డాడీ నన్ను కావాలనే బలవంతంగా బ్యాంకుకు తీసుకెళ్లాడు… ‘‘అబ్బా, ఏమిటి నాన్నా… ఇక్కడి దాకా రావడం, మన వంతు వచ్చేదాకా వెయిట్ చేయడం… ఎప్పట్నుంచో చెబుతున్నాను… నువ్వు వచ్చింది ఎవరికో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి… అంతే కదా… అదేదో, ఇంట్లో కూర్చుని, ఎంచక్కా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తే సరిపోయేది కాదా… కాలం మారుతోంది, టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి… మనం దానికి అడాప్ట్ కావాలి నాన్నా…’’ అని విసుక్కుంటూనే ఉన్నాను…
నిజమే కదా… ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉంటే చాలదా… అర నిమిషంలో క్యాష్ ట్రాన్స్‌ఫర్ జరిగిపోతుంది… అదీ వద్దనుకుంటే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ కూడా వచ్చింది… అరచేతిలో బ్యాంకు… అరక్షణంలో ట్రాన్సాక్షన్… ఇంకా చెక్కులు రాసివ్వడం, ఆర్టీజీఎస్ కాలంలోనే ఉంటే ఎలా..? అదీ నా విసుగు… నాన్న నవ్వుతూ విన్నాడు… నాది చాదస్తం కాదురా అన్నాడు… మరేమంటారు దీన్ని అన్నాను ఇంకాస్త విసుగు ధ్వనిస్తూ…
‘చాదస్తం కాదా..? అటూఇటూ తిరగడం దేనికి..? నీకేది కావాలన్నా ఆన్‌లైన్ షాపింగ్ సైటు హోమ్ డెలివరీ చేస్తుంది… తలనొప్పి టాబ్లెట్ దగ్గర నుంచి కందిపప్పు దాకా… ప్లేటు ఇడ్లీ దగ్గర నుంచి చీపురు కట్ట దాకా… అంతెందుకు నాన్నా… అమెజాన్ వాడు లేడా..? వాడు సప్లయ్ చేయని సరుకంటూ ఉందా అసలు..? ఇప్పుడంతా కన్వీనియెన్స్, టైమ్ సేవింగ్, టెక్నాలజీ… మారాలి నాన్నా…
Ads
‘నువ్వు చెప్పినట్టు అన్నీ ఇంట్లో నుంచే ఆర్డర్ చేద్దాం… అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే పొందుదాం… సరే, కానీ అవన్నీ ఇంట్లో నుంచే చేస్తే, అసలు మనం ఇల్లు వదిలి బయటికి వచ్చే పనే ఉండదు కదరా…’ అన్నాడు నాన్న… ‘అవును, అంతేకదా… అదేకదా చెప్పేది… చివరకు కిరాణ సామగ్రి కూడా ఇంటి డోర్ దగ్గరకే వస్తుంది నాన్నా… పాలు, పేపర్, ఉప్పూపప్పూ… అన్నీ… ఎవరీ థింగ్…’ అన్నాను నేను…
‘ఒరేయ్, బ్యాంకుకు వచ్చాను కదా… నలుగురు ఫ్రెండ్స్ కలిశారు, వాళ్లలో ఇద్దరు చాన్నాళ్లయింది కనిపించక… వాళ్లే కాదు, ఈ బ్యాంకులో పనిచేసేవాళ్లలోనూ ఒకరిద్దరు పరిచయస్థులు ఉన్నారు… పలకరిస్తే హేపీగా ఫీలయ్యారు… నేను ఒంటరివాడినిరా… నన్నెవరూ కలవరు, నేనెవరినీ కలవను… ఎడారి జీవితం… ఎప్పుడోఓసారి ఏదో పనిమీద బయటికి వచ్చి పది మందినీ పలకరిస్తేనే కదరా జీవితం… బ్యాంకుకు వచ్చింది నగదు బదిలీ కోసం కాదురా… ఈ బంధాల నవీకరణ కోసం…’
‘అబ్బా… నీదో ఇదే సమస్య నాన్నా… కదిలిస్తే చాలు, తత్వం చెబుతావ్, వైరాగ్యం వినిపిస్తవ్…’
‘రేయ్, చాన్నాళ్లు మంచాన పడి, కష్టమ్మీద కోలుకుని, మెల్లిగా నడుస్తూ బ్యాంకుకు వచ్చాడురా ఆ అంకుల్… పరామర్శించి, కౌగిలించుకున్నాను… వాడి కళ్లలో నీళ్లు చూశాను… అమెజాన్ వాడు ఇవ్వలేడు కదరా ఈ అనుభూతుల్ని, బంధాల్ని… తోటి మనిషి భౌతిక స్పర్శ ఏ మనిషినైనా త్వరగా కోలుకునేలా చేస్తుంది… జీవితం పట్ల ఆశను పెంచుతుంది… కనీసం బతికిస్తుంది…’
