అది రాయలసీమ అంచున కర్ణాటకకు దగ్గరగా ఉన్న హిందూపురం నియోజకవర్గం. హిందూపురం నుండి కర్ణాటక రాజధాని బెంగళూరు సరిగ్గా వంద కిలోమీటర్లు. దాదాపు రెండు లక్షల మంది హిందూపురం వదిలి బస్సులు, రైళ్లు, కార్లు, బైకులు, ఎడ్ల బండ్లు, చివరికి కాలినడకన బెంగళూరు వెళుతున్నారు. అప్పుడెప్పుడో దేశ విభజన తరువాత మానవ మహా యాత్ర ఇదేనట. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో హిందూపురం వార్తలే. హిందూపురాన్ని కర్ణాటకలో కలపాలన్న డిమాండుతో యాత్ర చేస్తున్నారని మొదట అందరూ రిపోర్ట్ చేశారు. తాగడానికి నీళ్లు లేక వలసపోతున్నారని కొందరనుకున్నారు. రాయలసీమ ముఠా కక్షలు పెరిగి భయపడి పొట్ట చేతపట్టుకుని వెళుతున్నారని కొందరు రాశారు.
రాత్రికి రాత్రి హిందూపురం నియోజకవర్గంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి ఇలా కర్ణాటక రోడ్లమీద దిక్కులేనివారిలా గడపడం చరిత్రలో తొలిసారి. ఏవయినా అంటువ్యాధులు ప్రబలాయేమో అని ఆరా తీస్తే అలాంటిదేమీ లేదని తేలింది. ఎవరయినా బెదిరించారా అంటే అలాంటిదేమీ లేదట. దీనికి తోడు హిందూపురానికి బస్సులు, రైళ్లు ఆగిపోయాయి. కార్లు, బైకులు కూడా నియోజకవర్గం సరిహద్దు వరకే. డాక్టర్లు, మానసిక శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఎందరెందరో నిజనిర్ధారణ బృందాలుగా ఏర్పడి తిరుగుతున్నారు కానీ- నిజం బయటపడలేదు.
—————–
Ads
బెంగళూరు దారిలో ఉన్న హిందూపురం ప్రవాసుల్లో మూడేళ్ల పిల్లాడు తెలియక మీడియావారికి చెప్పడంతో ఆలస్యంగా అసలు విషయం బయటపడింది. రెండు లక్షల మంది బెంగళూరులో ఆసుపత్రులకు వెళుతున్నారట. కొందరికి ఒక చెంప వాచింది. కొందరికి రెండు చెంపలు సమానంగా వాచాయి. కొందరికి పై పళ్లు మాత్రమే రాలాయి. కొందరికి కింది పళ్లు మాత్రమే రాలాయి. కొందరికి అరటి పండు తినడానికయినా పళ్లు మిగలలేదు. ఈ చెంపల బాధ ప్రకృతి సహజంగా దానికదిగా వచ్చినది కాదట. ఓటేసిన పాపానికి హిందూపురం చెంపలు వాయించడానికి ఆరునెలలకొకసారి ఒక కారణజన్ముడు వస్తాడట. వచ్చి గూబ గుయ్ మనిపించి వెళుతుంటాడట. ఈసారి డోస్ ఎక్కువై అందరి బుగ్గల్లో బూరెలు చేరి మాట్లాడ్డం కష్టంగా ఉండి- ఆసుపత్రులు వెతుక్కుంటూ పక్క రాష్ట్రం బాట పట్టారట. హిందూపురంలో ఆసుపత్రులు ఉన్నా- అక్కడికి కారణ జన్ముడు వచ్చి మళ్లీ మళ్లీ చెంపలు చెళ్ళుమనిపించే అవకాశం, అధికారం ఉంటాయి కాబట్టి పొరుగు రాష్ట్రం వెళుతున్నారట.
పాపం!
పిచ్చి హిందూపురం. బెంగళూరులో విమానం దిగే కారణజన్ముడి చేతికి హిందూపురం చెంపలు చేతివాటానికి ఇంకా దగ్గరగా పెడుతున్నామన్న ఫండమెంటల్ పాయింట్ ను మరచిపోయినట్లుంది.
కొట్టు కొట్టు ఇంకా కొట్టు!
దంచరా మేనత్త కొడుకా!
బాగా దంచు!
ఇంకా దంచు!
దంచు దంచు!
మా దుంప తెంచు!!……….. By…….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article