‘‘మంచి తోకలుగా ఉంటాం… దయచేసి మమ్మల్ని అతికించుకొండి, ప్లీజ్… నమ్మకంగా విధేయంగా ఉంటాం… జెండాలు మోస్తాం, ఎజెండాలు మోస్తాం…’’ అంటూ ఏ ప్రధాన పార్టీ పిలుస్తుందా..? ఎప్పుడు లటుక్కున అతుక్కుపోదామా..? అన్నట్టుగా మారిపోయాయ్ లెఫ్ట్ పార్టీల ప్రస్థానాలు… వ్యంగ్యంగా అనుకున్నా, నిజమైన కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్ అభిమానుల్లో ఉన్న ఆవేదనే ఇది… అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైనా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలైనా… సొంతంగా ఎదగడానికి చేసే పోరాటం లేదు, ఆ ఆరాటమూ లేదు ఇప్పుడు… ఏదో ఓ పార్టీకి తోకగా మారాలనే తపన తప్ప…
కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన… అయిపోయాయ్… జగన్ ఎప్పుడూ దగ్గరకు కూడా రానివ్వలేదు… లేని బలాన్ని భూతద్దాల్లో చూస్తూ, చూపిస్తూ సీట్ల డిమాండ్లతో నెత్తికెక్కుతారని జగన్ సందేహం… అందుకే వదిలేశాడు… చివరకు పవన్ కల్యాణ్‌కు కూడా అర్థమైంది… తనూ వదిలేశాడు… కేసీయార్ మొదటి నుంచీ లెఫ్ట్ అంటే లెఫ్టే… అంటే విడిచిపెట్టేశాడు అని… తనెప్పుడూ వాళ్లను దగ్గరకు రానివ్వలేదు… కాకపోతే ఇప్పుడు బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాళ్లతో అర్జెంటుగా మజ్లిస్ అనబడే అత్యంత లౌకిక పార్టీకి తోడు అదనపు సెక్యులర్ జెండాలు కావాలి… కేసీయార్ ఎప్పుడెప్పుడు రమ్మంటాడా, వెళ్లి ఆ టీఆర్ఎస్ క్యాంపు డ్యూటీలో చేరిపోదామా అని ఎదురుచూస్తోంది కదా లెఫ్ట్… వెళ్ళి పెనవేసుకుంది…
అసలు కేసీయార్ వద్దన్నా సరే, బాబ్బాబు ప్లీజ్, మమ్మల్ని కాదనకు… అన్నట్లు డెస్పరేటుగా ఉన్నారు… ఎలాగూ ఓ మంచి సాకు ఉండనే ఉంది, మతతత్వ, ఫాసిస్ట్ బీజేపీని నిలువరించడానికి ఏ లౌకికశక్తికైనా మద్దతునిస్తాం అని…! ఇంకేముంది..? కేసీయార్ రమ్మన్నాడు, నిమిషాల్లో వెళ్లారు, జైకేసీయార్… ప్రస్తుతం మేం టీఆర్ఎస్ తోకలం అని సగర్వంగా, తలెత్తుకుని ప్రకటించేశారు… ముందు సీపీఐ ప్రకటన పూర్తయింది… సీపీఎంకు కాస్త బేరమాడే శక్తి, గీర ఎక్కువ కదా… అదింకా ప్రకటించాల్సి ఉంది… (పెద్ద పార్టీలతో పొత్తులు, అవగాహనలు ఏ సమర్థ పోరాట వ్యూహం కిందకు వస్తాయో ఆ పార్టీల సిద్ధాంతకర్తలకే తెలియాలి…)
Ads
సీపీఎంను కాసేపు వదిలేద్దాం… సీపీఐ మాటలు ఆ పార్టీ మీద జాలిపుట్టించేలా ఉన్నాయి… ఆ పార్టీ నాయకత్వాలపై సానుభూతి పుట్టించేలా ఉన్నాయి… ‘‘మునుగోడులో పోటీచేసేందుకు ప్రస్తుతం సీపీఐ రెడీగా లేదు, అందుకని తెరాసకు మద్దతునిస్తున్నాం’’ అని ఆ పార్టీ నాయకుడు చాడ వెంకటరెడ్డి చెబుతున్నాడు… ఫాఫం… 1985 నుంచి చూస్తే, ఏకంగా అయిదుసార్లు ఆ సీటు నుంచి గెలిచింది సీపీఐ… ఏ పార్టీకి తోకగా ఉండి గెలిచిందో పక్కనపెడితే… గెలిచాక ఏం బలపడింది..? బలపడలేనప్పుడు వేరే పార్టీ పంచన బతకడం దేనికి..? ఈ పోరాటాలు దేనికి..? ఈ ఆరాటాలు దేనికి..?
ఛల్, ఈ ఫ్యూడల్ పార్టీలకు, ఈ ఫాసిస్ట్ అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా ఒక్కటవుదాం, నిలబడదాం, ప్రజల్ని సమీకరిద్దాం అనే పోరాటకాంక్ష ఏమైంది..? ఎన్నికకు రెడీగా లేము కాబట్టి తెరాసకు మద్దతు అనే ‘దివాలా ప్రకటన’ ఎలా వస్తోంది..? మునుగోడే కాదు, అన్ని ఎన్నికల్లోనూ తెరాసతో కలిసి పనిచేస్తారట… ముందే చెప్పేశారు… మనస్సుల్లో ఆనందం, హమ్మయ్య, కేసీయార్ మమ్మల్ని తన పంచన చేర్చుకున్నాడు, ఇది చాలు అన్నట్టుగా ఉంది… కానీ ఏమాటకామాట, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి భలే చెప్పాడు… ‘‘తెరాసతో కలిసి పనిచేస్తాం కాబట్టి ప్రజల సమస్యలపై మా పోరాటం ఆగదు’’ అన్నాడు…
ప్రధాన పార్టీకి, ప్రత్యేకించి అధికార పార్టీకి తోకలుగా అతుక్కుపోయాక, ప్రజాసమస్యలు, పోరాటాలంటూ తోకలు జాడిస్తామంటే ఆ పార్టీ ఊరుకోదు కామ్రేడ్… ఇంతకీ రేపో ఎల్లుండో సీపీఎం నేత తమ్మినేని కూడా ఇలాగే మాట్లాడబోతున్నాడా..? ‘‘తెరాసతో కలిసి పనిచేస్తాం, కానీ ప్రజాసమస్యలపై రాజీపడబోం’’ అంటాడా..? ప్రగతిశీల శక్తులతో అవగాహన ద్వారా బీజేపీని ఎదుర్కుంటాం అంటాడా సీపీఐ చాడ వెంకటరెడ్డిలాగే..! ఇంతకీ ప్రగతిశీల శక్తి అనగానేమి కామ్రేడ్..? మనల్ని చేరదీస్తే చాలు, అదే ప్రగతిశీలం, అంతేనా..? హేమిటో, ఈమధ్య అందరూ నారాయణలాగే మాట్లాడుతున్నారు..!!
Share this Article