథానాయికగా తెలుగు వారి మనస్సుల్లో చెరగని ముద్రేసుకున్నారు. అంచేత ఈ వాణిశ్రీ ఆ వాణిశ్రీని చూపిస్తున్నారు చూడండి మరి … – Rangavaghula Bharadhwaja
Share this Article