నెట్‌ఫ్లిక్స్ వాడు రానానాయుడు తెలుగు ఆడియో మొత్తానికే పీకిపాడేశాడట… సోషల్ మీడియా దెబ్బకు, సొంత ఫిలిమ్ ఇండస్ట్రీ నుంచే థూత్కారాలు ఎదురయ్యేసరికి వెంకటేశ్‌కు, రానాకు బుద్దొచ్చి, నెట్‌ఫ్లిక్స్ వాడిని బతిమిలాడి, ఇక చాల్లేవోయ్, తీసిపారెయ్, మా ఇజ్జత్ పోతోంది అంటూ చెప్పి తీసేయించారంటారా..? ఇదీ ఇండస్ట్రీలో ఓ చర్చ…
నిజం… వెంకటేశ్ పరువుకు పంక్చర్ పడింది… తిట్టని నోరు లేదు… రానాను వదిలేయండి, బట్టలిప్పి నటించమన్నా సై అంటాడు… కానీ వెంకటేశ్‌కు ఏం పుట్టింది అనే తీవ్ర విమర్శ ప్రేక్షకుల నుంచి వచ్చింది… ఐతేనేం..? నెట్‌ఫ్లిక్స్ వాడు పట్టించుకోలేదు, పట్టించుకుంటే వాడు ఓటీటీని ఎలా రన్ చేస్తాడు..? ఓటీటీ అంటేనే అవధుల్లేని బూతు, అడల్ట్ కంటెంటు కదా…
రానానాయుడులోనూ అంతే… మరీ బజారు రంకు బాపతు కంటెంట్… వెంకటేశ్ స్క్రిప్టు ముందుగా చూసుకోవద్దా అంటూ కొందరు తమలపాకుతో తగిలిస్తున్నారు సుతిమెత్తగా… అబద్ధం, వెంకటేశ్‌కు మొత్తం తెలుసు… తెలియకుండా ఆ సీన్లలో నటించడానికి పిచ్చోడా..? పిల్లాడా..? అలాగని ప్రేక్షకులు కూడా తక్కువ కాదు… ఇంతటి బూతు ఏమిట్రా అని తిడుతూనే తెగచూసేశారు… ట్రెండింగ్‌లో నడిచింది కొన్నాళ్లు… మరి అంత బాగా ట్రెండింగులో ఉన్న కంటెంటును ఎందుకు తీసిపడేశారు..?
Ads
- ఇకపై వెంకటేశ్ తీయబోయే సినిమాల మీద దీని ప్రభావం ఉంటుంది… వెంకటేశ్ పాన్ ఇండియా స్టారేమీ కాదు, వేరే భాషల్లో తననెవడూ చూడడు… తెలుగు మార్కెట్టే తనకు ముఖ్యం… అందుకని నెట్‌ఫ్లిక్స్ కోరుకున్న సంఖ్యలో వ్యూస్ దాటగానే… బాబ్బాబు, కాస్త తెలుగు ఆడియో తీసేసి, మిగతా భాషల్లో అలాగే ఉంచేసుకొండి, ఆ బూతు సీన్లను ఎవరెలా చూసుకున్నా మాకు పర్లేదు అని వెంకటేశ్ టీం నుంచి బతిమిలాట మొదలై ఉంటుంది… తెలుగు గాకుండా వేరే భాషల్లో వెంకటేశ్ బట్టలిప్పి నర్తించినా సరే, వెంకటేశ్‌కు నష్టమేమీ లేదుగా…
- బాహుబలితో దేశవ్యాప్తంగా మంచి ఇమేజీ సాధించిన రానా ఇటు తెలుగులో మళ్లీ ఒక్క సినిమాలోనూ క్లిక్ కాలేదు, సరికదా ఈ బూతు కంటెంటుతో తన పరువు మొత్తం తీసుకున్నాడు… అక్కడికి సిగ్గూశరాలు విడిచి ఫ్యామిలీలతో చూడకండి అని ఏదో గొప్ప నీతిజాగ్రత్త చెప్పాడు… అది మరింత నవ్వులపాలైంది… రాబోయే తన సినిమాలపైనా ఈ వెగటు కంటెంటు ప్రభావం పడుతుంది… ఈ సోయి చాలా లేటుగా వచ్చినట్టుంది…
- అదేదో సీరీస్‌లో మాధురి దీక్షిత్‌ను అభ్యంతరకరంగా ప్రొజెక్ట్ చేశారని ఎవరో నెట్‌ఫ్లిక్స్ మీద కేసు వేశాడట… రానానాయుడి మీద కూడా ఎవరైనా కేసు వేస్తారేమోనని ఇలా ఆడియో పీకిపారేశారని కొందరి ఊహాగానం… కానీ అబద్ధం… అలా భయపడితే ఒక్క తెలుగు ఆడియో ఎందుకు తీసేస్తారు..? మొత్తం ఆ నీచమైన కంటెంటును అన్ని భాషల్లోనూ తీసేసేవాళ్లు కదా…
కానీ రానానాయుడు ఒక పాఠం… తెలుగు నుంచే కాదు, ఏ భాష నుంచైనా సరే ఓటీటీ కంటెంటు కోసం వెగటుగా నటించడానికి సిద్ధపడితే, థియేటర్ మార్కెట్‌కు పంక్చర్ పడుతుందనే భయాన్ని ఈ మొత్తం ఎపిసోడ్ కలిగించింది… అంతేకాదు, ఎవడు ఏమాత్రం లక్ష్మణరేఖ దాటినా సరే సోషల్ మీడియా, ఇండస్ట్రీ అన్నిరకాల మర్యాదల్ని విడిచి మరీ పచ్చి బూతులకు తెగబడుతుంది… ఏం చూపిస్తే అది చూపిస్తారనే కొందరి పిచ్చి భ్రమలు బద్దలైపోతాయి…!! అమ్మో, లేకపోతే పూర్తిగా బరితెగించి, బట్టలు విడిచి, బరిబాతల శృంగార దృశ్యాలను చూపించగలరు వీళ్లు…!!
Share this Article