.
Ashok Kumar Vemulapalli … “లజ్జ”…
నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన బెంగాలీ వెబ్‌సిరీస్ ‘లజ్జా’ (Lojja) నన్ను ఎంతో కదిలించింది. మన ఇంటి పక్కనో, మన బంధువుల ఇళ్లలోనో జరుగుతున్న వాస్తవాలను చూస్తున్నట్టుగా అనిపించింది.
దర్శకురాలు అదితి రాయ్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జయ పాత్రలో ప్రియాంకా సర్కార్ నటన అద్భుతం. ఒక మహిళ అనుభవించే అవమానాలు, మానసిక వేదన, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని ఆమె ఎంతో సహజంగా చూపించారు.
Ads
ఈ సిరీస్‌లో పదేపదే వినిపించే పదం ‘వెర్బల్ అబ్యూస్’ (Verbal Abuse). అంటే మాటలతో వేధించడం, బూతులు తిట్టడం, నలుగురి ముందు అవమానించడం, ఒక మనిషి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. శారీరకంగా కొట్టకపోయినా, మాటలతో ఎంతటి మానసిక హింసకు గురిచేయవచ్చో ఈ కథ మనకు అర్థమయ్యేలా చేస్తుంది.

పెళ్లయిన కొత్తలో ప్రేమగా చూసుకున్న భార్యను, కొంతకాలం తర్వాత పనిమనిషి కంటే హీనంగా చూసే భర్తలు మన సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. వంట చేయాలి, పిల్లలను చూసుకోవాలి, భర్తకు సేవలు చేయాలి… అవమానించినా, తిట్టినా మౌనంగా భరించాలి! ఇదే భార్య బాధ్యత అన్నట్టుగా ప్రవర్తించే పురుషులున్నారు.
కుటుంబం కోసం, పిల్లల కోసం ఎన్నో అవమానాలను భరిస్తున్న మహిళ మనసులో ఎంత వేదన ఉంటుందో ఎవరూ ఆలోచించరు. ఆమె మౌనాన్ని బలహీనతగా భావిస్తారు. ఆమె సహనాన్ని తమ హక్కుగా భావిస్తారు.
‘లజ్జా’లో కోర్టు వాదనలు కూడా ఆలోచింపజేస్తాయి. భార్యను పదేపదే అవమానించడం చిన్నపాటి కుటుంబ గొడవ కాదు. నిరంతర వెర్బల్ అబ్యూస్ ఒక మహిళ ఆత్మవిశ్వాసాన్ని, మానసిక ప్రశాంతతను ఎలా దెబ్బతీస్తుందో ఈ సిరీస్ బలంగా చూపిస్తుంది.
నా అభిప్రాయం ఒక్కటే… ఈ వెబ్‌సిరీస్‌ను మహిళల కంటే పురుషులు ఎక్కువగా చూడాలి. భార్యను అణచివేయడం పురుషత్వం కాదు. ఆమెను భయపెట్టి మౌనంగా ఉంచడం సంసారం కాదు.
ప్రేమ తగ్గినా, అభిప్రాయాలు కలవకపోయినా కనీసం ఒక మనిషిగా ఆమెను గౌరవించాలి. భార్య మీ జీవిత భాగస్వామి… మీ బానిస కాదు!
మొత్తానికి, ‘లజ్జా’ కేవలం వినోదం కోసం చూసే సిరీస్ కాదు. మహిళల వేదనను అర్థం చేసుకోవడానికి, పురుషుల ఆలోచనల్లో మార్పు రావడానికి చూడాల్సిన కథ. ప్రియాంకా సర్కార్ నటన కోసమైనా ఈ సిరీస్ తప్పకుండా చూడాలి. — అశోక్ వేములపల్లి
- బెంగాలీలో ‘ಅ’ (a) అనే అక్షరం చాలావరకు ‘ఒ’ (o) లాగా పలుకబడుతుంది… ఉదాహరణకు, ‘అమ్మోర్’ అనాల్సిన చోట ‘ఒమ్మోర్’ అన్నట్లుగా, ‘లజ్జ’లోని ‘ల’ ‘జ’ మధ్య వచ్చే అక్షరం బెంగాలీ టచ్‌తో పలికేసరికి “లొజ్జ” (Lojja) అని వినబడుతుంది…సంస్కృత మూలాలున్న ఈ పదానికి హిందీ, తెలుగు, బెంగాలీ మూడింటిలోనూ “సిగ్గు” లేదా “అభిమానం/మర్యాద” (Shame/Modesty) అనే ఒకే అర్థం వస్తుంది…. బెంగాలీ వెబ్ సిరీస్ కాబట్టి వాళ్ళు టైటిల్‌ను బెంగాలీ యాసలో “లొజ్జ” అని రాసుకున్నారు…
Share this Article