సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ కొన్ని సినిమాలు వస్తాయి. వాటిలో సస్పెన్స్ ఉండదూ, థ్రిల్లూ ఉండదూ. మొదటి పది నిముషాల్లోనే క్లైమాక్స్ ఏమిటో, ఈ నాటి ప్రేక్షకులు చెప్పేయగలుగుతున్నారు.
కానీ, ఒక సినిమా వచ్చింది బాసూ!
లెవల్ క్రాస్ అనీ… మూడే ప్రధాన పాత్రలతో సినిమా ఆసాంతం ప్రేక్షకులు టెన్షన్ తో చచ్చిపోయేంత గొప్ప థ్రిల్లర్ సినిమా. అనుక్షణం ఉత్కంఠతో తరువాత ఏం జరుగుతుందోనని ఊపిరి బిగపట్టి చూడాల్సిన సినిమా. అందమైన, సుకుమారమైన సౌందర్య పుష్పం వంటి అమలాపాల్ ను, మొరటోడైన ఆసిఫ్ అలీ ఏం చేస్తాడోనని క్షణక్షణం మనమే బాధపడుతుంటాము.
Ads
సినిమాలోని ఒక పాత్ర పట్ల మనం ఇలా సానుభూతి చూపించడం చాలా అరుదుగా జరుగుతుంది, నాకైతే… లేకపోతే, చాలా సినిమాల్లో హీరోయిన్లను, వారు వేసుకునే డ్రెస్సులను, వారి కృత్రిమ సంభాషణలు వింటుంటే వెగటు పుడ్తుంది.
సరే, ఈ సినిమా విషయానికి వస్తే, సాధారణంగా, ఒక సినిమాలో ఒక సస్పెన్స్ ఉంటుంది. ఈ సినిమా చాలా సేపటి వరకు స్లోగా నడుస్తుంది. కానీ, అంతర్లీనంగా ఏదో జరగబోతుందనే, సందేశం మనకు అందుతూనే ఉంటుంది. చివరి అరగంటలో ఎన్ని మలుపులు? మనం ఊహించనే లేము.
అనుకున్న ఉపద్రవం రానే వస్తుంది. కానీ, అది ఉపద్రవం కాదు. ఉపద్రవం ఆల్రెడీ కథలోకి ఎప్పుడో వచ్చేసింది. ఎన్ని సస్పెన్సులో? మనం ఊహించనే లేము. డైలాగులను జాగ్రత్తగా వినాలి.
క్లైమాక్స్ చెప్పాలని మనసు పీకుతుంది కానీ, సినిమాకు, మీకు అన్యాయం చేయకూడదు కదా? Nail Biting Experience అంటారు కదా! అది మీరూ అనుభవించండి.
ఇక డిబ్యూ డైరెక్టర్ అర్ఫాజ్ అయూబ్, ఒక హిచ్ కాక్ సినిమాలా, ఈ సినిమాను చెక్కాడు. హ్యాట్సాఫ్ టు హిమ్! అడియోస్ అమిగోస్’ సినిమాతోనే ఆసిఫ్ అలీకి అభిమానినయ్యా… మనోరత్నంగల్ లో కూడా మంచి పాత్ర చేసాడు. ఈ సినిమాతో, అద్భుతమైన నటుడిగా పరిణితి చెందాడనిపిస్తుంది.
కాస్ట్యూమ్స్ కు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. సినిమా మొత్తంలో అమలాపాల్, ఒక గౌన్, ఒక పాత, ముతక చొక్కా, ముతక లుంగీలో మాత్రమే కనిపిస్తుంటుంది. అయినా సరే, ఆమె సౌందర్యం, ఆ పాత గుడ్డల్లో నుండి కూడా ప్రకాశిస్తుంటుంది. అసిఫ్ అలీ సినిమా మొత్తం ఒకటి రెండు ముతక చొక్కాల్లో కనిపిస్తాడు.
మనం గొప్పగా చెప్పుకునే ప్యాన్ ఇండియా సినిమాలో, ఒక్క రోజుకయ్యే ప్రొడక్షన్ ఖర్చుతో, (హీరోహీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్లు కాకుండా) ఈ సినిమా మాగ్జిమమ్ వారం రోజుల్లో తీసి ఉంటారు.
సాధారణంగా, స్క్రీన్ ప్లేను ‘cinema on paper’ అని అంటారు. అంత పకడ్బందీగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లేను రాసుకున్నారు. ఏ Netflix లోనో రావలసిన సినిమా. ప్రైమ్, ఆహాలో ఉంది. వీలైతే చూడండి…. (ప్రభాకర్ జైనీ)
ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా అమలా పాల్ ధరించిన డ్రెస్సులపై కొన్నాళ్లు సోషల్ మీడియాలో దుమారం రేగింది… ఆమె సమర్థించుకుంది…
Share this Article