ముందుగా ఓ వార్త… యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఆర్టీవీ ప్రముఖ జర్నలిస్టు రవిప్రకాష్ మీద 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని లీగల్ నోటీసు పంపించింది… ఇదే ఆ వార్త స్థూల సారాంశం…
రవిప్రకాష్ గురించి ఎవరికీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పరిచయం అక్కర్లేదు కదా… ఈమధ్య తను స్వయంగా ఓ స్టోరీ ప్రజెంట్ చేశాడు… అందులో మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి (MEIL) సదరు బ్యాంకు ఎడాపెడా ఫేక్ గ్యారంటీలను ఇస్తోందనేది పాయింట్… కొన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ అనేది తన కథనంలోని ఆరోపణ…
వార్షిక టర్నోవర్ 8 కోట్లు కూడా లేని ఓ బ్యాంకు ఇన్ని వేల కోట్ల రూపాయలకు గ్యారంటీలు ఎలా ఇస్తోందని ప్రశ్నించాడు తను… అబ్బే, మా నెట్‌వర్త్ 1900 కోట్ల వరకూ ఉంటుంది అని ఆ లీగల్ నోటీసులో సదరు బ్యాంకు పేర్కొంది… అందుకే బ్యాంకు ఇచ్చే గ్యారంటీలు ఎంత జెన్యూన్ అనేదే రవిప్రకాష్ స్టోరీలో ప్రధానమైన ప్రశ్న, సందేహం, విమర్శ, ఆరోపణ…
Ads
సాధారణంగా ఇలాంటి స్టోరీల జోలికి మీడియా చానెళ్లు వెళ్లవు… లీగల్ కాంప్లికేషన్స్ పట్ల భయసందేహాలు ప్లస్ ఆధారాలు కష్టం కాబట్టి… రవిప్రకాష్ స్వతహాగా సాహసి… ఇలాంటి స్టోరీలు గతంలో చాలా చేశాడు, లీగల్ చిక్కుల్ని కూడా ఫేస్ చేస్తాడు, పైగా టీవీ9 చానెల్ విషయంలో మేఘా వాళ్లతో రవిప్రకాష్‌కు పాత పంచాయితీలు చాలానే ఉన్నాయి కదా…
కాకపోతే ఆర్టీవీ రీచ్ బాగా తక్కువ కాబట్టి అది చాలామందికి చేరలేదు… ఇప్పుడు ఈ కేసుతో ‘అసలు రవిప్రకాష్ స్టోరీ ఏమిటి’ అనే కుతూహలంతో మరింత మంది చూస్తారేమో… కేసుతో సాధించేది ఏముంటుందో చెప్పలేం గానీ ఆ స్టోరీని మరింత పాపులర్ చేయడమన్నమాట…
రేప్పొద్దున నిజంగానే కేసు వేసే పక్షంలో క్లెయిమ్ చేస్తున్న పరిహారంలో కొంత శాతాన్ని డిపాజిట్ చేయాలి కదా, దానికీ ఫేక్ గ్యారంటీలే ఇస్తారేమో అనే జోకులు కూడా వెలువడ్డాయి… సరే, ఇవన్నీ పక్కన పెడితే నిజంగానే ఫేక్ గ్యారంటీలు అయితే ప్రభుత్వం సీరియస్‌గానే లుక్కేయాల్సి ఉంటుంది…
తక్షణం రవిప్రకాష్ ఆ స్టోరీ పట్ల బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పి, సదరు వీడియోలను, పోస్టులను సోషల్ మీడియా వేదికల నుంచి తీసేయాలనీ లేకపోతే సివిల్, క్రిమినల్ కేసులు వేస్తామని ఆ లీగల్ నోటీస్ హెచ్చరించింది, చెన్నై లాయర్ ఎవరో ఆ నోటీస్ పంపించారు… MEIL స్పందిస్తుందని చాలామంది అనుకున్నారు కానీ బ్యాంక్ రంగంలోకి దిగింది…
అవునూ… మేఘా ఓనర్ల సంపద అపారంగా పెరిగిపోయి, కొన్ని వేల కోట్లకు చేరుకుంది కదా… చిన్నాచితకా సివిల్ సబ్ కంట్రాక్టుల నుంచి మొదలై ఇప్పుడు డిఫెన్స్, ఆటమిక్ ఎనర్జీ దాకా వెళ్లిపోయారు కదా… మరి ఆ యూరో ఎగ్జిమ్ బ్యాంకు నుంచి ఫేక్ గ్యారంటీలు ఎందుకబ్బా..?
అదసలు బ్యాంకే కాదనీ, జస్ట్, ఓ చిన్న ఆర్థిక సంస్థ అనీ కొందరు ఎక్స్ వేదికగా చెబుతున్నారు… మరి ఆ గ్యారంటీలకు ప్రభుత్వ సంస్థలు ఎందుకు వాల్యూ ఇస్తున్నాయి… ఐనా ప్రస్తుతం ఇండియా టాప్ రిచ్చెస్టుల జాబితాలో చేరిన మేఘా వాళ్లు అడిగితే మన బ్యాంకులే పోటీలుపడి గ్యారంటీలు ఇస్తాయి కదా…. ఇదీ డౌటనుమానం..! ఇందులో ఇంకేదైనా తిరకాసు ఉందా..? మళ్లీ రవిప్రకాషే మరో స్టోరీలో చెప్పాల్సి ఉంటుందేమో..!!
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి… మిగతా సర్వేలకన్నా భిన్నమైన తన సర్వే ఫలితాన్ని ప్రసారం చేసిన రవిప్రకాష్ మళ్లీ బలంగా తెరపైకి వచ్చాడు, ఆ సర్వే ఫలితాలు నిజమయ్యేసరికి తనకు కొంత పాపులారిటీ ఫాయిదా సమకూరింది… ఇప్పుడు ఎగ్జిమ్ బ్యాంకు స్టోరీ… ఇలాంటివి మరో నాలుగు స్టోరీలు పడితే మళ్లీ పాత రవిప్రకాష్ కనిపిస్తాడు..!!
Share this Article