తెలుగువారికి సంతూర్
లైమ్ ఫ్రేగ్రన్స్ రుద్దుళ్లు
పత్రికల్లో ఒకప్పుడు హాస్యానికి ప్రత్యేకమైన కాలమ్స్ ఉండేవి. పత్రికల విధానాలే హాస్యాస్పదం అయ్యాక విడిగా హాస్యానికి కాలమ్స్ ఔచిత్యం కోల్పోయాయేమో!కానీ…ఆ లోటును ప్రకటనలు కొంతవరకు తీరుస్తున్నాయి. సాధారణంగా ప్రకటనలను ఎవరూ చదవరు. చదివితే ఉదయాన్నే కడుపుబ్బా నవ్వుకోవచ్చు.
Ads
లైమ్ ఫ్రేగ్రన్స్ లీలలు!
సంతూర్ సబ్బు వల్ల కొన్ని దశాబ్దాలుగా కాలేజీ అబ్బాయిలు అమ్మాయి వెంట పడడం; తీరా లవ్ ప్రపోజ్ చేద్దామనుకునే క్షణాన మమ్మీ! అని వాళ్లమ్మాయి ఫ్రేమ్ లోకి రావడంతో వెనుతిరుగుతున్న మహేష్ లను వేనవేల మందిని చూసి చూసి అలసిపోయాం. తప్పు మహేష్ లది కాదు…ఆమె వయసును వెనక్కు తోసిన సంతూర్ సబ్బుది అని తెలుసుకుని సంతలో సంతూర్ లను కొని ఒళ్లంతా రుద్దుకుంటూనే ఉన్నాం. ప్రకటనలో తల్లిలా సంతూర్ వాడిన మహాతల్లులు ఎందరు పిల్లలయ్యారో డేటా మార్కెట్లో ఉండదు.
సంతూర్ అద్భుతమైన సరికొత్త లైమ్ ఫ్రేగ్రన్స్ కలిగినది కొత్త సోప్ వచ్చిందట. ప్రతి పది మందిలో 9 మంది ఈ ఫ్రేగ్రన్స్ కలిగిన ఫ్రెష్ నెస్ నే ఇష్టపడుతున్నారట. ఆ మిగిలిన ఒక్కరిలో మీరే ఉండడం ఏమి బాగుంటుంది చెప్పండి! ఆ ఫ్రేగ్రన్స్ ఫ్రెష్ నెస్ పదిమందిలో మీరూ చేరి నలుగురితో పాటు నారాయణ అవ్వండి. ట్రై చేయండి చర్మాన్ని ఫ్రెష్ గా ఉంచి…మిమ్మల్ని రోజంతా ఇంగ్లీషులో రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది. మీ మూడ్ ను కూడా ఇంగ్లిష్ లోనే హై స్పిరిట్లో ఉంచుతుంది. ఈరోజే ట్రయ్ చేయండి!
కాలాతీత శుభ ప్రారంభం!
కాలాతీత విఖ్యాత! అని సామజవరగమన కీర్తనలో త్యాగయ్య అనన్యసామాన్యమైన మాటను ప్రయోగించాడు. ఈరోజుల్లో త్యాగయ్యలు పుట్టరని మనం బాధపడాల్సిన పనిలేకుండా ప్రకటనలు రాసే కాపీ రైటర్లు త్యాగయ్య, అన్నమయ్య అవతారాలెత్తుతున్నారు. ఒక అగరుబత్తి ప్రకటన శీర్షిక ఇది:-
“యజ్ఞ అగరుబత్తి యొక్క కాలాతీత సువాసనతో శుభ ప్రారంభాలను జరుపుకోండి”
కింద రన్నింగ్ మ్యాటర్ లో
“వేదమార్గాన్ని చక్కగా చేతితో రూపొందించారు”
లాంటి మరికొన్ని కాలాతీత వాక్యాలున్నాయి.
“ఎక్కువసేపు సువాసనలు వెదజల్లే మా అగరుబత్తిని అన్ని శుభకార్యాలల్లో ఉపయోగించుకోండి” అనడానికి కాలాతీత మాటతో…ఆ అగరుబత్తిని ఉపయోగిస్తే కాలాతీతం అయిపోయేట్లు అనువదించారు.
“వేదమార్గాన్ని చక్కగా చేతితో రూపొందించడం” అంటే మన సనాతన ఆచారాల్లో చెప్పిన పద్ధతుల్లో చేత్తో తయారైన అగరుబత్తులివి అని విశాల హృదయంతో పాఠకులు అర్థం చేసుకోవాలి.
ఆ సంతూర్ లైమ్ ఫ్రేగ్రన్స్ లీలలు; ఈ యజ్ఞ కాలాతీత చేతి తయారీ వేద మార్గం రూపొందడాలు కేవలం హాస్యానికి రూపొందించినవి కాబట్టి…
నవ్వు రాకపోయినా…అపహాస్యంగా తోచినా…మీకు దగ్గర్లోని సంతూర్ డీలరును కానీ, యజ్ఞ సేల్స్ పర్సన్ ను కానీ సంప్రదించగలరు!
కొసమెరుపు అనువాద ప్రకటన:-
ఆరోగ్యకరమైన కడుపు కొరకు నమ్మకమైనది-
“కాయం”
యాభై సంవత్సరాలపాటు మలబద్ధకం కొరకు సమర్థవంతమైన ఆయుర్వేద మందు.
ఇందులో ఏమి లోపించిందో తెలుసుకున్నవారికి పొట్టచెక్కలయ్యేలా నవ్వు గ్యారెంటీ. దాంతో వారి కడుపు సాఫ్ గ్యారెంటీ. బహుశా కాయం కవి హృదయం అదేనేమో! ఏమో! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article