కరోనాకూ ఈ కథకూ లంకె ఏమిటబ్బా అని ఆలోచించకుండా… ముందుగా ఈ కథ చదవండి… ‘‘కురుక్షేత్ర సంగ్రామానికి అందరూ సిద్ధం… స్థలాన్ని కూడా ఎంపిక చేశారు… ఆ మహా సంగ్రామానికి గుర్రాలు, ఏనుగులు, రథాలు, రాక్షసులు, అనేక ఆయుధాలు, అస్త్రాలు… మాటలు కాదు… లక్షల తలలు తెగిపడతయ్… అదుగో అక్కడ ఆ రణభూమిని చదును చేస్తున్నారు… రాళ్లు రప్పలు చెట్లు తుప్పలు తొలగిస్తున్నారు… ఆ స్థల పరిశీలనకు వెళ్లాడు శ్రీ కృష్ణుడు… ఈ రణానికి ప్రధాన కారకుడు కదా… వెంట అర్జునుడున్నాడు ఎప్పటిలాగే… ఈ పనుల్లోనే ఉన్న ఓ ఏనుగు ఓ చెట్టును కూల్చేసింది.., ఆ చెట్టుకో తొర్ర, ఆ తొర్రలో ఓ పిచ్చుక, దానికి నాలుగు పిల్లలు… ఇంకా ఎగరలేవు… వాటిని తీసుకుని తల్లి పిట్ట ఎటూ ఎగిరిపోలేదు… పిచ్చుక గూడు నేల మీద పడింది… పిల్లలకేమీ కాలేదు…
ఆ పిట్టకు కృష్ణుడు కనిపిస్తాడు, గుర్తిస్తుంది… వెళ్లి కాళ్ల మీద పడుతుంది… అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తుంటాడు… కృష్ణుడికి పిట్ట వ్యథ తెలుసు… దాని వైపు చూస్తాడు… ‘‘ఏంటి దేవా ఇది..? ప్రస్తుతానికి నా పిల్లలు భద్రం, రేపు లేదా ఎల్లుండి ఇంకో ఏనుగు వచ్చి తొక్కేస్తుంది… నేనూ, నా పిల్లలు ఏమవ్వాలి..? ఈ యుద్ధానికి మొదటి ప్రాణార్పణం నా పిల్లలేనా దేవా..? మేం చేసిన పాపమేంది..? మాకే ఎందుకీ శిక్ష..?’’ అనడుగుతుంది… ‘‘నీకు తెలియకుండా చీమ కూడా కదలదు, జగన్నాటక సూత్రధారివి, నువ్వే నా పిల్లలను కాపాడాలి, నువ్వే రక్ష’’ అని వేడుకుంటుంది… కృష్ణుడు వెంటనే అభయహస్తం ఏమీ చూపించలేదు… ‘‘రాసి పెట్టినట్టు అవుతుంది కదా, నేనేం చేయగలను..? కాలచక్రం చాలా నిరంకుశమైంది..’’ అంటూనే కృష్ణుడు ఏదో ఆలోచనలో పడ్డాడు… పిట్ట తనవైపే చూస్తోంది… కాసేపటికి ‘‘నేను రెండు రోజులాగి మళ్లీ వస్తాను, ఓ రెండు వారాలకు సరిపడా తిండిని ఎలాగైనా సమీకరించుకో’’ అని పిట్టకు చెప్పాడు…
Ads
రెండు రోజుల తరువాత కృష్ణార్జునులు మళ్లీ ఆ స్థలానికి వెళ్లారు… పిట్ట అక్కడే ఉంది… ‘అర్జునా, ఓసారి నీ గాండీవాన్ని ఇటివ్వు’ అన్నాడు కృష్ణుడు… ‘అదేమిటి బావా..? నువ్వు ఆయుధం పట్టనంటివి కదా… బాణం ఎవరి మీదో చెప్పు, నేను సంధిస్తాను, ఐనా ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదుగా’ అన్నాడు అర్జునుడు… ‘‘ఈ పిట్ట పిల్లలని కాపాడాలీ అంటే, మనతో తీసుకుపోయి ఇంకెక్కడైనా వదిలేద్దాం’’ అంటుండగానే కృష్ణుడు తన గాండీవాన్ని తన చేతుల్లోకి తీసుకుని, అటు వైపు వచ్చిన ఓ ఏనుగు వైపు బాణం వదిలాడు… అది వెళ్లి ఆ ఏనుగుకు కట్టి ఉన్న పెద్ద గంటకు తగిలింది… అది కింద పడింది… పిట్ట, దాని పిల్లలు ఆ గంట కింద చిక్కుకుపోయాయి… మొన్న పిట్ట గూడున్న చెట్టును కూల్చేసిన ఏనుగే అది… అర్జునుడు నవ్వుతూ ‘‘కృష్ణుడి గురి తప్పడం ఏమిటి..? ఆ ఏనుగును వధించాలా..? బాణం వదలనా..?’’ అనడిగాడు… ‘‘వద్దులే, పనైపోయింది’’ అని కృష్ణుడు వెనుతిరిగాడు…
భీకరమైన యుద్ధం జరిగింది… లక్షల శవాలు, అనేక మారణాస్త్రాల ప్రయోగాలు… బీభత్సం… రథాలు విరిగినయ్, గుర్రాలు-ఏనుగులు మరణించినయ్… రాబందుల గుంపులు నిర్విరామంగా పీక్కు తింటూనే ఉన్నయ్… మైళ్ల కొద్దీ చావు వాసన… యుద్ధం ముగిశాక కృష్ణుడు ఆ శిథిలాల నడుమ ఏదో వెతుకుతున్నాడు… అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు… ఎవరైనా యదువీరుడి శవం కోసం వెతుకుతున్నాడేమో అనుకున్నాడు… కాసేపటికి ఆ గంట కనిపించింది… కృష్ణుడు దాన్ని పైకి లేపాడు… ఆ పిట్ట, పిల్లలు పైకి ఎగిరాయి… వాటి రెక్కల్లో బలం వచ్చింది… ఇంత బీభత్సం నడుమ ఆ గంట కింద భద్రంగా బతికాయి… కృష్ణుడికి రెక్కలతో దండం పెడుతూ ఎటో దూరంగా వెళ్లిపోయాయి… ఇదీ కథ… చదవడానికి ఓ పురాణకథలా బాగానే ఉంది… కానీ ఇంతకీ ఏం చెప్పాలనుకున్నట్టు అంటారా..? ఈ కరోనా మృత్యుహేల నుంచి కొన్నిసార్లు మనల్ని కాపాడేది ఆ గంట కింద పిట్టలు ఒదిగిపోయినట్టుగా మనమూ ఇంట్లోనే కొన్నాళ్లు ఉండిపోవడమేనేమో..!!
Share this Article