Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…

September 3, 2025 by Rishi

.

( రమణ కొంటికర్ల ) ….. ఒక నిమ్మకాయతో గూఢచర్యం చేయొచ్చా..? మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ముల్లర్ అనే జర్మన్ గూఢచారి అదే చేశాడు. కానీ, చివరకు దొరికిపోయాడు. ఏంటా ఆసక్తికరమైన కథ..?

గూఢచర్యంలోనే ముల్లర్ అనుసరించిన పంథా శత్రువులనే అమితాశ్చర్యానికి గురిచేసింది. అందుకే, గూఢచారుల్లో ముల్లర్ ను ఓ కథానాయకుడిగా తల్చుకుంటుంటారు. మిలిటరీ ఇంటలిజెన్స్ సెక్షన్ 5 MI5 తన మొట్టమొదటి ప్రజా ప్రదర్శసను లండన్ క్యూలోని నేషనల్ ఆర్కైవ్స్ లో నిర్వహించింది. ఈ క్రమంలో నాటి మొదటి ప్రపంచ యుద్ధంలో గూఢచర్యం కోసం ఉపయోగించిన నాటి నల్లబడిపోయిన నిమ్మకాయనూ ఉంచడంతో ఈ అంశం ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

Ads

ఇంతకీ ముల్లర్ ఏం చేశాడు..?

1915లో అమాయకంగా ఉండే ఓ రష్యన్ షిప్పింగ్ బ్రోకర్ గా తనను తాను పరిచయం చేసుకుని.. నకిలీ పత్రాలతో ఓ వ్యక్తి బ్రిటన్ లోకి ప్రవేశించాడు. అతడే కార్ల్ ముల్లర్. ముల్లర్ జర్మనీ గూఢచారి. తనను తాను బెల్జియం నుంచి రష్యాకు వెళ్లిన శరణార్థిగా చెప్పుకుని బ్రిటన్ లోకి అడుగుపెట్టాడు.

కానీ, కార్ల్ ముల్లర్ బ్రిటన్ కార్యకలాపాలపై నిఘా పెట్టి.. జర్మనీకి బ్రిటన్ మిల్ట్రీ రహస్య వ్యవహారాలను చేరవేసేందుకు అక్కడ అడుగుపెట్టినవాడు.

మరి ఇంతకీ నిమ్మకాయ గూఢచర్యం కథేంటి..?

కొన్ని సాధారణ లేఖల్లాగానే కనిపించినప్పటికీ.. వాటి వెనుక మరికొన్ని రహస్య సందేశాలుండేవి. వాటిని ముల్లర్ నిమ్మకాయనుపయోగించి రాసేవాడు. తన వద్దనున్న పత్తిపెన్ను నిబ్ తో నిమ్మకాయపై పొడిచి.. ఆ నిమ్మకాయ ద్రావణంతో లెటర్ లో కొన్ని బ్రిటన్ కు సంబంధించిన రహస్యాలను రాసి జర్మనీకి పంపేవాడు. ఆ పేపర్ కు కాస్త వేడి తగిలిస్తే… పైన కనిపించే పెన్ను రాతలే కాకుండా.. వాటి వెనుక ముల్లర్ చేరవేసే రహస్య సందేశాలూ కనిపించేవి. అలా నిమ్మకాయనుపయోగించి ముల్లర్ రహస్యాలను జర్మనీకి పంపేవాడు.

శతాబ్దాం క్రితం 1915లో మొదటి ప్రపంచయుద్ధం తీవ్రతకు చేరుకున్న సమయమది. ఆస్ట్రియాకు చెందిన ఆర్చ్ డ్యూక్ హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసింది. 1914 జూన్ లో బీజం పడ్డ యుద్ధం.. ఆస్ట్రియా.. హంగరీ సెర్బియాకు అల్టిమేటం ఇవ్వడంతో ప్రారంభమైంది. ఐరోపాలోని దేశాలు రెండుగా చీలిపోయి జరిగిన అతి పెద్ద మొట్టమొదటి యుద్ధం. 90 లక్షల మంది సైనికులు, సుమారు 70 లక్షల మంది పౌరులు అసువులు బాసిన యుద్ధమిది. అందుకే ఈ మొదటి ప్రపంచ యుద్ధంగా చరిత్రకెక్కింది.

