.
ఓ ఫోటో కనిపించింది కాస్త ఆలస్యంగానే… నవ్వొచ్చింది… వృద్ధ నాయకత్వాలు, పడికట్టు పదాలు, పిడివాదాలు, విదేశీ భావజాలానికి దాసోహం వంటి అనేకానేక కారణాలతోపాటు… ఇదుగో ఇలాంటి చేష్టలు కూడా ప్రస్తుత తరం నుంచి రిక్రూట్‌మెంట్ ఆగిపోవడానికి ఓ కారణమేనేమో అనిపించింది…
ఆ ఫోటో ఏమిటంటే..? ఆదానీ తయారు చేసే అత్యాధునిక డ్రోన్లను ఇజ్రాయిల్ దిగుమతి చేసుకుంటోందట… సో, ఆ అమ్మకాలు ఆపేయాలట… తద్వారా ఇండియా తన పాత ప్రతిష్టను పునరుద్ధరించుకోవాలట… వెంటనే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాలట…
Ads
వాళ్లే పదీ ఇరవై మంది… ఏ ఇష్యూ వచ్చినా సరే, అవే పెద్ద జెండాలు, ఫుల్ టైమ్ వర్కర్స్ బజారులోకి వస్తారు… నినాదాలు ఇస్తారు… పార్టీ చెబుతుంది, వీళ్లు పాటిస్తారు… సొంత బుర్రల్ని వాడటం నిషిద్ధం… వాడితే బహిష్కరణే…
ఇదే పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ స్పాన్సర్డ్ దుకాణం కదా… ఒక్కసారైనా అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్, సరిహద్దుల్లో కయ్యాల గురించి ఒక్కడూ మాట్లాడడు… బహుశా అదే కరెక్టు అనేదేనేమో సదరు పార్టీ యాంటీ జాతీయ సిద్ధాంతం… పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించీ మాట్లాడరు… పాకిస్థాన్ చైనాకు కట్టబెట్టిన జాగా గురించీ పల్లెత్తు మాట్లాడరు… దేశంలో లెఫ్ట్ అంతర్ధానమైపోతున్నా అదే పోకడ, అదే విదేశీ దాస్యం…
ఇదుగో ఆదానీ డ్రోన్లపై మాత్రం హైదరాబాదులో నిరసన… (తెల్లారి వాళ్ల దిన పత్రికలో ఓ వార్త… గంటసేపు నినాదాలు చేశారట… ఫాఫం… చివరకు అలా తయారయ్యాం…) ఇక్కడ ప్రశ్న ఏమిటంటే.,.? ఆదానీ డ్రోన్లను ఇజ్రాయిల్‌కు ఎందుకు అమ్మకూడదు..? ఎందుకంటే..? అది పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ వంటి వీర సెక్యులర్ దేశాల మీద ప్రయోగిస్తుంది కాబట్టి… సెక్యులర్ పతివ్రతలకే పాఠాలు చెప్పే ఈ జిన్‌జియాంగులు సహించరు కాబట్టి…
అయ్యలూ… కామ్రేడ్లు అనాలేమో… ఆదానీ అనేది ఓ వ్యాపార కంపెనీ… ఇజ్రాయిల్‌కు కాకపోతే ఉక్రెయిన్‌కు అమ్ముకుంటాడు… అడిగితే ఉత్తర కొరియాకూ అమ్ముతాడు… అత్యాధునిక టెక్నాలజీ, యుద్ధతంత్రాలు, పరికరాలకు పెట్టింది పేరైన ఇజ్రాయిల్ కూడా మన తయారీ డ్రోన్లు కొంటున్నదంటే విశేషమే కదా…
పోనీ, ఆదానీ అమ్మదు, మోడీ అమ్మనివ్వడు, లెఫ్ట్ ఊపులకు బెదిరిపోతాడే అనుకుందాం… ఇజ్రాయిల్ తన యుద్ధ అవసరాల కోసం ఏ అమెరికా నుంచో ఏ దక్షిణ కొరియా నుంచో కొంటుంది… అంతెందుకు, ఇదే చైనా అమ్ముతుంది… దానికీ వ్యాపారమే ముఖ్యం… మన ఇండియన్ కమ్యూనిస్టుల్లాగా మరీ సైద్ధాంతిక మడికట్టుకునే రకం కాదు అది…
సో, చుట్టూ ఉన్న జనం సమస్యలు బోలెడు… ఉద్యమించండి… సమీకరించండి… అండగా నిలబడండి… రుణమాఫీ లోపాలు, అస్తవ్యస్తంగా హామీల అమలు, హైడ్రాలు, మూసీలు… ఎన్ని లేవు..? కేటీయార్ ఎక్కడ ఎర్రజెండాలు అని అడుగుతున్నందుకు కాదు… వాళ్లకు కావల్సినప్పుడే ఎర్రజెండాలు, లేదంటే సూదులు, దబ్బనాల కార్యకర్తలు మీరు… మీ పొడ గిట్టని ఓ మాదిరి రేసిజం అది… ఏవి ఎర్రెర్రని జెండాలు అంటూ ఏ ఆంధ్రప్రభ వాడో రాశాడని కాదు… జనం కోసం… ప్రయోజనం కోసం..!!
Share this Article