నో డౌట్… పాట సూపర్ హిట్… రాబోయే కమ్ముల శేఖర్ సినిమా లవ్ స్టోరీలోని సారంగ దరియా పాట యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షల హిట్స్‌తో దూసుకుపోతోంది… నిజానికి తెలంగాణ పల్లె నుంచి పుట్టిన ఆ పురాతన ట్యూన్‌లోని పంచ్ అది… మంగ్లీ టోన్‌కు తగిన ట్యూన్ అది… తను కూడా హుషారుగా పాడింది… సాయిపల్లవి స్టెప్పుల గురించి చెప్పడానికేముంది..? పెద్ద పెద్ద తోపు డాన్సర్లే ఆమె ముందు వెలవెలబోతారు… శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పుల్ని తనదైన స్టయిల్లో ఇరగేసింది… అంతా బాగుంది… ఫిదా సినిమాలో మెల్లామెల్లగా వచ్చిండే పాట తరహాలో లవ్ స్టోరీ సినిమాకు ఈ సారంగ దరియా పాట ప్రధాన ఆకర్షణ కాబోతోంది… వోకే, సూపర్… కానీ ఈ పాటను గీతరచయిత సుద్దాల అశోక్ తేజ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు..? ఏదో ఆ ట్యూన్ పల్లవితోపాటు దాని ఆత్మను కూడా అంతగా వాడేసుకోవడం అవసరమా..? సొంతంగా కొన్ని పంచ్ లైన్స్ కూడా రాసుకోలేని క్రియేటివ్ పూర్నెస్సా..? గతంలో మహాకవి శ్రీశ్రీ పదాల్ని కూడా తను ఇలాగే ఏదో చిరంజీవి సినిమా పాటకు వాడేసుకున్నట్టు, దానికే జాతీయ అవార్డు కొట్టేసినట్టు గుర్తు… మరి ఇది..? ఈ చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది…
నిజానికి ఇది చాలా పురాతనమైన జానపదగేయం… తెలంగాణ పల్లెసీమల్లో చాలా పాపులర్… సరదాగా పదాల్ని కూర్చి సాగే పాట… చాలా పదాలకు అర్థాలేమీ ఉండవు, లిటరరీ వాల్యూ కాదు గానీ, పాడుతుంటే ఉత్తేజపరిచే ట్యూనే దాని బలం… “దాని కుడి భుజం మీద కడువా, దాని గుత్తెపు రైకలు మెరియా అని స్టార్టవుతుంది… అది రమ్మంటే రాదురా సెలియా, దాని పేరే సారందరియా… దాని ఎడమ భుజం మీద కడువా, దాని ఏజెంటు రైకలు మెరియా”… ఇలా నడుస్తుంది… ఇందులో ఎప్పుడో 45 ఏళ్ల క్రితం వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాలో ఓ వ్యాంప్ పాటలో గుత్తెపు రవిక అనే పదాన్ని నారాయణరెడ్డి అద్భుతంగా ఓచోట ఇరికించాడు… గుత్తెపు రవికా ఓయమ్మో, చెమట చిత్తడిలో… అంటూ…! పదాలు ఎవరి సొత్తూ కావు… పురాతన ట్యూన్లపై ఎవరికీ ఏ రైట్సూ లేవు… కానీ ఇప్పుడు ఆ పాటలోని పల్లవి మొత్తాన్ని అశోక తేజ ఎడాపెడా తన పాటలో వాడేసుకుని, తన ఘనతగా చెప్పుకుంటుంటే జాలేస్తోంది అన్నది ప్రస్తుత చర్చ…
Ads
“కాళ్లకి ఎండీ గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్… కొప్పుల మల్లెల దండల్, లేకున్నా చెక్కిలి గిల్ గిల్”…… (మల్లెదండలకూ చెక్కిలి గిలిగిలికీ లంకె ఏమిటో… పాట మొత్తం అలాగే సాగుతుంది… అయినా సినిమా పాటలకు అర్థాలేముంటయ్… పైగా హిట్ పాటల్లో అర్థాలు, గూఢార్థాలు, మర్మార్థాలూ, పరమార్థాలూ, విశేషార్థాలూ గట్రా చూడొద్దు… జస్ట్, హమ్ చేసేయాలి… అంతే…) “నవ్వుల లేవురా ముత్యాల్… అది నవ్వితే వస్తయ్ మురిపాల్… నోట్లో సున్నం కాసుల్, లేకున్నా తమలాపాకుల్, మునిపంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా అవుతదిరా మన దిల్… రంగే లేని నా అంగీ, జడ తాకితే అయితది నల్లంగీ… మాటల ఘాటు లవంగి, మర్లపడితే అది సివంగి… తీగెలు లేని సారంగి, వాయించబోతే అది ఫిరంగి… దాని సెంపల్ ఎన్నెల కురియా, దాని చెవులకు దుద్దుల్ మెరియా”……. ఇలా పాట… ఇందులో ఓ చోట సుర్మా పెట్టిన ఛురియా వంటి కొన్ని పదాలు మాత్రం బాగా పడ్డయ్… మిగతావన్నీ సరదాగా పదాల అల్లిక… గుత్తెపు రవిక అనే పదానికి సాయిపల్లవి పర్సనాలిటీ సూట్ కాలేదు గానీ… పాటలో పదాలకూ తెరపై కనిపించే సీన్లకు కూడా సింక్ కాదు గానీ… ఆ ట్యూన్ మాత్రం అద్దిరిపోయింది…
….(పాట వీడియో మాటీవీ సౌజన్యం)…….. అప్పుడెప్పుడో మాటీవీలో ప్రసారం అయిన రేలారే రేలా ప్రోగ్రాంలో ఓ జానపద కళాకారిణి పాడిన పాట ఇది… బహుశా జడ్జిల స్థానంలో ఇదే అశోక్ తేజ కూర్చున్నట్టున్నాడు… అప్పుడే మైండ్‌లో ఫిక్సయిపోయినట్టున్నాడు… ఎప్పుడైనా సరే దీన్ని ప్రాణ పల్లవిని ఎత్తేయాలని… ఇప్పుడు దొరికింది చాన్స్… ఒక పాత పాపులర్ పల్లవిని ఎత్తుకుని, దానికి అనుగుణంగా సొంతంగా చరణాలు రాసుకోవడం పెద్ద తప్పేమీ కాకపోవచ్చు… కానీ పాట ఓ నిమిషంపాటు పాత పాట విన్నట్టే యథాతథంగా సాగుతుంది… మిగతాది దానికి కొనసాగింపు ప్రయాస అనిపిస్తుంది… అంత్య ప్రాస కోసం ఒక అమెచ్యూర్ రైటర్ నానా సర్కస్ ఫీట్లు పడినట్టుగా ఉంది… యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసినప్పుడు ఈ పాటకు సంబంధించి క్రెడిట్స్ ఎవరికి ఇవ్వాలో తెలియకపోవచ్చు… అఫ్ కోర్స్, కమ్ముల శేఖర్ తన ఫేస్ బుక్ పేజీలో తెలంగాణ జానపద గీతం అని పేర్కొన్నాడు… గుడ్… వీడియోలో కూడా అది గుర్తుచేసేలా ఓ క్రెడిట్ నోట్ పెడితే బాగుండేదేమో…!! అవునూ… సారంగదరియా అంటే అర్థమేమిటి..? మేల్ వెర్షన్‌ను ఫిమేల్ టోన్‌లో పాడించడం దేనికి..? రెండు భేతాళ ప్రశ్నలు… ఎవరికి తోచిన బాష్యాలు వాళ్లు ఊహించుకోవచ్చు…
Share this Article