తిరుగులేని శక్తిగా ఎదిగిన కరేబియన్లను మట్టి కరిపించి.. 1983లో ప్రపంచ కప్ గెల్చిన భారత జట్టును కనీసం సన్మానించుకునే పరిస్థితిలో కూడా నాటి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ లేదంటే నమ్మగలరా..? నమ్మితీరాలి. ఇవాళంటే బీసీసీఐ ఐసీసీనే శాసించే స్థాయికి రావొచ్చుగాక! కానీ, నాడు బీసీసీఐ పరిస్థితి దయనీయమే. అలాంటి సమయంలో బీసీసీఐకి ఓ ప్రఖ్యాత గాయకురాలి అవసరం పడింది. ఆమె సాయమే గండం గట్టెక్కేందుకు ఊతమైన కథ మీకు తెలుసా..? ఎవరా గాయకురాలు… ఏంటా కథ..?
LATHA MANGESHKAR – 28 September 1929 – 6 February 2022
1983లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వెస్ట్ ఇండీస్ ను మట్టి కరిపించి… భారత్ ఎన్నిటికీ మర్చిపోని ఓ చిరస్మరణీయ విజయాన్నందించింది. అలా లార్డ్స్ బాల్కనీలో కపిల్ ప్రపంచ కప్ ఎత్తినప్పుడు… బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, నాటి ఇందిరాగాంధీ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఎన్కేపీ సాల్వేలో ఓ ఆందోళన మొదలైంది. అరె.. ఓవైపు కప్ గెలిచి భారతదేశం మొత్తం కరత్వాళధనులు మోగుతుంటే.. మంత్రేంటి.. ఇలా ఆందోళన చెందుతున్నానకున్నారట ఆయన్నెరిగినవారు.
Ads
కానీ, ఇందిర క్యాబినెట్ లో శక్తివంతమైన మంత్రిగా ఉన్న సాల్వేలో ఆ ఆందోళన చోటు చేసుకున్న సమయంలో.. భారత్ లో ఇంకా ఆర్థిక సరళీకరణలు మొదలుకాలేదు. జగన్మోహన్ దాల్మియా వంటివారు ఎంట్రీ ఇచ్చి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ను ఓ ఇండస్ట్రీగా మార్చేసిన రోజులూ కాదు. అలాంటి సమయంలో.. విశ్వవిజేతగా నిల్చిన తమ జట్టును కనీసం హుందాగా సన్మానించుకోవడమెలా అన్నదే సాల్వే ఆందోళనకు కారణమైంది.
కపిల్ టీమ్ వేడుకలు జరుపుకోవాల్సిన సమయంలో… బీసీసీఐ ఆటగాళ్లందరికీ రోజూవారీ భత్యం 20 పౌండ్స్ చెల్లించేందుకు 5 బిలియన్ డాలర్స్ టెలివిజన్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్న రోజులవి.
(అప్పట్లో క్రికెటర్లకు ఇచ్చిన మ్యాచ్ ఫీజు, అలవెన్సులు)
ఆ సమయంలో బీసీసీఐ చైర్మన్, మంత్రి సాల్వే.. భారత క్రికెట్ లో వన్ స్టాప్ ఎన్ సైక్లోపిడీయాగా గుర్తింపు పొందిన రాజ్ సింగ్ దుంగార్పూర్ వైపు ఓ చూపు చూశాడు. ఎందుకంటే.. విశ్వవిజేతగా నిల్చిన ఇండియన్ క్రికెట్ టీమ్ కు రివార్డ్ ఇవ్వాలి.. ఎలా అనేది ఆ చూపు సారాంశం.
ఇంకేం, రాజ్ భాయ్ గా అందరూ ముద్దుగా పిల్చుకునే దుంగార్పూర్.. తనకు సన్నిహితురాలు, అంతకుమించి క్రికెట్ వీరాభిమానైన ప్రముఖ గాయనీమణి లతామంగేష్కర్ తో.. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఓ పాటల కచేరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మంత్రి సాల్వే ముందుకొచ్చాడు. రాజ్ సింగ్ దుంగార్పూర్ ఐడియాకు మెచ్చిన మినిస్టర్ సాల్వే… ఏర్పాట్లు చేయించారు. లతాజీ ఒప్పుకుంది. అనుకున్నట్టుగానే ప్రోగ్రాంకు సర్వం సిద్ధమైంది.
ఒక్క ఐడియా అప్పటివరకూ మంత్రిలో నెలకొన్న ఆందోళననే మార్చేసింది. లతాజీ కాన్సర్ట్ కు.. ఇందిరాగాంధీ స్టేడియం నిండిపోయింది. టిక్కెట్సన్నీ ఎక్కడికక్కడ అమ్ముడుపోయి.. ఇంకా ఇంకా జనం వస్తూనే ఉన్నారు. అలా 20 లక్షల రూపాయల ఫండ్ రెయిజ్ అయింది. ఈ కార్యక్రమాన్ని ఓ క్రికెట్ వీరాభిమానిగా.. అలాగే, దేశం తరపున… మరోవైపు రాజ్ సింగ్ దుంగార్పూర్ తో ఉన్న సాన్నిహిత్యంతో లతా మంగేష్కర్ ఫ్రీ ఛారిటీ షోలా నిర్వహించారు. ఈ షోలో ముఖేష్ కుమారుడు నితిన్ ముఖేష్, సురేష్ వాడేకర్ వంటివారు కూడా భాగస్వాములయ్యారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఆ పాటల పూదోటలో ఆ సాయంత్రం రసానుభూతి పొందారు.
అలా వచ్చిన డబ్బులో విశ్వవిజేతగా నిల్చిన భారత జట్టులోని 14 మందికి మనిషికి లక్ష రూపాయల చొప్పున పారితోషికంగా అందజేశారు. లక్ష రూపాయలంటే.. ఆ రోజుల్లో పెద్దమొత్తం. కేవలం ఆ సమయంలో బీసీసీఐ వద్ద మ్యాచులు గెల్చినందుకు వచ్చిన డబ్బు కేవలం 60 వేల రూపాయలు మాత్రమే ఉన్న రోజులవి. అలాంటి సమయంలో లత షో మన విశ్వవిజేతలను సన్మానించుకునేందుకు ఊతమైంది.
ఈ విషయాలను నాటి 1983 వరల్డ్ కప్ లో భాగస్వామైన సునీల్ వాల్సన్ పంచుకున్నారు. సునీల్ వాల్సన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే 14వ ప్లేయర్ గా వెనుదిరిగారు. ఆరోజు సాయంత్రం లత పాటలతో వేదిక ఉర్రూతలూగిందంటూ గతంలో తన మెమరీస్ ను ఆయన షేర్ చేసుకున్నారు. తామున్న పరిస్థితుల్లో కొందరు ఐదువేలు, మరికొందరు పదివేల వరకూ సాయమందిస్తామని ముందుకొచ్చారని.. కానీ, అది ఎబ్బెట్టుగా ఉంటుందని.. ఆ లోటును లత తన వండర్ ఫుల్ కచేరీతో ఫిల్ చేసేశారన్నారు వాల్సన్.
అందుకే లతా మంగేష్కర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కు.. ముఖ్యంగా బీసీసీఐ నాడున్న పరిస్థితుల్లో ఆ బోర్డుకు చేసిన సేవలను దుంగార్పూర్ నుంచి ఎవ్వరూ కూడా మర్చిపోరు సరికదా.. అది లతాజీకి క్రికెట్ అంటే ఉన్న మక్కువకు నిదర్శనమని పేర్కొంటారు. తాను చాలా బిజీ బిజీగా గడుపుతున్న రోజుల్లో కూడా ఆమె ఆ స్టేజ్ షో మన విశ్వవిజేతలైన భారత క్రికెట్ ప్లేయర్లను సత్కరించుకునేందుకు చేశారని.. లతపై నాటి ప్లేయర్లకే కాదు.. ఆ అభిమానం సచిన్ వరకూ కొనసాగుతూనే వచ్చింది. అందుకే భారత జట్టు ఎక్కడ క్రికెట్ ఆడినా.. అక్కడికెళ్తలి వీక్షించేలా.. తనతో పాటు, మరొకరిని కూడా తోడుగా తీసుకెళ్లేలా ఫ్రీ వీవీఐపీ టిక్కెట్స్ రెండింటిని.. లతా మంగేష్కర్ కోసం ఓ గౌరవమైన అవకాశంగా కల్పించింది బీసీసీఐ.
లతా మంగేష్కర్ నిష్క్రమణ తర్వాత ఆమె సేవలను తల్చుకుంటూ… ఓసారి వెస్ట్ ఇండీస్ జట్టుతో వన్డే సీరీస్ లో భాగంగా బ్లాక్ ఆర్మ్ బ్యాండ్ ధరించి… భారత క్రికెట్ టీమ్ రెండు నిమిషాల మౌన ప్రదర్శనతో ఆమెకు ఘన నివాళులర్పించింది.
మంగేష్కర్ కుటుంబ సభ్యులంతా క్రికెట్ కు వీరాభిమానులేనంటారు సీనియర్ జర్నలిస్ట్ మకరంద్ వైంగాంకర్. 60 దశకం నుంచి లత ఎంత ఆసక్తిని కనబర్చేదో చెబుతారు. 70, 80 దశకాల్లో ఏకంగా పలు మ్యాచులకు ముంబై వాంఖడే స్టేడియంలో లతాజీ వెళ్లి చూసేవారని.. లత సోదరుడైన హృదయనాథ్ మంగేష్కర్ తో కలిసి వచ్చేవారట.
రాజ్ సింగ్ దుంగార్పూర్ తో పాటు.. ఇండియన్ క్రికెట్ లో ముఖ్యంగా సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, సచిన్ టెండూల్కర్ వంటివారితో చాలా సన్నిహితంగా మెదిలేవారు లత. పలుమార్లు దుంగార్పూర్ తో పాటు.. భారత టెస్ట్ జట్టు మాజీ ఓపెనర్ మాధవ్ ఆప్టేతో కలిసి కూడా లత మ్యూచులను వీక్షించేవారు. భారత్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ టెస్ట్ మ్యాచును లత ఎంతో ఆసక్తిగా చూసే వీడియో ఇప్పటికీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే కనిపిస్తుంది.
తరచూ క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాను విజిట్ చేయడం.. దుంగార్పూర్, ఆయన మేనల్లుడు మరో ప్రముఖ టెస్ట్ క్రికెటరైన హనుమంత్ సింగ్ తో కూడా పలుమార్లు క్రికెట్ చర్చలను ఆస్వాదించడం వంటివెన్నో నైటింగేల్ ఆఫ్ ఇండియాకు.. ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఉన్న బంధాన్ని పట్టిచూపేవే….. (రమణ కొంటికర్ల)
Share this Article