తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP) వృద్దిలో దేశంలోనే తెలంగాణ నంబర్-1: ఇది మరో బూటకపు ప్రచారం…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ కొన్నాళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించిందనీ, ప్రగతి సూచికలలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో మనమే ముందంజలో ఉన్నామనే ప్రచారంలో నిజమెంత?
ప్రధానంగా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP-Gross State Domestic Product), రాష్ట్రాల తలసరి ఆదాయం (Per Capita Income), తలసరి విద్యుత్ వినియోగం ( Per Capita Electricity Consumption), విద్యుత్ స్థాపిత సామర్ధ్యం, తెలంగాణలో పారిశ్రామికీకరణ, హైదారాబాద్ అభివృద్ది లాంటి కీలక సూచికలలో మన రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని భారీ ప్రచారం చూస్తున్నాం.
Ads
ఇప్పటికే తలసరి విద్యుత్ వినియోగం ( Per Capita Electricity Consumption), విద్యుత్ స్థాపిత సామర్ధ్యం, తెలంగాణలో పారిశ్రామికీకరణ, హైదారాబాద్ అభివృద్ది లాంటి అంశాలలో ప్రభుత్వ వాదనలు ఎంత బూటకమో అధికారిక లెక్కలతో నిరూపించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర GDP పై ప్రభుత్వ ప్రచారం ఎంత బూటకమో ప్రభుత్వాల అధికారిక గణాంకాల ఆధారంగానే చూద్దాం.
అసలు జిఎస్‌డిపి అంటే ఏమిటి? జిఎస్‌డిపి అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP-Gross State Domestic Product). అంటే, ఒక రాష్ట్రంలో ఒక ఆర్ధిక సంవత్సరంలో ఉత్పత్తైన మొత్తం వస్తువుల (గూడ్స్), సేవల (సర్వీసెస్) మొత్తం విలువ.
జిఎస్‌డిపి వివరాలు ఎక్కడ లభ్యమౌతాయి? తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి, తలసరి ఆదాయ లెక్కలు ప్రతీ ఏటా రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే “తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ రిపోర్టు” లలో ఉంటాయి. తాజాగా 2022 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన రిపోర్టులో 2020-21 నాటికి తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి, తలసరి ఆదాయ వివరాలు, అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల జిఎస్‌డిపి, తలసరి ఆదాయ వివరాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి ఎలా ఉందో చూద్దాం.
తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి, అంటే 2013-14 ఆర్ధిక సంవత్సరంలో ఉన్న జిఎస్‌డిపిని, ప్రస్తుత- అంటే 2020-21 సంవత్సర జిఎస్‌డిపితో పోల్చి చూద్దాం.
2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కాబట్టి ఆ సంవత్సరానికి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం వరకు జిఎస్‌డిపిని ప్రాతిపదికగా తీసుకుందాం. అలాగే 2021-22, 22-23 కు సంబంధించి కేవలం ప్రాధమిక అంచనాలు మాత్రమే ఉన్నాయి. వీటి వివరాలు ఇంకా అనేక రాష్ట్రాలు పొందుపరచలేదు. కాబట్టి 2020-21 ని ప్రస్తుత సంవత్సరంగా తీసుకుందాం.
ప్రస్తుత ధరల ఆధారంగా తెలంగాణ జిఎస్‌డిపి- ఎక్కడి గొంగళి అక్కడే…
2013-14 లో తెలంగాణ జిఎస్‌డిపి: 2013-14 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంత జిఎస్‌డిపి 4,51,580 కోట్ల రూపాయలు. 2013-14లో దేశంలోని ఇతర రాష్ట్రాలలో పోలిస్తే దేశంలో తెలంగాణ స్థానం పది (10).
అప్పట్లో మన కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు (ర్యాంకుల వరుసలో): 1. మహారాష్ట్ర, 2. తమిళనాడు, 3. ఉత్తరప్రదేశ్, 4. కర్ణాటక, 5. గుజరాత్, 6. వెస్ట్ బెంగాల్, 7. రాజస్థాన్, 8. కేరళ, 9. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతం.
2020-21 లో తెలంగాణ జిఎస్‌డిపి: ఇక 2020-21 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి రూ 9,61,800 కోట్ల రూపాయలు. దేశంలో మన స్థానం ఇప్పటికీ పదే(10).
ప్రస్తుతం మన కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు (ర్యాంకుల వరుసలో): 1. మహారాష్ట్ర, 2. తమిళనాడు, 3. కర్ణాటక, 4. ఉత్తర ప్రదేశ్, 5. గుజరాత్, 6. వెస్ట్ బెంగాల్, 7. ఆంధ్ర ప్రదేశ్, 8. రాజస్తాన్, 9. మధ్య ప్రదేశ్.
అంటే ప్రస్తుత ధరల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర జిఎస్‌డిపి స్థానం ఎక్కడి గొంగళి అక్కడిలా ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో అదనంగా వనరులు అందుబాటులోకి వచ్చినా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్న అప్పులకు తొమ్మిది రెట్లు అప్పులు చేసినా మన జిఎస్‌డిపి పరిస్తితిలో ఏమాత్రం మారలేదని స్పష్టమౌతుంది. అభివృద్దిలో తెలంగాణ నంబర్-1 అనే ప్రచారం ఎంత బూటకమో తేటతెల్లమౌతున్నది…. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజేఏసి)
Share this Article