బాల్య మిత్రుడికి అప్పిచ్చి గజనీగా మారిన ఆటో బాషా
(ఆ మధ్య అప్పు గురించి రాశాక, ఓ ఫ్రెండ్ వద్దంటే అప్పిచ్చి గజనీగా మారిన ఆటో బాషా గురించి చెప్పారు … అప్పు ఇవ్వాలి అనుకున్న వారు ఈ ఉదంతం చదివి నలుగురికి చెబితే మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది …)
తెల్లవారు జాము మూడు గంటలు . ఆటో బాషా దిల్ సుఖ్ నగర్ బస్ డిపో వద్ద ఆటో ఆపి నేను ఎవరిని ? ఇక్కడికి ఎందుకు వచ్చాను అని తనను తానే ప్రశ్నించుకుంటూ, అలా నడుస్తూ వెళ్లి ఇంటి ముందు కనిపించిన మహిళతో ఉదయం నుంచి ఏమీ తినలేదు, మంచి నీళ్లు ఇవ్వమని అడిగితే, ఆమె భయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది … మరోవైపు ఆటో బాషా ఇంకా ఇంటికి రాలేదు అని ఇంట్లో వాళ్ళు వెతుకుతున్నారు … ఉదయం ఎలాగో ఇంట్లో వాళ్ళ కంటబడ్డాడు .
Ads
ఆరోగ్యం బాగా లేనప్పుడు బయటకు వెళ్లడం ఎందుకు అని వాళ్ళ అమ్మాయి జాగ్రత్తలు చెప్పింది … కొద్దిగా కోలుకున్న తరువాత అమ్మాయి నీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే సెల్ ఫోన్ లో ఈ నంబర్ వత్తు అని జాగ్రత్తలు చెప్పింది .. అంతకు ముందు అతను నగరమంతా ఆటోలో తెగ తిరిగే వాడు, అప్పటి నుంచి దిల్ సుఖ్ నగర్ చుట్టు పక్కల మాత్రమే తిరగాలి అని ఇంట్లో వాళ్ళు ఆంక్షలు విధించారు .
ఆటో బాషా తన ఫీల్డ్ లో రజనీ కాంత్ బాషా లాంటి వాడు . హఠాత్తుగా గజనీగా మారడం వెనుక బాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది .. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే …
ఆటో బాషాది నల్లగొండ జిల్లా మాల్ … ఊరిలోని భూమి అమ్మితే పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది . గ్రామంలోని బాల్య మిత్రుడు ఏదో వ్యాపారం చేస్తాడు … నీకు బోలెడు డబ్బు వచ్చింది కదా ? ఓ పది లక్షలు నా వ్యాపారం కోసం అప్పు ఇవ్వు .. అని అడిగితే బాషా వెంటనే నిర్ణయం తీసుకోకుండా, తనకు మంచి చెడు చెప్పే ఆటో కస్టమర్ ఒకరి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు …
అప్పు ఇస్తే నిండా మునుగుతావు .. బాల్యమిత్రుడు అంటున్నావు కాబట్టి నీకు స్థోమత ఉంటే ఓ రెండు లక్షలు ఉచితంగా ఇవ్వు అని సలహా ఇచ్చారు .
బాషాకు అది రుచించ లేదు .. ఒకటో తరగతి నుంచి కలిసి చదువుకున్నాం . కాకి ఎంగిలి తిన్నాం అంటూ మరపురాని ఆ బాల్యాన్ని తలుచుకొని స్నేహితుడికి పది లక్షలు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాడు . ఇచ్చేశాడు ..
కొన్ని నెలలు గడిచాక బాల్యమిత్రుడు ససేమిరా అని డబ్బు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడలేదు . లేక కాదు, ఎందుకు ఇవ్వాలి అని …. నెలలు గడిచాక బాషా విశ్వరూపం చూపించి డబ్బు ఇస్తావా చస్తావా అని ఒత్తిడి పెంచాడు …
స్నేహం తెర వెనక్కి వెళ్ళింది . డబ్బు తెరపైకి వచ్చింది . బాషాను లేపేయాలి అని కిరాయి మనుషులను బాల్య స్నేహితుడు మాట్లాడాడు … ఒకే ఊరు కావడం వల్ల బాషాకు విషయం తెలిసింది .. జాగ్రత్తగా ఉండడంతో పాటు తెలివిగా వ్యవహరించి, బాల్యమిత్రుడిని కిడ్నాప్ చేసి … నన్ను లేపేయాలి అని చూస్తావా ? నిన్నే లేపేస్తా చూడు అని డబ్బు ఇస్తావా, చెట్టుకు ఉరి వేయమంటావా అని దాదాపు ఉరి వేసినంత పని చేశాడు … మిత్రుడు దెబ్బకు భయపడి డబ్బు తిరిగి ఇచ్చేశాడు …
చెప్పినంత ఈజీగా కథ ఇక్కడి వరకే అయితే సుఖాంతం అనుకోవచ్చు … అంత ఈజీగా జరగలేదు .. ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చింది కానీ ఆలోపు బాషా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు . బాల్యమిత్రుడు తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడం లేదు . పైగా హత్య చేయడానికి కిరాయి హంతకులను ఏర్పాటు చేయడం తట్టుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు ..
డబ్బు వచ్చింది కానీ జ్ఞాపకశక్తి పోయి గజనీగా మారాడు … బాషా ఇప్పుడు మునపటి బాషాలా లేడు .. గజనీగా మతిమరుపు వచ్చింది . మహానగరం అంతా తిరిగిన బాషా ఇప్పుడు దిల్ సుఖ్ నగర్ నుంచి ఐదు కిలో మీటర్లు దాటి వెళ్ళడు …. మీరు చెప్పినా వినకుండా అప్పు ఇచ్చి ఇలా అయ్యాను అని ఆటో బాషా నుంచి గజనీగా ఎలా మారాడో శ్రేయోభిలాషికి తన కథ చెప్పాడు .. ఆ శ్రేయోభిలాషి నాకు చెప్పారు … నేను మీకు చెబుతున్నాను . ( ఆటో బాషా , అతని మిత్రుడి పేర్లు , కులాలు ఏమిటో ఆసక్తి లేకపోవడం వల్ల అడగలేదు )….. [ బుద్ధా మురళి ]
Share this Article