ట్రిపుల్ ఎంటెంట్ రష్యా, ఫ్రాన్స్ సామ్రాజ్యం, గ్రేట్ బ్రిటన్ ఒకవైపు.. ట్రిపుల్ అలయెన్స్ జర్మనీ ఆస్ట్రియా-హంగరీ, ఇటలీ మరోవైపు ఈ రెండు కూటముల మధ్య జరిగిన ఆ యుద్ధం చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాంటి యుద్ధంలో కార్ల్ ముల్లర్ బ్రిటన్ రహస్యాలను జర్మనీకి చేరవేయడానికి వచ్చిన ఓ గూఢచారి.

అదృశ్య సిరాగా నాటి నిఘా సంస్థలు, గూఢచారులకు ఉపయోగపడ్డ ఓ అద్భుతమైన సాంకేతికత నిమ్మకాయ కావడం విశేషం. కానీ, ఆ నిమ్మకాయ వల్లే ముల్లర్ ఉరిశిక్షకు గురయ్యాడు. వినడానికి వింతగానే అనిపించినా.. ఇది నాటి చారిత్రక వాస్తవం.

మరి బ్రిటీషర్స్ ముల్లర్‌ను ఎలా పట్టుకున్నారు…?

నాటి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో.. బ్రిటన్, గూఢచర్య కార్యకలాపాలను పర్యవేక్షించేది. అందులో భాగంగా నాడు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మెయిల్స్ ను నిశితంగా పరిశీలించేది. అందుకోసం పోస్టల్ సెన్సార్షిప్ కార్యాలయంపై ప్రధానంగా దృష్టి సారించింది. శత్రుదేశాల నుంచి వచ్చే లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండేది. ఓరోజు, రోటర్ డ్యామ్ నుంచి బ్రిటన్ కు వచ్చిన లేఖపై బ్రిటన్ అధికారులకు సందేహం వచ్చింది. దాంతో దర్యాప్తును ప్రారంభించారు.

ఆ క్రమంలో రోటర్ డ్యామ్ నుంచి వచ్చిన లేఖను వేడి చేశారు. అందులో బ్రిటన్ మిలిటరీ ఇంటలిజెన్స్ సెక్షన్ 5 ఏజెంట్స్ ఎప్సమ్ లో సైనిక కసరత్తులు నిర్వహిస్తున్నారని, దక్షిణ ఓడరేవుల నుంచి బయల్దేరేందుకు సిద్ధపడ్డారని కొన్ని కోడెడ్ సందేశాలు నిమ్మకాయ ద్రావణంతో రాసినట్టు కనుగొన్నారు. ఆ ఆధారాలతో MI5 ఏజెంట్స్… డెప్ట్ ఫోర్ట్ కు చెందిన జర్మన్ సంతతి బేకర్ జాన్ హాన్ వద్దకు వెళ్లారు. ఎందుకంటే, అతడు ముల్లర్ సహచరుడిగా వారు గుర్తించారు.

మిలిటరీ ఇంటలిజెన్స్ సెక్షన్ 5 ఏజెంట్స్ హాన్ ఇంటిని సొట్టు శోధించారు. వారి దాడుల్లో పెన్నులతో పాటు, బ్లాటింగ్ పేపర్స్, పంక్చర్ చేయబడి పడి ఉన్న నిమ్మకాయలు బయటపడ్డాయి. నిమ్మకాయను రహస్య సందేశాలు పంపేందుకుపయోగించే ద్రావణంగా వాడుతున్నారని అప్పుడు గుర్తించారు.

ఆ తర్వాత ముల్లర్ ఇంటికి వెళ్లారు MI5 ఏజెంట్స్. ముల్లర్ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. అక్కడా నిమ్మకాయలు బయటపడ్డాయి. వాటిని జాగ్రత్తగా ముక్కలు చేసి పత్తిలో చుట్టి వాటిని ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు.

మరి నిమ్మకాయల గురించి ముల్లర్ ఏం చెప్పాడు..?

తన దంతాలను శుభ్రపర్చుకునేందుకు ఉప్పుతో కలిపి నిమ్మకాయ రసాన్ని వాడతానని చెప్పాడు ముల్లర్. కానీ, అధికారులు మాత్రం ముల్లర్ మాటలు నమ్మలేదు.

నిమ్మరసాన్ని సిరాలా ఉపయోగించినట్టు తేల్చిన ఫోరెన్సిక్ నిపుణులు!

ఫోరెన్సిక్ నిపుణులు ముల్లర్ ఉపయోగించిన వాటిని అన్నింటినీ నిశితంగా పరీక్ష చేశారు. సూక్ష్మదర్శినితో ముల్లర్ వాడిన పెన్ నిబ్ ను గమనించినప్పుడు నిమ్మకాయ కణాల జాడలను కనుగొన్నారు. దాంతో అతను రహస్య సందేశాల కోసం ముల్లర్ అదృశ్య సిరాగా నిమ్మకాయను వాడినట్టు నిర్ధారించారు.

ముల్లర్, హాన్ విచారణ!

1915, జూన్ లో ముల్లర్, హాన్ ఇద్దరినీ ఓల్డ్ బెయిలీలో రహస్యంగా విచారణ చేపట్టారు. హాన్ కు ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ముల్లర్ కు గూఢచర్యం కింద దోషిగా తేలుస్తూ మరణిశిక్షను ఖరారు చేశారు. జూన్ 23న ముల్లర్ ను లండన్ టవర్ కు తీసుకెళ్లారు. ప్రశాంతంగా ఫైరింగ్ స్క్వాడ్ సభ్యులందరితో అక్కడ ముల్లర్ కరచాలనం చేశాడు. ఆ తర్వాత అతడి కళ్లకు గంతలు కట్టి ఉరి తీశారు.

ఆ తర్వాత ఏం జరిగింది..?

ముల్లర్ కథ అతడి మరణంతో ముగిసిపోలేదు.ఏ ముల్లర్ తోనైతే జర్మనీ తమ రహస్య సందేశాలు తెలుసుకోవాలనుకుందో అదే ముల్లర్ పేరిట.. ఆంట్వెర్ప్ లోని జర్మన్ నిఘా సంస్థను తప్పుదోవ పట్టించేలా MI5 రహస్య సందేశాలను పంపించడాన్ని కొనసాగించింది. దాంతో పప్పులో కాలేసిన బెర్లిన్ గూఢచార సంస్థ.. తమకింకా ముల్లర్ నుంచి రహస్య సందేశాలందుతున్నాయనే విభ్రమలోనే చాలాకాలం గడపాల్సి వచ్చింది. అలా బ్రిటన్ నుంచి ముల్లర్ పేరిట వచ్చే సందేశాలతో జర్మనీ పెద్దమొత్తంలో ఇంగ్లీష్ ఛానల్ ద్వారా డబ్బులను చేరవేసేది.

ఆ డబ్బుతో బ్రిటన్ సెక్యూరిటీ సర్వీసెస్ రెండు సీట్ల మోరిస్ కారును కొనుగోలు చేసింది. అంతేకాదు.. ఆ కారుకు బ్రిటీష్ అధికారులు ముల్లర్ అని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారు. అదే కారును మళ్లీ నిఘా కార్యక్రమాల కోసం ఉపయోగించారు.

అలా మొత్తానికి ఓ నిమ్మకాయ నాటి మొదటి ప్రపంచ యుద్ధంలో ఎన్నో విశేషాలకు కారణమైంది. జర్మనీకి.. గ్రేట్ బ్రిటన్ రహస్య సందేశాలను చేరవేయడానికి ఉపయోగపడింది. అదే గ్రేట్ బ్రిటన్ మళ్లీ నిమ్మకాయ అనే అస్త్రాన్ని తిప్పి కొట్టి జర్మనీని బ్లఫ్ చేసేందుకూ ఉపయోగపడింది. ఇప్పుడు చెప్పండి.. నిమ్మకాయ ఎంత పవర్ ఫుల్లో!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిమ్మకాయ గూఢచర్యం… ఓ ప్రపంచ యుద్ధం…
  • గుండె తడిని తాకే పాట..! మంగళంపల్లి నోట ఓ మాయల దెయ్యం..!
  • రాజేంద్రప్రసాద్ హౌజ్ హజ్జెండ్…! బోలెడు పాత్రలున్నా ఆ కారే హీరో..!
  • కాళ్లు బొబ్బలెక్కినా… ఆగకుండా 9 రోజులపాటు నర్తిస్తూనే…
  • కల్వకుండా చేసే కేసీయార్ కాదు… కల్వకుండా చేసే రేవంత్ రెడ్డి..!!
  • సన్నబియ్యం అంటేనే హెచ్ఎంటీ… దీని వెనుక ముద్దదిగని ఓ కథ…
  • ఓ డాక్టరమ్మ జీవన వీలునామా..! ఆఖరి క్షణాల్లో ప్రశాంతంగా పోనివ్వండి..!
  • తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
  • మోడీపై అగ్గిమండుతున్న ట్రంపు… దేనికి..? విస్తుపోయే వివరాలివి..!!
  • నిశ్శబ్ద సాహచర్యం… ఉన్నన్నాళ్లూ ఆ ఉనికి విలువ తెలియదు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions