Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Peg Grammar… భాష ఏదైనా సరే… మందు వ్యాకరణం మాత్రం ఒకటే…

March 12, 2024 by M S R

మద్యవ్యాకరణ సూత్రాలు!

తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే డి జె చప్పుళ్లకు ఎగురుతూ తాగడం- సందర్భాలను తెలిపేవి. నిజానికి తాగడానికి ఒక సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు. తాగడమే దానికదిగా ఒక సందర్భం. తాగడాన్ని వ్యాకరణం కూడా సరిగ్గా పట్టుకోలేదు. ఒక్కొక్క చుక్క కిక్కుగా ఎక్కే కొద్దీ భాష తడబడుతుంది. వ్యాకరణం మూగబోతుంది. భాషా శాస్త్రవేత్తలు, భాషోత్పత్తి శాస్త్రవేత్తలు సరిగ్గా దృష్టి పెడితే- తాగుబోతుల భాష, వ్యక్తీకరణ, అందులో అంతర్గతంగా ఇమిడి ఉన్న ప్రత్యేకమయిన వ్యాకరణం, ఉచ్చారణ భేదాల్లాంటి ఎన్నో భాషాపరమయిన వినూత్న విషయాలు తెలిసేవి. తాగుబోతులకు- భాషకు; తాగుబోతులకు- ఆర్థిక రంగానికి;
తాగుబోతులకు- సమాజ శ్రేయస్సుకు ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల మీద జరగాల్సినంత పరిశోధనలు జరగకపోవడం సమాజానికే వెలితి. తాగడం మీద లోతుగా రాయడానికి నాకు అర్హత, అధికారం, అభినివేశం, అనుభవం లేవు. ఏవయినా లోపాలుంటే తాగుబోతులు మద్యమనసుతో అంగీకరిస్తారని సాహసిస్తున్నాను.

సంధులు- సందులు
——————-
భాషలో అక్షరాలు కలవడం సంధి. అ కు అ చేరితే సవర్ణ దీర్ఘ ఆ అవుతుంది. అ కు ఉ చేరితే గుణమై ఓ అవుతుంది. వ్యాకరణంలో పరిమితమయిన సంధులే ఉన్నాయి. తాగడానికి ఉన్న సందులు లెక్కలేనన్ని. ప్రతి సందులో కిక్కిరిసిన చుక్కల లిక్కర్ షాపులే. ప్రతి సందులో బార్ అండ్ రెస్టారెంటులే. అన్ని సందులూ మద్యానికి అనువయినవే. అక్షరాల మధ్య సంధులు ఉంటాయి. ఇళ్ల మధ్య, గుళ్ల మధ్య, బళ్ల మధ్య సందు సందులో మద్యం షాపులే ఉంటాయి.

Ads

సమాసాలు- సమోసాలు
——————
రెండు పదాలు ఒకటి కావడం వ్యాకరణ సమాసం. తాగుబోతు- బాటిల్ ఒకటి కావడం మద్యసమాసం. దీనికి అనుషంగికంగా పల్లీలు, పకోడీలు, సమోసాలు నంజుకోవడానికి అదనం.

విభక్తులు- ప్రత్యయాలు
——————–
డుమువులు లాంటి విభక్తులన్నీ ప్రయత్నపూర్వకంగా బాటిల్ ముందు భయ భక్తులతో అణగి మణగి ఉంటాయి. బాటిల్ కొరకు, బాటిల్ వలన, బాటిల్ పట్టి, బాటిల్ చేత, బాటిల్ యొక్క, బాటిల్ పైన, బాటిల్ కింద, బాటిల్ పక్కన, ఓ మై బాటిల్! ఒరేయ్ బాటిల్! ఒసేయ్ బాటిల్!
ఇలా అన్నీ బాటిల్ సంబోధన ప్రథమా విభక్తులే అవుతాయి.

ఆమ్రేడిత బహుళం
—————–
మొదట క్వార్టర్ తో మొదలై ఆపై ఆఫ్ బాటిల్ అయి, చివర ఫుల్ బాటిల్ కావడం ఆమ్రేడితం. ఆమ్రేడితం అలవాటు కావడం బహుళం.

నడక- నడత
————-
తాగకముందు నడిచేది తాగడం కోసం నడిచే నడక. తాగిన తరువాత నడిచేది తాగుబోతు నడత.

సీసా- వీసా
————–
“నీ ఎదుట నిలబడు చనువే వీసా…
అందుకుని గగనపు కొనలే చూశా…
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…
చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరణాళ్ళే”

అని ఈ మధ్య గీతగోవిందం సినిమాలో ఒక కవి ప్రేయసీ ప్రియుల మధ్య వీసా, పాస్ పోర్ట్, స్టాంపింగ్, హెచ్ ఒన్ బి , గ్రీన్ కార్డు, పర్మనెంట్ సిటిజెన్ షిప్ గురించి రాశాడు.
అలా సీసా ముందు నిలుచోవడమే తాగుబోతులకు వీసా. బాటిల్ అందుకుని గగనపు కోసలే చూశా. ఇంకేం ఇంకేం కావాలే?
చాలే ఈ బాటిల్…చాలే. ఇకపై చుక్కలనాళ్లే!

చుక్కలు- దిక్కులు
—————–
తూర్పు తెలిస్తేనే మిగతా దిక్కులకు దిక్కు మొక్కు. బాటిల్ అన్ని దిక్కుల్లో ఉంటుంది. ఒకప్పుడు చుక్కలు పొడిచే వేళకే బాటిల్స్ అప్ అని చుక్కలు గుక్కలు గుక్కలుగా తాగేవారు. ఇప్పుడు చుక్కలకు పగలూ రాత్రి తేడా లేదు. తాగనంతవరకే దిక్కులు. తాగిన తరువాత దిక్కులన్నీ దిక్కులేనివి అవుతాయి. అప్పుడు సాటివారు దయదలిచి తాగినవారికి ఇల్లూవాకిలికి దిక్కు ఎటో చూపిస్తారు. సమాజంలో సాటి మనిషికి దారి చూపే ఔదార్యం అనాదిగా ఉంది.

బాటిల్ గలగలలు
ఆదాయం కళకళలు
——————–
దేశ ఆర్థిక ప్రగతిలో, రాష్ట్రాల ఆర్థిక వనరుల పరిపుష్టిలో తాగుబోతుల కంట్రిబ్యూషన్ ఏటా కొన్ని లక్షల కోట్లు. నిజానికి తాగుబోతులు తమను తాము బలి పెట్టుకుంటూ సమాజ ఆర్థిక పురోగతికి పాటుపడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్.

మద్యంతో విశ్వశాంతి
——————–
ఇది డిబేటబుల్ సబ్జెక్ట్. ప్రొఫెషనల్ తాగుబోతు తన మానాన తాను తాగి పడుకుంటాడు. అతను/ఆమె వల్ల విశ్వ శాంతి. లేకపోతే సమాజానికి అశాంతి.

బాటిల్ తో పోయేదానికి గొడ్డలి ఎందుకు?
——————–
కొన్ని పనులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కావు. బ్లాక్ లేబులో, ఓల్డ్ మాంకో రెండున్నర వేలు ఖర్చు పెట్టి సమర్పించుకుని ధారగా చుక్కలు దారపోస్తే- వెంటనే పని అయిపోతుంది. పెద్దల గౌరవ-మర్యాదల దృష్ట్యా ఈ సబ్జెక్ట్ లో లోతుగా వెళ్లకూడదు.

మంచి- చెడుకు మంచి నేస్తం
——————–
పెళ్లికి ఆనందంతో తాగాలి.
చావుకు విషాదంతో తాగాలి.
మంచికి తాగాలి.
చెడుకు తాగాలి.
టైమ్ పాస్ కు తాగాలి.
సరదాగా తాగాలి.
కిక్కుకోసం తాగాలి.
నిద్రకోసం తాగాలి.
నిద్ర పట్టక తాగాలి.
హోదా కోసం తాగాలి.
హోదా మరచి తాగాలి.
వ్యసనంగా తాగాలి.
పర్యవసానంగా తాగాలి. మరచిపోయేందుకు తాగాలి. గుర్తున్నంతవరకు తాగాలి.
తాగి…తాగి…ఊగాలి.
ఊగి…ఊగి…తాగాలి.
వాంతయినా…తాగాలి.
పేగులు పోయినా…తాగాలి.
ప్రాణం పోయినా…తాగాలి.
తాగుతూనే…పోవాలి!

(దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ మద్యం ఉత్పత్తిని ఉన్నదానికంటే కనీసం మూడు, నాలుగు రెట్లు పెంచినా…ఆకస్మికంగా వచ్చి పడిన ఎన్నికల రుతువు ప్రత్యేక డిమాండుకు తగ్గట్టు మందు సప్లై చేయలేకపోతున్నామే అని; దేశంలో అమ్ముడయ్యే మద్యంలో గత ఏడాది 25 శాతమే ఉన్న విదేశీ ప్రీమియం మద్యం వాటా ఈ ఏడాది 40 శాతమే అయ్యిందని నైతికంగా బాధపడుతున్న స్వదేశీ, విదేశీ డిస్టలరీ యూనిట్లవారి దిగులు నేపథ్యంలో) –పమిడికాల్వ మధుసూదన్     9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions