.
ఇది చాలా ఏళ్ల క్రితం సంగతి.. బతుకు బాటలోకి అడుగు పెట్టిన తొలిరోజులు.. అప్పట్లో గుంటూరులో కజిన్ బ్రదర్ వాళ్ల కోళ్ల ఫారాల్లో పని చేసేవాడిని..
అప్పుడు వాళ్ళు కొత్తగా కొన్న లారీల్లో మొదటి ట్రిప్ కి నన్ను కూడా పంపారు.. గుంటూరు నుంచి అస్సాం.. లారీలో, అదీ కోడిగుడ్ల లారీలో జర్నీ.. దాదాపు వారం రోజుల జర్నీ.. లారీ డ్రైవర్ అలీ.. క్లినర్ రాజు.. లారీ క్యాబిన్ లో డ్రైవర్ సీట్ వెనుక అప్పర్ బెర్త్. నా బెడ్ రూమ్..
భలే ఉండేది జర్నీ.. మెగాస్టార్ …సినిమా పాటలు టేప్ రికార్డర్ లో పెట్టుకుని జర్నీ చేసేవాళ్ళం.. డ్రైవర్, క్లినర్ మార్చి మార్చి డ్రైవింగ్ చేసేవాళ్ళు.. క్లినర్ రాజు లారీ ఆపి వంట చేసేవాడు.. భలేగా వండేవాడు..
Ads
అలీ, రాజు ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలికి చెందినవారు.. రాజు పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఎం అలీ మాత్రం ఎప్పుడూ వాళ్ళ ఊరి కబుర్లు చెబుతుండేవాడు.. పగలంతా జర్నీ చేసేవాళ్ళం.. తెల్లవారుజామున లారీ ఆపి నిద్ర పోయేవాళ్ళం.. ముఖ్యంగా ఒరిస్సా, బెంగాల్ లో రాత్రి పూట జర్నీ ప్రమాదం అని చెప్పేవాడు అలీ..
బెంగాల్ లో ఖరగ్ పూర్ సమీపంలో అయితే అటవీ ప్రాంతంలోంచి వెళ్లేప్పుడు మాత్రం పది లారీలని కలిపి పోలీసులు ముందు ఎస్కార్ట్ గా వస్తూ తీసుకెళ్లేవారు.. అప్పట్లో అక్కడ దోపిడీ దొంగల నుంచి లారీ డ్రైవర్లకు ప్రమాదం ఉండేది..
మేము కోడిగుడ్లు ఆన్ లోడ్ చేయాల్సింది కరీం గంజ్ లో.. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.. ఇది వాస్తవానికి అస్సాం రాష్ట్రమే.. కానీ గౌహతి దాటి మేఘాలయ రాష్ట్రం మొత్తం జర్నీ చేస్తే. ఎక్కడో ఆ మూల అంటే బంగ్లాదేశ్ బోర్డర్ లో ఉంటుంది కరీంగంజ్..
అదేమి విచిత్రమో… ఒక రాష్ట్రంలో ప్రాంతం ఇంకో రాష్ట్రం దాటిన తర్వాత ఉంటుంది.. మన రాష్ట్రంలో యానాం మాదిరిగా అన్నమాట.. అక్కడ మహ్మద్ అనే డీలర్ కు మేము కోడిగుడ్లు డెలివరీ ఇవ్వాలి.. మావి మొత్తం పది లారీలు..
అస్సామ్ రాష్ట్రం గౌహతి వరకూ జర్నీ బాగానే ఉంది.. గౌహతి దాటి మేఘాలయలోకి ఎంటర్ అయ్యాక అసలు కష్టాలు మొదలయ్యాయి.. మేఘాలయ మొత్తం ఘాట్ రోడ్డులోనే ఉంటుంది.. అత్యంత ప్రమాదకరమైన రోడ్లు.. ఎక్కడ చూసినా లోయలు.. పైనుంచి లోయని చూస్తేనే భయం వేసేది..
ఆ ఘాట్ రోడ్లలో ప్రయాణం రాత్రి పూట మంచిది కాదు.. దారి పొడవునా దోపిడీ దొంగలు ఉండేవారు.. లారీ డ్రైవర్లను హత్య చేసి డబ్బులు దోచుకెళ్లిన ఘటనలు అప్పటికి చాలా ఉండేవి.. అందుకే రాత్రి పూట ఎనిమిది గంటలకు ఏదో పెట్రోల్ బంక్ వారికి వంద రూపాయలు ఇచ్చి అందులో లారీ పార్క్ చేసేవాళ్ళం..
అక్కడ అయితేనే సెక్యూరిటీ అన్నమాట.. కానీ జీవితంలో బాగా సంతోషంగా ఉన్న రోజులు అవి.. దారి పొడవునా వివిధ రకాల జాతుల మనుషులు, విభిన్న సంస్కృతులు, రకరకాల వాతావరణాలు చూసే అదృష్టం దక్కింది..
మేఘాలయాలో రాత్రిపూట లారీ పార్క్ చేస్తే ఉదయానికి మొత్తం మంచు పెట్టేసి ఉండేది.. ఘాట్ రోడ్లలో ఎక్కడ చూసినా అడవిలో సంత్రా (కమలా కాయలు) కాయలు కనిపించేవి.. ఇక నాకు హిందీ బాష అవసరం అప్పుడే తెలిసింది.. లారీ డ్రైవర్ అలీకి హిందీ బాగా వచ్చు.. అందుకే నాకు హిందీ నేర్పమని ఆడిగేవాడిని.. తిరిగి వెళ్లేలోపు మీతో హిందీ మాట్లాడిస్తా చూడండి అన్నాడు.
మేఘాలయాలో అప్పట్లో దాదాగిరి ఉండేది.. అంటే వచ్చే లారీలని ఆపి అక్కడి రౌడీలు డబ్బులు వసూలు చేసేవారు. డబ్బులు ఇవ్వకపోతే డ్రైవర్లని చితకబాదేవారు.. షిల్లాంగ్ సమీపంలో ఒక స్కార్పియో వాహనం రోడ్డుకు అడ్డంగా పెట్టి ఒక దాదా డబ్బులు వసూలు చేస్తున్నారు.. మా డ్రైవర్ అలీ వాడికి డబ్బులు ఇచ్చి వాడిని బతిమాలాడి వెనక్కి వచ్చి లారీ ఎక్కాడు..
ఎందుకు వాడిని బతిమలాడుతున్నావు.. డబ్బులిచ్చావు కదా అంటే.. అతను చాలా ఎక్కువ అడుగుతున్నాడు.. అందుకే బతిమిలాడాల్సి వచ్చిందన్నాడు.. డబ్బులు ఎందుకివ్వాలి అన్నాను నేను.. సరే ఒక పని చేయండి .. మీరు వాడి దగ్గరకు వెళ్లి అదే మాట అడగండి అన్నాడు.. నాకు బాష రాదు కదా అన్నా..
నేను చెప్పింది చెప్పినట్టు అనేయండి.. వాడికి అర్ధమవుతుంది అన్నాడు..
సరేనని దాదా దగ్గరకు వెళ్లి ఇలా అన్నాను.. “అరే.. సువ్వర్ కే బచ్ఛే.. తుమ్ కో తుకడా తుకడా సే మార్ దాలూంగా సాలే” అన్నాను.. వెంటనే వాడు “మారో ఏ ఆంధ్రా సాలేకో” అంటూ లేచాడు.. వెంటనే వాడి అనుచర గణం నా మీదికి ఉరికారు.. అక్కడి నుంచి పారిపోయి లారీలో ఎక్కాను.. భలే చెప్పారండీ మీరు.. అంటూ లారీని ముందుకు పోనిచ్చాడు అలీ.. వాడికి అంతలా కోపం వచ్చింది.. నేను అన్నదాంట్లో తప్పుందా అని అడిగా.. అలీ నవ్వాడు..
.
కాసేపటికి మా లారీ వెనుక వల్ల స్కార్పియో పరుగులు తీస్తూ వచ్చి లారీకి అడ్డుగా పెట్టారు.. వెంటనే అలీ వెళ్లి వాళ్ళకి నచ్చ జెప్పి బతిమలాడి వచ్చాడు.. ఆ తర్వాత షిల్లాంగ్ దాటాక ఒక పెట్రోల్ బ్యాంకులో లారీ ఉంచినప్పుడు ఒక అమ్మాయి సంత్రా కాయలు అమ్ముతూ లారీ దగ్గరకు వచ్చింది..
అప్పుడు ఆ అమ్మాయితో హిందీలో మాట్లాడమని కొన్ని మాటలు చెప్పాడు.. అప్పుడు ఆ మ్మాయి దగ్గరకు వెళ్లి చేతులతో సైగ చేస్తూ “తుమ్ సంత్రాకా సైజ్ అఛ్చీ హై.. మై ఏక్ బార్ ఉస్ కో పకడ్‌నా” అన్నాను.. ఏమైందో తెలీదు, ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ చుట్టు పక్కల అందర్నీ పిలిచి గొడవ చేసింది.. మళ్లీ మా అలీ రంగంలోకి దిగి నాకు భాష రాదని సర్ది చెప్పాడు..
కరీంగంజ్ కి వెళ్ళినపుడు అక్కడి వర్కర్స్ ధర్నా చేయడం వల్ల లారీ వారం రోజుల పాటు అన్ లోడ్ కాలేదు.. అన్ని రోజులూ అక్కడే ఉన్నాము.. అదే టైంలో లారీలో సరుకులు అయిపోతే.. కొనడానికి నేను అలీ వెళ్ళాము.. ఒక కిరాణా షాపులో ఒక లావుగా ఉన్న మహిళ కూర్చుని ఉంది..
సార్, మీరు ఆమె దగ్గరకు వెళ్లి ఏదో అడగమన్నాడు.. హిందీ నేర్చుకునే ఉత్సాహంలో ఆమె దగ్గరకు వెళ్లి.. ” ఆంటీ ఇదర్ రండీ మిల్తే హై అన్నాను.. క్యా బోల్తా తూ అంది ఆమె.. మళ్లీ రిపీట్ చేసా.. “రండీ మిల్తే హై.. రండీ .. రండీ” అన్నాను.. వెంటనే ఆమె ఉగ్రరూపంతో పైకి లేచింది..
బరువులు తూచే కాటాని నా మీదికి విసిరికొట్టింది.. బిస్కట్ల డబ్బా విసిరింది.. అవి రెండూ గురి తప్పాయి.. ఏదో కొంపమునిగే ప్రమాదం జరిగిందని ఊహించి పారిపోయి వచ్చాను.. దూరంగా ఉన్న అలీ అది చూసి నవ్వి ఏమి ఆడిగారండీ, అంతలా కొట్టడానికి వస్తున్నారు వాళ్ళు అన్నాడు.. నువ్వు అడగమన్నదే అడిగాను కదా అన్నాను.. అలీ నవ్వి.. నేను అడగమన్నది చావల్ అండీ అన్నాడు..
ఆ తర్వాత చాలాసేపటికి రండీ అంటే అర్థం చెప్పాడు అలీ.. అలా అక్కడ ఉన్న వారం రోజులు హిందీ మీద విపరీతమైన ప్రయోగాలు చేసాను.. అలీ కూడా నా చేత మొత్తం మీద వచ్చి రాని హిందీ మాట్లాడించాడు.. హిందీ రావాలంటే ముందు బూతులు నేర్చుకోవాలండీ..
అప్పుడు ఆటోమేటిక్ గా భాష వస్తుంది. ఇప్పుడు నేను అన్ని చోట్లా మీతో బూతులు మాట్లాడించాను.. ఈ గొడవల వల్ల ఇవి మీకు ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత కూడా గుర్తుంటాయి చూడండి అన్నాడు.. అతను అన్నది నిజమే, ఇరవై ఏళ్ళ తర్వాత కూడా నిజంగానే గుర్తున్నాయి… – – – అశోక్ వేములపల్లి
Share this Article