‘ఏమో నాన్నా… నువ్వు ఏదేదో చెబుతావ్… దేన్ని దానికే పరిమితం చేసి చూడాలి… అంకుల్‌ను చూడాలనుకుంటే వాళ్ల ఇంటికే పళ్లు తీసుకుని వెళ్తాం కదా…’
‘నిజమే… పనిగట్టుకుని పరామర్శించడం కాదు… కనిపిస్తే పలకరించడంలో ప్రయోజనం ఏమిటంటే… ఎప్పటికప్పుడు బంధాలు రెన్యువల్ అయిపోతుంటాయి… రెండేళ్ల క్రితం నేను మంచాన పడితే, నేను తరచూ పళ్లు కొనే షాపు ఓనర్ పరామర్శకు వచ్చాడు, నా మంచం మీదే, నా పక్కనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు… నేనెవడినిరా, తనకేమైనా చుట్టమా..? రిలేషన్స్ అన్నీ నెత్తుటితోనో, కుటుంబంతోనో ముడిపడి ఉండవురా, హ్యూమన్ టచ్ అనే పదానికి సంపూర్ణ నిర్వచనం ఎవడూ ఇవ్వలేడు… అనుభవించేవాడికే అర్థమయ్యేది అది…’
నేను ఏమీ మాట్లాడలేదు… నాన్న ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే నా దగ్గర ఎప్పుడూ జవాబు ఉండదు… ‘రేయ్, మొన్నామధ్య మీ అమ్మ హఠాత్తుగా పడిపోతే, దగ్గరలో మనం ఎప్పుడూ కిరాణ సామాగ్రి కొనే సేటు పరుగున వచ్చి, తన కారులో తీసుకెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ చేశాడు… నాకో, 108కో ఫోన్ చేసి, చేతులు దులుపుకోలేదు… అమెజాన్ వాడికి ఆ హ్యూమన్ టచ్ ఎలా సాధ్యంరా…’
ఒక మందుల షాపు, ఒక కిరాణా షాపు, ఒక పళ్ల దుకాణం, ఒక కూరగాయల బండీ, ఒక పాలవాడు, ఒక పేపర్ బాయ్… వాళ్లను కేవలం సెల్లర్స్‌గా చూడలేం… వాళ్లతో మనకు ఓ బంధం ఏర్పడుతుంది… అది అక్షరాలకు, బాష్యాలకు అతీతం… ఆన్‌లైన్, అమెజాన్ అవసరమే… కానీ అవసరమున్న మేరకు మాత్రమే… టెక్నాలజీని, పరికరాల్ని మనం వాడుకోవాలి…
ఒకటి చెబుతానురా… నేను చనిపోతాను, నువ్వు ఎవరికో ఫోన్ చేస్తావు, కైలాస వాహనం వస్తుంది, ఎక్కిస్తారు.., క్రిమటోరియం స్లాట్ ఆన్‌లైన్‌లోనే బుకింగ్… అస్థికల నిమజ్జనం మీద ఆఫర్లు, హోమ్ కలెక్షన్… ఆన్‌లైన్ పేమెంట్స్… అస్థికల నిమజ్జనం వీడియో బిట్ నీకు ఫార్వర్డ్ చేస్తారు… ఒక ఛాప్టర్ క్లోజ్… వింటుంటేనే చేదుగా ఉంది కదా… అవునురా… నిజం నిష్ఠురంగానే ఉంటుంది… పరికరాలతోనే కాదురా సహజీవనం, కాస్త ప్రజలతోనూ కాలం గడుపు…!! ఆఫ్టరాల్ మనుషులం… ఏముందిరా, మాట కలుపుదాం, పోయేదేముంది, మహా అయితే మళ్లీ ఓ చిరునవ్వుతో పలకరిస్తారు…!!
చివరగా :: అప్పట్లో తెలుగులో పిల్ల జమీందార్ అనే సినిమా వచ్చింది… చూడదగ్గ సినిమా… కాదు, చూడాల్సిన సినిమా… అందులో ఓ డైలాగ్ కాస్త ఇటూఅటూగా… ‘‘దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి ఇచ్చాడు… కానీ మనం మనుషుల్ని వదిలేస్తున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం…’’ (ఎప్పటిలాగే ఓ ఇంగ్లిష్ పోస్టుకు నా తెలుగు రీమేక్… శ్రీనివాసరావు మంచాల)…
Share this Article