బీజేపీ కంప్లీట్ రైట్ దారి… సీపీఎం, సీపీఐ కంప్లీట్ లెఫ్ట్ దారి… తెలంగాణలో ఈ రెండు పక్షాలూ గందరగోళంలో పడిపోతూ కొట్టుకుంటున్నాయి… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే సీటు గెలుచుకుని దారుణంగా భంగపడిన బీజేపీ నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్నాక కాస్త తెరిపిన పడింది… తరువాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలనూ గెలుచుకుంది… ఆ ఊపులో ఏకంగా తెలంగాణలో తామే అధికారంలోకి వచ్చేసినట్లు కలలు కనడం మొదలుపెట్టారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా…
ఒకే ఒక్క రాజాసింగ్… మొత్తం తెలంగాణలో సొంత బలం మీద గెలిచిన బీజేపీ లీడర్… ఇప్పుడు తను ఆ పార్టీలో ఉన్నాడో లేదో, ఉంటాడో ఉండడో తెలియని దురవస్థ… నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపు కూడా మోడీ మీద ప్రజల నమ్మకం, అభిమానమే తప్ప సొంత బలాలు కావు… కేసీయార్ ఉత్తర తెలంగాణలో స్ట్రాంగ్… అక్కడే మూడు ఎంపీ సీట్లు గెలవడం చిన్న విషయమేమీ కాదు… కానీ ఆ ఊపును కంటిన్యూ చేసుకున్నదే లేదు…
ఎవడూ కొత్తగా పార్టీలో చేరరు, చేరినవాడు నాలుగు రోజులు ఉండడు… ఉండనివ్వరు… జాతీయ స్థాయిలో కంట్రాక్టులు గట్రా ప్రయోజనం పొందే వీలున్నా సరే పొంగులేటి, జూపల్లి తదితరులు బీజేపీలో చేరకపోవడానికి కారణం ఏమిటి..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కొంతే… కానీ బీజేపీలోని వర్గవిభేదాలు వారిని వెనుకంజ వేయించాయి… బీజేపీలో ఇన్నాళ్లుగా పెత్తనాలు చెలాయిస్తున్నవాళ్లదే ఈరోజుకూ గ్రిప్… చివరకు బండి సంజయ్ కూడా ఆ గ్రూపు ధాటికి బలయిపోయి బాధితుడిగా మిగలబోతున్నాడు…
Ads
అన్నింటికీ మించి ముఖ్యుల్లో ఎవరు కేసీయార్ కోవర్టో, ఎవరు నిజమైన పార్టీవాదులో ఎవరికీ అంతుపట్టని విషయం… అమిత్ షాకు, మోడీకి ఇవేవీ తెలియవా..? తెలుసు… వాళ్లు కూడా చక్కదిద్దలేని దుస్థితి… ఇప్పుడైతే రఘునందన్, జితేందర్‌రెడ్డి, ఈటల తదితరుల ట్వీట్లు బీజేపీలోని అంతర్గత తన్నులాటల్ని బహిర్గతం చేస్తూ… మరింత గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి…
అసలే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది… కేసీయార్‌ను నిలువరించడం కాంగ్రెస్‌కే సాధ్యం అనే భావన బలపడుతోంది… ఇక్కడ రేవంత్‌రెడ్డిని చూసి కొత్తగా నాయకులు చేరడం లేదు… కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు చూశాక, తెలంగాణలోనూ అది జరుగుతుందనే నమ్మకం పెరగడం… కేసీయార్ మీద వ్యతిరేకత పెరగడం… అందుకని జంపింగ్ జపాంగ్లు కాంగ్రెస్‌ను ఎంచుకుంటున్నారు… కాంగ్రెస్ లీడర్లను కేసీయార్ లాగేసుకోవచ్చుగాక, గెలిచినవాళ్లను గుంజుకోవచ్చుగాక… కానీ కేడర్ అలాగే ఉంది, కాంగ్రెస్‌కు అదే శ్రీరామరక్ష… కానీ బీజేపీ..?
సంస్థాగతంగా పెరగలేకపోయింది… అధికారం వస్తుందని కలలు కనడమే తప్ప క్షేత్రస్థాయిలో బలపడిందెక్కడ..? అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని చూడరు, గత ఎన్నికల్లో అదే నిరూపితమైంది… స్థానికంగా బలంగా ఉన్న లీడర్లు ప్లస్ రాష్ట్ర స్థాయి పార్టీల ఎజెండా గెలుపోటముల్ని నిర్దేశిస్తాయి… (అఫ్‌కోర్స్ టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారి, ఇతర రాష్ట్రాల్లోకి ఎంట్రీపైనే కాన్సంట్రేట్ చేస్తూ, తన లోకల్ ఫ్లేవర్ కోల్పోయింది, అది వేరే సంగతి)… ఐనాసరే… బీజేపీ మారలేకపోయింది… ప్రస్తుతం బీజేపీ జోష్ తెలంగాణలో బాగా పడిపోయిందనేది నిజం…
మరి లెఫ్ట్..? వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది… అవి ఎప్పుడో తోకపార్టీలుగా మారిపోయాయి కదా… ఏదో ఓ ప్రధాన పార్టీకి తోకగా మారితేనే వాటికి మనుగడ… కేసీయార్ కరుణిస్తే ఒకటీరెండో సీట్లు ఇస్తే, ఎలాగోలా బతికేయొచ్చు… మునుగోడు ఉపఎన్నికవేళ కేసీయార్‌కు అవసరం కాబట్టి లెఫ్ట్‌తో కలిసి అడుగులకు సై అన్నాడు… తనకు లెఫ్ట్ అంటేనే చిరాకు… ఇప్పుడిక అసెంబ్లీకి ‘దగ్గరకు రానిస్తే’ వాళ్ల డిమాండ్లతో కొత్త తలనొప్పులు… అందుకని కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు…
బీజేపీతో పోరుకు ఎవరితోనైనా కలుస్తాం అంటూ లెఫ్ట్ పదే పదే పిచ్చి సమర్థనకు పూనుకుంటూ… కేసీయార్ రమ్మంటాడేమో, ఉదారంగా రెండో మూడో సీట్లు ఇస్తాడేమో అని ఆశతో బతుకుతున్నాయి లెఫ్ట్ పార్టీలు… రెండూ కలిసి కొట్లాడినా ఒక్క స్థానంలోనూ గెలుపు అవకాశాల్లేవు… ప్రస్తుతం ప్రగతిభవన్ వైపే ఆశగా చేతులు చాచి దేబిరిస్తున్న తీరు ఆయా పార్టీల అభిమానులనే కలిచివేస్తోంది… సో, ఇదీ తెలంగాణలోని రైట్, లెఫ్ట్ పార్టీల దురవస్థ…
కాంగ్రెస్ సిట్యుయేషన్ అంటారా..? అధికారానికి తగిన మెజారిటీ వస్తే సరే… లేదంటే కేసీయార్‌లోని ఫక్తు రాజకీయ నాయకుడు పంజా విసురుతాడు..! ఎవరో నాయకుడు ఆరోపించినట్టు… ఎంపిక చేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చు కూడా భరించే అవకాశాన్ని తోసిపుచ్చలేం… మొత్తం జాతీయ ప్రతిపక్షాల ప్రచారవ్యయాన్ని భరించడానికి సిద్ధపడిన కేసీయార్‌కు ఎమ్మెల్యేలను లాగేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారవ్యయం భరించడం పెద్ద లెక్కా..?
Share this Article