Nancharaiah Merugumala లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా బ్రాహ్మణ పొగడ్తలపై ‘కొణిదెల వారి కాబోయే కోడలు’ లావణ్య త్రిపాఠీ అభ్యంతరం! కులంతోనే బ్రామ్మలు గొప్పోళ్లు కాలేరనేది ఆమె వాదన
………………………………………………………………..
మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పెద్దతమ్ముడు నాగేంద్రబాబు కోడలు కాబోతున్న నటి లావణ్యా త్రిపాఠీ కుటుంబ, సామాజిక నేపథ్యం ఆసక్తికరంగానేగాక గొప్పగానూ కనిపిస్తోంది. తెలుగు హీరో వరుణ్ తేజ్ తో లావణ్యకు నిశ్చితార్ధమైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అయోధ్య (ఫైజాబాద్) కాన్యకుబ్జ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన లావణ్య తండ్రి అలహాబాద్ హైకోర్టు వకీలు కావడం వల్లనో, తల్లి టీచర్ కావగడం వల్లనోగాని మిగిలిన యూపీ తారలతో పోల్చితే కాస్త లిబరల్ భావాలున్న మహిళగా దర్శనమిస్తోంది.
Ads
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, ముంబాయిలోని మంచి విద్యాసంస్థల్లో లావణ్య చదువుకుంది. ఇంత మంచి నేపథ్యం ఉండడం వల్ల నాలుగు సంవత్సరాల క్రితం ఆమె బ్రాహ్మణుల గొప్పతనం విషయంలో లోక్ సభ స్పీకర్, రాజస్థానీ మాహేశ్వరీ ఉపకులానికి చెందిన వైశ్య ప్రముఖుడు ఓం బిర్లాతో బహిరంగంగా విభేదించడం మెచ్చుకోవాల్సిన వాస్తవం.
2019 సెప్టెంబర్ చివర్లో ఓం బిర్లా భారత దేశంలోని బ్రాహ్మణులను ప్రశంసిస్తూ, ‘‘ భారత సమాజంలో బ్రాహ్మణులకు ఎప్పుడూ ఉన్నత స్థానం ఉంది. వారి త్యాగాలు, తపస్సు ఫలితంగా వచ్చిన హోదా బ్రాహ్మణులది. ఈ కారణంగానే బ్రాహ్మణులు సమాజానికి మార్గదర్శులుగా ఉన్నత పాత్ర పోషిస్తున్నారు,’’ అంటూ ట్వీట్ చేశారు.
తన కులమైన బ్రాహ్మణులను వణిక్ ప్రముఖుడైన బిర్లా గారు ఇలా అడ్డగోలుగా ప్రశంసించడం అప్పటికి 28 ఏళ్ల లావణ్య త్రిపాఠీకి నచ్చలేదు. వెంటనే బిర్లా ట్వీటుపై స్పందిస్తూ, ‘‘ కొందరు బ్రాహ్మణుల్లో తాము అధికులమనే భావన ఎందుకు ఉంటుందో నాకర్ధం కాని విషయం. మీరు చేసే పనులను బట్టి మీరు ఉన్నతులో, తుచ్ఛులో అవుతారు గాని, మీ కులాన్ని బట్టి కాదు,’’ అంటూ మండిపడ్డారు లావణ్య.
మొదట ఓం బిర్లా బ్రాహ్మణులపై చేసిన ప్రశంసాపూర్వక ట్వీట్ ను బీజేపీ బ్రాహ్మణ నేతలు ఉటంకించడంతో దీనిపై లావణ్య ఈ విషయంపై వ్యాఖ్యానించాల్సి వచ్చింది. కాని, వెంటనే ఆమె ట్వీట్ పై బ్రామ్మల గొప్పతనాన్ని అంగీకరించే నెటిజనులు ఆగ్రహించారు. ఆమె ట్వీట్ స్క్రీన్ షాట్ ను చూపిస్తూ లావణ్యను బ్రాహ్మణ పద్ధతిలో ఉతికి ఆరేశారు.
దీంతో ఆమె తన ట్వీట్ ను తొలిగించారు. అయినా ఆమె ట్వీట్ ను వదలకుండా పదే పదే చూపించారు బ్రాహ్మణులు. తాను ఎందుకు తన ట్వీట్ ను ‘ఉపసంహరించుకున్నదీ’ లావణ్య కారణాలు వివరించ లేదు. మొత్తానికి సొంత కులస్తుల ఇంటర్నెట్ దాడికి భయపడిన యూపీ అవధీ బ్రాహ్మణ యువతి లావణ్య మరి ‘సాంప్రదాయ కాపు’ కుటుంబం ‘బ్రాండ్ వాల్యూ’ బాగా పెంచుతారని పై వివాదాన్ని బట్టి అంచనా వేయవచ్చేమో!
Share this Article