Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తపాలా శాఖ జాతీయ స్థాయి లేఖారచన పోటీలు… ప్రైజ్ మనదే…

March 8, 2025 by M S R

.

“ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా…
ఇప్పుడు రాత్రి
అర్ధ రాత్రి
నాకేం తోచదు
నాలో ఒక భయం…”
అంటూ దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన సైనికుడి ఉత్తరం కవిత గుండెలను పిండేస్తుంది.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తిలక్ రాసిన కవిత ఇది. 1921-1966 మధ్య నాలుగు పదుల వయస్సు మాత్రమే బతికి తన అక్షరాలను వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో ఆడుకునే అమ్మాయిల్లా తీర్చి దిద్దినవాడు తిలక్. కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం- అని శ్రీ శ్రీ అంతటి వాడు పొంగి పరవశించిన కవిత తిలక్ ది. తెలుగు లేఖా సాహిత్యంలోనే ఆణిముత్యంలాంటి కవిత ఇది. ఒకప్పుడు తిలక్ రాసిన నీవులేవు నీపాట ఉంది…. ఈ సైనికుడి ఉత్తరం కవితలు చదవనివారు అసలు ఉండేవారే కాదు.

Ads

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశం కోసమో, ఏ దేశంతోనో, ఎక్కడో యుద్ధం చేసే మన సైనికుడి మానసిక సంఘర్షణను తిలక్ ఈ కవితలో ఒక డాక్యుమెంటరీ కంటే అద్భుతంగా రికార్డు చేశాడు. ఆ మధ్య క్రిష్ చక్కగా తెరకెక్కించిన కంచె సినిమా కథకు మాతృక ఈ కవితే.

తెలుగు వచన కవితలో శిఖరాయమానమైన కవిత ఇది. ఇదే ఇంగ్లీషులో ఉండి ఉంటే ప్రపంచ అత్యుత్తమ కవితల్లో ఒకటి అయి ఉండేది. అలా కాలేదని బాధపడాల్సిన పని లేదు. ఒక తెలుగు కవి భాషాతీతంగా ప్రపంచ సైనికులందరికీ భార్యకు రాసుకోవాల్సిన ఉత్తరం రాసి పెట్టిన కవిత ఇది.

“తపాలా బంట్రోతు” పేరిట తిలక్ 1959లో రాసిన మరో కవిత కూడా ఒక ఆణిముత్యం.

“అదృష్టాధ్వంమీద నీ గమనం శుభాశుభాలకి నువ్వు వర్తమానం
నీ మేజిక్ సంచిలో
నిట్టూర్పులు నవ్వులు పువ్వులు ఆనందాలు అభినందలు ఏడుపులు
ఏ క్షణంలో ఏది పైకి తీస్తావో ఆ క్షణాన నువ్వు రాజుతో సమానం!

కొందరికి పరిచయమైన నవ్వు
కొందరికి తలపంకించిన నవ్వు
కొన్ని వైపులకి చూడనే చూడవు
అందరికీ నువు ఆప్తబంధువుని
అందరికీ నువు వార్త నందిస్తావు
కాని నీ కథనం మాత్రం నీటిలోనే మధనం అవుతూంటుంది…

ఇన్ని యిళ్లు తిరిగినా నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
ఇన్ని కళ్లు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్లిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు…”

లేఖా పంచకం
————-
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఢిల్లీలో పని చేస్తుండిన దాసరి అమరేంద్ర పాతికేళ్ళ క్రితం రాసిన కథ ఇది.

కథనంలో , వస్తువులో , శిల్పంలో , భాషలో , పాత్రల సంఘర్షణలో ఇలా ఎన్నో రకాలుగా ఈ కథ వైవిధ్యమయినది .

35 ఏళ్ళ కాలవ్యవధిలో భార్యకు భర్త రాసిన అయిదు లేఖలే ఈ కథ .

కొత్తగా పెళ్లయ్యింది . ఒక వైపు భర్తకు ఉద్యోగం లేదు . ఎన్నో ప్రయత్నాలు , ప్రయాసలతో ఎక్కడో కలకత్తాలో ఏదో చిన్న ఉద్యోగం దొరుకుతుంది.

ఉత్తరం- 1

నాకు ఉద్యోగం దొరకదనుకున్నా . ఎలాగో దొరికింది . కాస్త కుదుటపడగానే ఇక్కడ సంసారం పెడదాం .

ఉత్తరం- 2

చూడబోతే ఈ ఉద్యోగం , ఈ జీతంతో ఊరుకాని ఊరిలో బతకడం కష్టం . మనీ ఆర్డర్ పంపుతుంటాను . ప్రస్తుతానికి నువ్వక్కడే , నేనిక్కడే.

ఉత్తరం- 3

పిల్లలు జాగ్రత్త . బాగా చదివించు . ఇంతకు మించి డబ్బు పంపడం కుదరదు.

ఉత్తరం- 4

నీ ఆరోగ్యం జాగ్రత్త . ఈ మధ్య నా ఆరోగ్యం కూడా ఏమంత బాగోలేదు . పిల్లల కాలేజీ చదువులకు పీఎఫ్ లాంటివే ఆదుకోవాలి.

ఉత్తరం- 5

చూస్తుండగానే రిటైర్మెంట్ రోజు దగ్గరికి వచ్చేసింది . నిన్ను సుఖ పెట్టానో , దుఃఖ పెట్టానో తెలియడం లేదు . ఎలా ఇక్కడి నుండి రావాలో తెలియడం లేదు .

కథ ఇంతే . కాకపోతే లేఖలు ఇంకొంచెం వివరంగా ఉంటాయి .

