‘‘నేను రాజకీయాల్లో రాను’’… కేసీయార్ మనమడు, కేటీయార్ కొడుకు హిమాంశు ట్విట్టర్లో కనిపించిన ఈ వాక్యం ఒకింత విచిత్రంగానే ధ్వనించింది… వచ్చే 12వ తేదీకి పదహారో ఏడులోకి అడుగుపెడుతున్నాడు… ఇంకా బాల్యం, స్కూలింగ్ తాలూకు జ్ఞాపకాల్ని, అనుభవాల్ని పదిలంగా పేర్చుకునే వయస్సు… ఇధి మళ్లీ రాదు… కానీ ఏం జరుగుతోంది..? అప్పుడే వందిమాగధులు, ప్రమథగణాలు, స్తోత్రపాఠాలు, భజనలు… ఈ వయస్సులో ఈ విద్యేతర కాలుష్యాన్ని తన మెదడులో నింపడం అవసరమా..? ఒక్కసారి అధికారం తాలూకు కిక్కు అలవాటయితే, కీర్తికాంతలు చెంతచేరితే అవి ఇక వదలవు… నా బర్త్‌డేకు బొకేలు, కానుకలు తీసుకురావద్దు, మొక్కలు నాటండి అని పిలుపునిస్తున్నాడు భావి ముఖ్యమంత్రి… అదేమిటి, అంత మాటనేశావేం అనకండి… తన చుట్టూ చేరే భజనగణం కీర్తించేది అదే… ఒక పిల్లాడిని ఇవన్నీ ఎంత చెడగొడతాయో వేల పుస్తకాలు చదివిన కేసీయార్‌కు తెలియక కాదు… తనకు ముద్దుల మనమడే కావచ్చుగాక… ఏకైక మగవారసుడే కావచ్చుగాక… తను నిర్మించిన ఓ వైభవోపేత, ఆర్థిక, రాజకీయ కోటలకు భవిష్యత్తులో తనే వారసుడు కావచ్చుగాక… కానీ అన్నప్రాసన కూడా జరగకముందే ఇలా ఆవకాయలు అనుమతిస్తున్నారా..?
చేయనీ… కొన్ని వేల వ్యర్థాలను సేకరించి రెండేళ్ల క్రితం ఏదో అవార్డు తీసుకున్నాడు… కొన్ని ఊళ్లు తిరిగాడు, అడవుల్లో తిరిగాడు… సచివాలయం వెళ్లి చక్కర్లు కొట్టాడు… రాముడి పెళ్లికి తలంబ్రాలు మోసుకెళ్లాడు… ఓ యూట్యూబ్ చానెల్, ట్విట్టర్లో వేల మంది ఫాలోయర్లు, ఓ మహిళా మంత్రిని ఇంటర్వ్యూ చేశాడు… తమ ఫామ్‌హౌజ్ ఉన్న ఎర్రవల్లికి రెండు శివారుపల్లెలు ఉంటే (యూసుఫ్ఖాన్పల్లె, గంగారం..?) వాటిని అర్జెంటుగా ఉద్దరించేసి డయానా అవార్డు కొట్టాడు… రేపురేపు డబ్బు పారేస్తే బోలెడన్ని స్కోచ్ అవార్డులు కూడా కొట్టొచ్చు… కానీ ఈ పసివయసులో మరీ అంతగా పరిమళించాల్సిన పనేం ఉంది..? వాస్తవంగా తనను వేరే దేశాల్లో ఉంచి చదివిస్తే… తనకు స్పష్టమైన లక్ష్యాలు ఏర్పడతాయి, ఈ వందిమాగధులు గాకుండా మంచి స్నేహబృందం ఏర్పడుతుంది… ఇంకా చదివేకొద్దీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా సంభవిస్తున్న సాంకేతిక, రాజకీయ, సామాజిక పరిణామాలనూ అర్థం చేసుకోవచ్చు… అధ్యయనం చేయొచ్చు… వీటికితోడు పొలిటికల్ మేనేజ్మెంట్ కోర్సులూ ఉంటాయి… ఉద్వేగ నియంత్రణ, మానసిక వికాసం కూడా..!
Ads
ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రిపేర్ కావాలి, జనంతో ఎలా కనెక్ట్ కావాలి, భాష ఎలా ఉండాలి వంటి అనేక విషయాల్ని బోధిస్తారు… అబ్బే, ప్రగతిభవన్ గురుకులంలో గుగ్గురువు కేసీయార్ బోధిస్తే సరిపోదా అంటారా..? సరిపోదు… ప్రపంచం వేగంగా మారుతోంది… ఈరోజు కేసీయార్ ఆలోచనలు, అడుగులు క్లిక్కయ్యాయంటే అధికశాతం తన అదృష్టమే కారణం… 2009 వరకూ తన రాజకీయ జీవితం అస్థిరమే… ఒక దశలో పార్టీని మూసేయాలన్నంత ఫ్రస్ట్రేషన్‌ను అనుభవించాడు… అలాంటిది రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా సంక్లిష్టంగా, చంచలంగా, అస్థిరంగా ఉండబోతున్నయ్… అసలు కేటీయార్ సీఎం కుర్చీ బాటే ఇంకా క్లియర్‌గా లేదు… పైగా ఈ పిల్లాడు మానసికంగా పరిపక్వం అయ్యేనాటికి కనీసం రెండు పుష్కరాలు గడిచిపోవాలి… అప్పటివరకు చాలాచాలా మార్పులు తథ్యం… అందుకని ముందుగా చదవనివ్వండి… ఈ రాజకీయ వాతావరణం, ప్రమథగణాల కీర్తనల కాలుష్యాల నుంచి తనను దూరం ఉంచడమే కరెక్టు… అది హిమాంశు భావిజీవనానికే మంచిది… ఐనా ఇంత రాయడం అవసరమా అంటే… అవసరమే… అప్పుడే భావి ముఖ్యమంత్రి అనే ముద్రలు వేసేస్తున్నారు కాబట్టి, తండ్రి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి, తాత ఆల్రెడీ ముఖ్యమంత్రి కాబట్టి… అప్పుడే రాజకీయాలు మాట్లాడేస్తున్నాడు కాబట్టి…!! అప్పుడెప్పుడో నా కొడుకు నాకన్నా ఎత్తు పెరిగాడు అని కేటీయార్ సంబరపడిపోయాడు… దైహికంగా చాలు, ఇక ఇతరత్రా కాస్త ఓ ‘పద్ధతిలో’ ఎదగనివ్వండి సార్..!! బోలెడు పొలముంది, బారెడు పొద్దుంది…!
Share this Article