.
ఐరనీ అంటారా..? పారడాక్స్ అంటారా..? డెస్టినీ అంటారా..? ఏ పేరైనా పెట్టుకొండి… ఒక వార్త…
ఖరీదైన బంగారం తవ్వితీసే కార్మికులు ఆకలిచావులకు గురికావడాన్ని మించిన పారడాక్స్ ఏముంటుంది ప్రపంచంలో…! ఇంతకు మించిన విధివింత ఏముంటుంది..? అసలు ఖర్మ అనే పదానికి ఇంతకు మించిన ఉదాహరణో, నిర్వచనమో ఏముంటుంది..? వార్త చదవండి…
Ads
జనవరి 15 …. మూసివేసిన గనిలోకి అక్రమంగా ప్రవేశించిన కార్మికులు… దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనర్లు… ఆహారం, నీరు లేక ఆకలితో అలమటిస్తూ మృత్యువాత పడుతున్నారు… ఇప్పటి వరకు దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది…
సౌతాఫ్రికా వాయవ్య ప్రావిన్స్‌లో మూసివేసిన గనిలో ఈ ఘటన జరిగింది… సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో మృతి చెందిన కార్మికుల కళేబరాలు కనిపిస్తు న్నాయి… ఈ వీడియోలను జనరల్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా జీఐడబ్ల్యూ యూఎస్ఏ విడుదల చేసింది…
ఇది విపత్కర పరిస్థితి అని ఈ సంస్థ అధ్యక్షుడు మామెట్ల్వే సెబీ ఆవేదన వ్యక్తం చేశారు… వాడుకలలో లేని స్టింఫోంటైన్ గనిలో జరిగిన ఈ దారుణాన్ని సెబీ ఊచకోతగా అభివర్ణించారు… గనిలో మృతదేహాల కుప్పలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నట్టు చెప్పారు…
దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023లో డిసెంబర్‌లో గని ప్రవేశాన్ని మూసివేసేందుకు ఆపరేషన్ వలఉమగోడీ (ఆపరేషన్ క్లోజ్ ద హోల్)ని ప్రారంభించి 13 వేల మంది అక్రమ మైనర్ల (గని కార్మికుల)ను అరెస్ట్ చేసింది…
అయితే, అరెస్ట్‌కు భయపడిన మరికొందరు కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతున ఉండే స్టిల్‌ఫోంటీన్ గనిలో తలదాచుకున్నారు… దీంతో వారిని బయటకు రప్పించేందుకు ప్రభుత్వం వారికి ఆహారం, నీరు వెళ్లే మార్గాలను మూసివేసింది… దీంతో గదిలోనే చిక్కుకున్న వారు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు…
గనిలో మైనర్లు మృత్యువాత పడుతుండటం, వీడియోలు వైరల్ అవుతుండటంతో స్పందించిన ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది… తమకు సాయం చేయాలని, వెంటనే ఆహారం అందించాలని, తమను బయటకు తీసుకెళ్లాలని వేడుకుంటూ ఓ కార్మికుడు రికార్డు చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇప్పటి వరకు 9 మంది మైనర్ల మృతదేహాలను వెలికి తీశారు…
26 మందిని రక్షించారు. అక్రమ మైనర్ల సమస్య దక్షిణాఫ్రికాలో దశాబ్దాలుగా ఉంది. బంగారం కోసం వీరు తమ ప్రాణాలను పణంగా పెడుతూనే ఉన్నారు. మూసి వేసిన గనుల్లోకి ప్రవేశించి బంగారం కోసం తవ్వుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు… పేదరికం, నిరుద్యోగం వారిని ఈ దిశగా పురికొల్పుతున్నాయి… దీనికి తోడు సిండికేట్లు కూడా ఉండనే ఉన్నాయి. ఇవి వీరికి ఆశ చూసి అక్రమంగా మైనింగ్ చేయిస్తుంటాయి…!
గనిలోకి వెళ్లే మార్గాల్ని మూసివేసి, ఆహారం అందకుండా చేసి, వస్తే బయటకు రండి, లేకపోతే అందులోనే చావండి అనే ప్రభుత్వ నిర్ణయం అత్యంత క్రూరం… చేతనైతే బయటికి తీసుకొచ్చి, మీ చట్టాల ప్రకారం కేసులు పెట్టండి, శిక్షించండి… లేకపోతే అసలు గనిలోకి ఎవరూ వెళ్లకుండా క్లోజ్ చేయండి… కానీ ఇదేం పాలన..? పక్కాగా మానవ హక్కుల ఉల్లంఘన… పనికిమాలిన పరిపాలన..! అది దక్షిణాఫ్రికా కాబట్టి ఎవడూ మాట్లాడటం లేదు, ఏ ఇండియాలోనో ఇది జరిగితే.,. రచ్చ, గాయిగత్తర…!!
Share this Article