మధురాంతకం చెక్కిన పోస్ట్ మ్యాన్ శిల్పం
——
తెలుగు కథాకీర్తికి మధురాంతకం ఒక గోపురం. సామాన్యుల జీవితాల్లో అసామాన్య కోణాలను పాజిటివ్ దృక్పథంలో చూపడంలో ఆయనకు ఆయనే సాటి. పది పల్లెలకు సైకిల్ మీద, నడుస్తూ పోస్ట్ అందించే ఒక పోస్ట్ మ్యాన్ దినచర్యను వర్ణిస్తూ మధురాంతకం ఒక కథ రాశారు.

సూర్యోదయానికంటే ముందే దగ్గర్లో రైల్వేస్టేషన్ కు వెళ్ళి పోస్ట్ బ్యాగ్ తెచ్చుకోవడంతో మెదలుపెట్టి ఊరూరు, ఇల్లిల్లు తిరిగి పోస్ట్ బట్వాడా చేయడం, రోజుకు సగటున ముప్పయ్ కిలోమీటర్లకు పైగా తిరగడం ఇందులో కథనం.

ఆయన రిటైరయ్యేనాటికి మొత్తం తిరిగిన కిలోమీటర్లు అక్షరాలా మూడు లక్షలా ఎనభై వేల కిలోమీటర్లు. అలాంటివాడు పదవీ విరమణ తరువాత ఎక్కడో కొడుకు ఇంట్లో కాలు కదపకుండా కట్టేసినట్లు ఉండి మథనపడే సన్నివేశంలోకి మనల్ను తీసుకెళతారు.

లేఖా సాహిత్యానికి తెలుగులో కొదవ లేదు. పోస్ట్ మ్యాన్ ను కథానాయకుడిగా తీర్చి దిద్దిన కవితలకు, కథలకు కూడా కొదవ లేదు.

ఇదివరకు యుక్తవయసు రాగానే ప్రతివారు కృష్ణశాస్త్రులై భావం పొంగిపొర్లేలా ప్రేమ లేఖలు రాసుకునేవారు. లేఖలు రాయడం చేతగానివారు రాయడం వచ్చినవారితో రాయించుకున్న కాలాలు కూడా ఉండేవి. లేక లేక రాసిన ఆ లేఖల్లో భాష ఎలా ఉన్నా భావం అర్థమై ప్రేమలు పండిన కాలాలు ఉండేవి.

ఇప్పుడు లేఖ లేదు. ప్రేమ ఉన్నా… ప్రేమకవిత్వ భాష లేదు. భావం లేదు. ప్రకృతి పరవశించిన ప్రేమోత్సవ ప్రతీకలు నిండు పున్నమి చందమామలు, ఎర్రముక్కు చిలుకలు, ఎగిరే పావురాలు, విరిసే వసంతాలు, పిండి వెండి వెన్నెలలు, ఇసుక తిన్నెలు లేవు.

ప్రేమ లేఖల సంగతిని గాలికొదిలేద్దాం. మామూలు లేఖలైనా ఉన్నాయా? కార్డు ముక్క, ఇన్లాండ్ లెటర్ లో చీమ తలకాయంత చోటు ఖాళీ వదలకుండా రాసుకున్న యోగక్షేమాలన్నీ ఏమయ్యాయి? ఎటు పోయాయి? ఉత్తరానికి ప్రత్యుత్తరం రాకపోతే దిగులుపడ్డ ఘడియలన్నీ ఎక్కడికెళ్ళాయి?

ఇప్పుడంతా శంకరాభరణంలో జంధ్యాల చెప్పినట్లు రాకెట్ యుగం. వాట్సాప్ లు. మెయిళ్ళు. వీడియో కాళ్ళు. రాసుకున్న అక్షరాల మధ్య పలికిన మౌనరాగాలకు ఇప్పుడు నిలువనీడ లేదు. తీయతేనియ తెలుగును ఇంగ్లిష్ లిపిలో-
Emi chestunnav?
(ఏమి చేసున్నావ్?)
Gollu gillukuntunnanu
(గోళ్ళు గిల్లుకుంటున్నాను)
Nenu ninnane shukravaram sayantram gillukunnanu
(నేను నిన్ననే శుక్రవారం సాయంత్రం గోళ్ళు గిల్లుకున్నాను)
అని టైప్ చేస్తున్నప్పుడు వచ్చే మజాయే వేరు!

letter

ఇలాంటివేళ రాసే ఉత్తరాలకు మళ్ళీ పూర్వవైభవం తేవాలని భారత తపాలాశాఖ లేఖారచన పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏటి పోటీలో తెలంగాణకు చెందిన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడేనికి చెందిన ఉస్తేల సోమిరెడ్డికి ప్రథమ బహుమతి దక్కింది. ఆయన ప్రస్తుతం నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డెప్యూటీ కమిషనర్ గా పని చేస్తున్నారు.

“పూజ్యసమానులైన గురువు గారికి,
ఉభయ కుశలోపరి…నేను క్షేమం. మీరు క్షేమమని తలుస్తాను…” అని పాత పద్ధతిలో కాకపోయినా…అధునాతన షిట్…డ్యామ్…ఓ మై గాడ్…బ్రో…క్రేజీ భాషలో కాకుండా భూమ్మీద రెండు కాళ్ళు ఆనించి నడిచే నరమానవులు మాట్లాడుకునే మామూలు తెలుగులో వాట్సాప్ లోనే అయినా మనసు పెట్టి ఉత్తరం రాసి చూడండి. మీలో కృష్ణశాస్త్రి, తిలక్, మధురాంతకం తొంగిచూడకపోతే…వెంటనే దగ్గర్లో ఉన్న తపాలా కార్యాలయాన్ని సంప్రతించండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions