Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆకులో ఆకులై… కొమ్మలో కొమ్మలై… ప్రకృతి మాత ఒడిలో జంటజీవనం…

August 24, 2023 by M S R

Jayanthi Puranapanda   జీవితంలో ఒడిదుడుకులను ఆత్మస్థైర్యంతో అధిగమించారు.. తన మనసుకి నచ్చిన కేరళ అబ్బాయిని వివాహం చేసుకున్నారు.. ప్రకృతిలో నివసించాలనుకున్నారు.. రెండు సైకిళ్ల మీద ఈ దంపతులు తమ యాత్ర ప్రారంభించారు..

ప్రస్తుతం నాగార్జునసాగర్ సమీపంలో చిన్న కుటీరం నిర్మించుకుని, మనసుకి నచ్చిన పంటలు పండిస్తూ, రచనా వ్యాసంగం చేస్తున్నారు జయతిలోహితాక్షన్ దంపతులు. ప్రకృతి ఒడిలో సహజమైన జీవనం సాగిస్తున్న ఈ జంట నుంచి నేటితరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. జయతి జన్మదినం సందర్భంగా ఆమెను ఫోనులో పలకరించాను.

నిజామాబాద్ లో జననం

Ads

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో పుట్టారు జయతి. వర్షాభావం కారణంగా కాశీబుగ్గకు వలస వెళ్లారు. విద్యాభ్యాసంలో భాగంగా వరికోతలు, తూర్పార పట్టడంలాంటి ఎన్నో పనులను చేశారు. ‘‘ఎన్ని చూసినా ఏదో దిగులు, ఒంటరిగా దాక్కునేదాన్ని. ఆటలంటే ఇష్టం ఉండేది కాదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండేదాన్ని’’ అని చెప్పారు జయతి. కొన్నాళ్ళకు హైదరాబాద్‌ చేరారు.

ఐదేళ్లు ఆరు వందల జీతానికి..

జీడిమెట్లలో ఒక కంపెనీలో ఆరు వందల జీతానికి చేరి, ఐదేళ్లు కష్టపడి పనిచేశారు. సంగారెడ్డి స్కూల్లో టీచరుగా పనిచేస్తున్న సమయంలో లోహి (లోహితాక్షన్)తో పరిచయమైంది. ఇద్దరం కలిసి జీవించాలనుకుని, కడప జిల్లా మైదుకూరు చేరుకున్నారు. అక్కడ మూడు సంవత్సరాలు ‘భావన క్రియేటివ్‌ స్కూల్‌’ సొంతంగా నడిపారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల స్కూల్‌ మూసేయవలసి వచ్చిందని చెప్పారు జయతి లోహితాక్షన్. అక్కడున్న రోజుల్లోనే పీజీ పూర్తిచేశారు ఆమె.

అడవిలోనే హాయి…

కడప నుంచి మళ్లీ హైదరాబాద్‌ వచ్చారు. తగినంత డబ్బు లేకుండా నగరంలో జీవించటం కంటె అడవిలో జీవించటం నయమనుకున్నారు. ‘‘నాకు అడవికి వెళ్లి, అక్కడ స్వచ్ఛంద సంస్థతో పనిచెయ్యాలని ఉండేది. అలా అడవికి వెళ్ళవచ్చనుకున్నాను. ప్రత్యేక అవసరాలున్న పిల్లలతో పనిచేశాను. పొద్దున్నే ఉడుతల్ని, పక్షుల్ని ఫొటోలు తీస్తూ, సాయంత్రం ట్యూషన్‌ చెప్పేదాన్ని. కొంతకాలం తరవాత ఛత్తీస్‌ఘడ్‌ వెళ్ళిపోయాం. అక్కడి పల్లెలు, కొండలు, అడవులు, పరవళ్లు తొక్కే నది, సాలవనం, పశువుల కాపర్లను ఫోటోలు తీసేదాన్ని. ఎంతోదూరం అడవిలో నడిచి కట్టెలు తెచ్చే మహిళలతో రోజంతా నడిచాను. కెమెరా పట్టుకొని ఒంటరిగా తిరగటం వల్ల నాలో ఆత్మ విశ్వాసాన్ని పెరిగింది’’ అని జయతి చెప్పారు. తరువాత అడవిని చేరుకున్నాం.

అడవి దగ్గరైంది..

ఏకాంతాన్ని ఇష్టపడే జయతికి అడవిలో ఉండాలనే కోరిక నిద్రపోనిచ్చేది కాదు. ‘ఎవరూ చేయని పని చెయ్యాలి. నిన్ను చూసి అందరూ ఇలా జీవించాలని అనుకోవాలి’ అన్న అమ్మ మాటలు నాపై బాగా ప్రభావాన్ని చూపాయని అన్నారు. అడవికి వెళ్ళపోదామని అప్రయత్నంగా నా నోటి నుంచి వచ్చిన మాటలను లోహితాక్షన్ అంగీకరించారని జయతి తెలిపారు. ఆ నిర్ణయానికి వచ్చాక సైకిల్‌ మీద ప్రయాణం ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చారు.

వస్తువులన్నీ అమ్మేసి, 2017 జనవరి 26 న సైకిల్‌ ప్రయాణం మొదలుపెట్టారు. ‘‘ఏ రాత్రి ఎక్కడ ఆగిపోతామో మాకు తెలియదు. అరవై రోజులు పులికాట్‌ సరస్సు దాకా వెళ్ళాం. ఇబ్రహీంపట్నం రిజర్వ్‌ ఫారెస్టునానుకొని ఉన్న ఒంటరి బంగళాలో ఏడాదిన్నర ఉన్నామని తెలిపారు. అక్కడ కూరగాయలు పండిస్తూ, నెలకి రెండు వేల రూపాయలతో జీవించటం అలవాటు చేసుకున్నారు. అప్పుడప్పుడు లోహితాక్షన్ చేసిన కంటెంట్‌ రైటింగ్‌ ద్వారా అవసరాలకి సరిపడా డబ్బు సమకూరేది.

మళ్లీ ప్రయాణం…

ఇబ్రహీంపట్టణం నుంచి తూర్పుగోదావరి ధారపల్లి జలపాతం కింద అడవికి చేరుకుని, అక్కడ కుటీరం నిర్మించుకున్నారు. ‘‘అది గొడ్లపాక. పక్కనే నిత్యం ఏరు పారుతూ ఉంటుంది. తోట పెంచాం. పక్షులు, అడవి జంతువులు చేరేవి. పైకప్పులో పాము నివాసముండేది. అడవిలో కట్టెలు తెచ్చి, తోటలో కాసిన కూరగాయలతో వంట చేసుకున్నాం. ఎండకి, వానకి, చలికి ఆ కుటీరంలోనే ఉండిపోయాం’’ అంటున్న జయతి, లోహితాక్షన్ స్వయంగా కుట్టుకున్న చెరి నాలుగు జతల బట్టలతో, కరెంటు లేకుండా రెండేళ్లు అక్కడే ఉన్నారు. కొన్నాళ్లకు కొండరెడ్లు వారిని వెళ్ళిపోమనటంతో, కుటీరాన్ని వదిలేశారు.

అదే అడవిలో చలిలో కొండ మీద ఒక మహా వృక్షం కింద నెలరోజులు నివసించారు. అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సమీపంలోని బూరుగుపూడి గ్రామం వద్ద అటవీ ప్రాంతంలో కుటీరం నిర్మించుకుని ఉన్నారు.

వారికి వైటీ అనే పెంపుడు శునకం ఉంది. వాళ్ళు దానిని కట్టి ఉంచరు. ఇబ్రహీంపట్నం నుంచి అది వారి వెంట ఉంటోంది. దాని భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని భావిస్తే జయతి, లోహితాక్షన్ దంపతులు ఆ ప్రాంతాన్ని విడిచిపెడతారు. బూరుగుపూడి వదిలెయ్యడానికి అదే ప్రధాన కారణం. వైటీని అక్కడ కొంతమంది కర్రలతో కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అది తట్టుకోలేక వైటీకి సురక్షిత ప్రాంతం కావాలని అన్వేషిస్తుండగా మట్టి ప్రచురణలు అధినేత పాండురంగారావు తన పొలంలో ఉండాల్సిందిగా ఆహ్వానించారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ ప్రాంతంలో ఇప్పుడు వారి నివాసం.

లోహిత్

పుస్తకాలు రాసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమ మొబైల్లోనే వారు రచనలు సాగిస్తారు. ప్రూఫ్ రీడింగ్ కూడా అందులోనే. మట్టి ప్రచురణలు సంస్థ వారి పుస్తకాలను ప్రచురిస్తుంది. వాటిని అమ్మగా వచ్చిన మొత్తమే వారికి ఆధారం. ఉన్నచోటే అవసరమైన కూరగాయలు పండించుకుంటారు. బియ్యం, పాలు, నూనె వంటివి మాత్రమే కొనుక్కుంటారు. వారి నాలుగో రచన దిమ్మరి. ఈ పుస్తకాన్ని సెప్టెంబర్ మూడో తేదీన వారుంటున్న అడవిలో ఆవిష్కరిస్తున్నారు. వాడ్రేవు చిన వీరభద్రుడు, వంటి సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

జయతి

జయతి, లోహితాక్షన్ దంపతుల జీవన శైలి సి.బి.ఐ. మాజీ డైరెక్టర్ కార్తికేయన్ దగ్గరగా పరిశీలించారు. ఇటీవల ప్రగతి రిసార్ట్స్లో జరిగిన ఒక కార్యక్రమంలో వారిని అభినందించారు. ఈ దంపతుల మాదిరిగా జీవించడం ఎంత కష్టమో ఊహించుకోలేము. ప్రకృతిని రక్షించడమే కాదు.. దానికి దగ్గరగా జీవించడం వారి లక్ష్యం.

2021లో తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం, మధునాపంతుల ఫౌండేషన్‌ వారు Bicycle Diaries – Nature connected Bicycle journey, లోహి మొదటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ’అడవి పుస్తకం’ నా రెండవ రచన. ఉత్తమ సాహిత్యం చదవడం, రాయాలనిపిస్తే రాయడం, ఆకలేస్తే వండుకోవడం, తోట పెంచడం, కొద్దిసేపు ఖాళీగా ఉండటం… ఇదీ మా దినచర్య అంటూ వివరించారు జయతి లోహితాక్షన్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions