.
సాధారణంగా ఎవరిదైనా బయోపిక్ తీసినప్పుడు… సదరు వ్యక్తి కుటుంబసభ్యులను నిర్మాతలు అప్రోచ్ అవుతారు… తదుపరి లీగల్ సమస్యలు రాకుండా ఉండేందుకు..!
ఎవరైనా ఏమైనా ఆశిస్తే ఫుల్ ఫిల్ చేస్తారు… తరువాత సాఫీగా సాగిపోతుంది… మరి నిర్మాత రానా నాయుడు, హీరో దుల్కర్ గానీ ఈ ప్రయత్నం చేయలేదా… చేసినా ఎక్కడో తేడా కొట్టిందా తెలియదు… కాంత అనే రాబోయే ఓ బయోపిక్ కోర్టుకు ఎక్కింది…
Ads
సినిమా విడుదల మీద స్టే ఇవ్వలేదు గానీ వచ్చే 18 లోపు సమాధానం ఇవ్వాలని కోర్టు సినిమా బాధ్యులకు నోటీసులు జారీ చేసింది… ఈ సినిమా వచ్చే 14న రిలీజ్ కావల్సి ఉంది… బుకింగులు కూడా స్టార్టయ్యాయి…
ఎవరు కోర్టుకు ఎక్కింది..? తమిళ తొలి సూపర్ స్టార్ ఎంకె త్యాగరాజ భాగవతార్ (ఎంకేటీ) అనే తొలితరం సూపర్ స్టార్ బయోపిక్ …. కానీ లీగల్ సమస్యల దృష్ట్యా ఇది బయోపిక్ కాదనీ, జస్ట్, ఓ కల్పిత కథ అని రానా చెబుతున్నాడు… అలాగే చెబుతారు కూడా…
కానీ సదరు భాగవతార్ మనమడు ఏం అంటున్నాడంటే..? (కోర్టుకు ఎక్కింది తనే…) అదే పేరు పెట్టకపోయినా, మా తాత జీవిత చరిత్రనే నికృష్టంగా చిత్రీకరించాడనీ, చూసేవాడికి ఇట్టే అర్థమైపోతుందనీ అంటున్నాడు…

“కాంతా సినిమాలో మా తాతను చెడు నైజం గల వ్యక్తిగా, నీతి లేని మనిషిగా చూపిస్తున్నారు… ఇది పూర్తిగా అవమానకరం, అసత్యం… మా కుటుంబాన్ని దూషించడమే ఇది..’’
‘‘భక్తి, వినయం, దానశీలత లక్షణాలున్న తొలితరం తమిళ సూపర్ స్టార్ ఆయన… ఓ తప్పుడు కేసు నమోదైనా తరువాత నిర్దోషిగా విడుదలయ్యారు… 1959లో మరణించేవరకు ఆయన పేరుకు వచ్చిన ఢోకా ఏమీ లేదు, కానీ ఈ సినిమాలో తనను నీచంగా చిత్రించారు’’
ఇదీ ఆ కుటుంబం ఆరోపణ… ‘‘మా కుటుంబం నుంచి అనుమతి తీసుకోలేదు… పేర్లు మార్చినా సరే, ఒక వ్యక్తి పరువు ప్రతిష్ఠల్ని తమ వాణిజ్య ప్రయోజనాల కోసం కించపరచడమే ఇది…’’
తమిళ మ్యాగజైన్లు, సైట్లు, సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం… ఇది ఎంకె త్యాగరాజ భాగవతార్ (ఎంకేటీ) అనే తొలితరం సూపర్ స్టార్ బయోపిక్…. ఎప్పుడూ నిర్మాత గానీ, హీరో గానీ ఖండించలేదు, అంటే పరోక్షంగా ఆమోదిస్తున్నట్టే కదా… మరి ఇప్పుడు కల్పిత కథ, పాత్ర అని ఎలా అంటాడు రానా…
కొంత క్రియేటివ్ ఫిక్షన్ కూడా కలిపిన ఎంకేటీ సినిమా కావచ్చు… సముద్రఖని పాత్ర ఎవరిదో క్లారిటీ లేదు.., (బహుశా ఎంకేటీకి బాగా క్లోజ్ దర్శక నిర్మాత, స్టూడియో ఓనర్ ఎస్ఎం శ్రీరాములు నాయుడు..?)
ఈ ఎంకేటీ మొదట్లో గాయకుడు, థియేటర్ ఆర్టిస్టు… తరువాత సినిమాల్లో సూపర్ హిట్ స్టార్… 1944 నాటి తన చిత్రం హరిదాస్ మద్రాసులోని బ్రాడ్‌వే థియేటర్‌లో వరుసగా మూడు సంవత్సరాలు ప్రదర్శింపబడింది… అయితే…
ఒక ఫిలిమ్ జర్నలిస్టు లక్ష్మికాంతన్ హత్య కేసులో త్యాగరాజతోపాటు ఎస్ఎస్‌కే అనే సహనటుడు, పైన చెప్పుకున్న దర్శక నిర్మాత శ్రీరాములు నాయుడు కూడా అరెస్టయ్యారు… మూడేళ్ల జైలు తరువాత త్యాగరాజతో అందరూ సరైన ఆధారాల్లేక విడులయ్యారు…

తరువాత ఆ హీరోను జనం పెద్దగా ఆదరించలేదు… జైలులో ఉండివచ్చిన తనను ఓ హీరోలాగా జనం రిసీవ్ చేసుకోలేదు… వైరాగ్యంతో సంపద మీద, సినిమాల మీద విరక్తి పెంచుకుని, ఇక ఆధ్యాత్మిక బాటపట్టాడు… మధుమేహం… ఓచోట కచేరీ ఇచ్చాక ఎవరో తనకు మధుమేహానికి మంచిది అని ఏదో ఆయుర్వేద పసరు మందు ఇచ్చారు… దాంతో పరిస్థితి విషమించి, చికిత్స తీసుకుంటూనే మరణించాడు…
ఒక సినిమా కథకు కావల్సినన్ని చీకటి వెలుగులు, ఎత్తుపల్లాలు, కష్టాలు- విజయాలు అన్నీ ఉన్నాయి… నేరం షేడ్ ఉంది… చివరకు వైరాగ్యం… దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దీన్ని ఎలా చిత్రించాడో చూడాల్సిందే… 1950 మద్రాస్ పరిస్థితుల నేపథ్యం..!
ఐతే సినిమా ఔట్ పుట్ ఏమిటో తెలియదు గానీ, పెద్దగా బజ్ లేదు… బుకింగ్స్ స్లో… తెలుగులో ఆ పాతతరం హీరో కథ పెద్దగా ఎక్కకపోవచ్చు, కాస్తోకూస్తో దుల్కర్ మాత్రమే సినిమాకు ప్రధాన ఆకర్షణ… తమిళంలో కూడా బజ్ లేదు పెద్దగా… ఇదీ సంగతి…
Share this Article