లత మంగేష్కర్ కొన్ని వేల పాటలు పాడింది నిజం… ఆమె సరిగ్గా రికార్డ్ చేసి పెట్టుకోలేదు… అందుకే ఎవరికితోచిన లెక్క వాళ్లు చెబుతారు… 36 భాషలు, 50 వేల పాటలు అంటారు… కాదు, కాదు, 20 భాషలు, 20 వేల పాటలు అంటారు మరికొందరు… చివరకు గిన్నీస్ బుక్ వాళ్లే జుత్తు పీక్కున్నారు… రకరకాల అంకెలు వేశారు మొదట్లో… నువ్వే నెంబర్ వన్ అన్నారు… తరువాత కొన్నాళ్లకే, లత కాదు, ఆశా భోంస్లే అన్నారు… మళ్లీ కొన్నాళ్లకు తూచ్, తెలుగు గాయని పి.సుశీలే పాటల సంఖ్యలో నెంబర్ వన్ అన్నారు… అవన్నీ వదిలేస్తే…
ఆమె తెలుగులో పాడిన పాటలు కేవలం మూడే… ఎందుకో మరి, తెలుగు సంగీత దర్శకులు ఆమెను పెద్దగా టాలీవుడ్ వైపు ఉపయోగించుకోలేక పోయారు… ఎంతసేపూ సుశీల, జానకి, కాదంటే శైలజ… మిగతా స్వరాలే వినిపించేవి కావు… ఎస్పీ బాలును లత మంగేష్కర్ బాగా అభిమానించేది… ఐనాసరే, తెలుగులో ఆమె పెద్దగా వెలిగింది ఏమీలేదు, ఆమెకు ఉపయోగపడిందేమీ లేదు… బాలు లెక్కలు అంత వీజీగా అర్థం కావు కదా…
తొలుత 1955లో… సంతానం అనే సినిమాలో నిదురపోరా తమ్ముడా అని పాడింది… సుసర్ల దక్షిణామూర్తి స్వరసారథ్యం… ఘంటశాల సహగాయకుడు… తరువాత దొరికితే దొంగలు సినిమాలో శ్రీవెంకటేశా పాట పాడింది అంటారు గానీ, తీరా ఏ వికీయో చెక్ చేస్తే సుశీల పేరు కనిపిస్తుంది… (సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం అది…) 1988లో ఆఖరిపోరాటం సినిమాలో బాలుతో కలిసి పాడిన ‘తెల్లచీరెకు’ పాట మాత్రం అందరికీ తెలుసు… చాలా హిట్ పాట అది…
Ads
దరిద్రం ఏమిటంటే, ఆదిత్య వాళ్లు యూట్యూబులో పెట్టుకున్న పాటలో దీన్ని ఆశా భోంస్లే పాడినట్టు రాసుకున్నారు… అదీ ఆమెకు మనం ఇచ్చుకున్న గౌరవం, గుర్తింపు… (బహుశా ఇలాంటి ధోరణుల కారణంగానే ఆమె తెలుగుకు దూరంగా ఉందేమో, లేదా తెలుగు సంగీత దర్శకుల అహం ఆమె మెంటాలిటీకి సరిపడకపోవడం కూడా కారణం కావచ్చు…) అయితే బాలుతో ఆమె మరోపాట పాడినట్టు కూడా మనకు కనిపిస్తుంది… చాందిని అనే సినిమాను అప్పట్లో శ్రీదేవి అని డబ్ చేసినట్టున్నారు… అందులో మోగుతున్నయ్ గాజుల అనే పాట పాడింది ఆమె… అందులోనే నగరాలకు తల నగరమిది అనే పాటను కూడా బాలుతో కలిపి పాడిందామె…
అన్నట్టు ఆ తెల్లచీర పాట గురించి చెప్పుకున్నాం కదా… ఇదుగో ఆ పాట యూట్యూబ్ వీడియో లింక్… తెలుగు పదాల ఉచ్ఛారణ స్పష్టంగా, మన తెలుగు గాయని పాడుతున్నట్టే ఉంటుంది… పాట రాసుకుని, ప్రాక్టీస్ చేసుకుని, పదాల ఉచ్ఛారణ తెలుసుకుని పాడటం అప్పట్లో ప్రశంసనీయమైన లక్షణం… అది ఆమె అక్షరాలా పాటించింది… (అఫ్ కోర్స్, ఆపాట కంటెంట్ వదిలేయండి, ఓ పట్టాన అర్థం కాదు… రాఘవేంద్రరావు మార్క్ పిచ్చి పాటల్లో ఒకటి…)
Share this Article