ఏ రాజకీయ నాయకుడైనా సరే… ఎంతటి ఉత్తరకుమారుడు, లక్ష్మణకుమారుడు ఐనా సరే… జనంలో తిరుగుతుంటే, అదీ పాదయాత్ర ద్వారా జనాన్ని కలుసుకుంటుంటే కొంత జ్ఞానం సమకూరుతుంది… ఔట్ లుక్ విస్తృతమవుతుంది… ఇన్నేళ్లూ ఒక తరహా జీవనంలో బతికిన కళ్లకు కొత్త లోకం కనిపిస్తుంది… కానీ లోకేష్ ఈరోజుకూ అలాగే ఉన్నాడు… అవును మరి, ఆ బ్లడ్డు ఆ బ్రీడు అదే కదా మరి…
1994లో హైదరాబాద్ ఎవరికీ తెలియదట… అంతా రాళ్లు రప్పలట… అయిదొందల చరిత్ర కలిగిన ఓ ప్రాంత ఘనమైన ఆత్మగౌరవ ప్రతీకను కించపరుస్తున్నామనే సోయి కూడా లేదు ఈ నాయకుడికి… కాబోయే ముఖ్యమంత్రట కూడా…! ఏపీలో టాప్ టెన్ నాయకులందరినీ తీసుకుంటే అధికారంలో ఉన్నవాళ్లతో సహా అందరూ ఇదే టైపు కనిపిస్తున్నారు…
హైదరాబాదులోనే బతుకుతాడు, ఈ నీళ్లే, ఈ తిండే కావాలి… కానీ మాట్లాడితే హైదరాబాద్‌ను కించపరచాలి… తాత హైదరాబాద్ వచ్చాకే ఇక్కడి జనం అన్నం తినడం స్టార్టయిందని ఒకరు కూస్తారు… తాత ఈప్రాంత వాసులకు తెల్లవారి లేవడం నేర్పించాడని ఇంకెవరో వదరుతారు… జొన్నన్నం తప్ప వేరే దిక్కులేని ప్రాంతం నుంచి వచ్చి, బాస్మతి బియ్యంతో ధమ్ కా బిర్యానీ తినీ తినీ మొహం మొత్తిన హైదరాబాదీయులకు సంస్కృతి నేర్పిస్తారు ఈ జ్ఞానవంతులు…
Ads
అయ్యవారేమో నేనే హైదరాబాద్ కట్టాను అంటుంటాడు మాటిమాటికీ… బాబ్బాబు, పత్తర్ ఘట్టి, శాలీబండ, డబ్బీర్‌పుర, జుమ్మెరాత్ బజార్ ఎక్కడున్నాయో మ్యాపులో చూపించు అని ఎవరైనా అడిగితే బాగుండు… లోకేశం కొత్త తరం కదా, మరిన్ని తెలివితేటలు పుణికిపుచ్చుకుని అసలు 1994లో హైదరాబాద్ అంటే ఎవరికీ తెలియదని, అన్నీ రాళ్లూ రప్పలేనని కూశాడు… ఇక్కడ కూశాడు అనే పదం వాడటానికి నేనేమీ సందేహించడం లేదు… అమర్యాదకరమైన ఇతర గొట్టు తిట్టు పదాలు వాడలేక…
అప్పుడెప్పుడో హైదరాబాద్ ఎన్నికల్లో తిరుగుతూ ఈయన గారి మామగారు మేరీ ప్యారీ బుల్‌బుల్ అని ఏదేదో వాగేస్తాడు… తను ఇక్కడే చదువుకుని, ఇక్కడి తిండితోనే అలా తయారయ్యాడు… 1994లో ఏమీ లేని నగరానికి ఈ లోకేశం తాత, అనగా ఎన్టీయార్ 1983లోనే ఎందుకు వచ్చాడట… తెలంగాణ ప్రాంతాన్ని తెగ ఉద్దరించేద్దామని వచ్చాడా..? 1994 దాకా ఆ రాళ్లూరప్పలు ఏరుకుంటూ కూర్చున్నాడా..? మీ అయ్యగారు, అనగా నాన్నగారు, అనగా తండ్రిగారు కుర్చీ ఎక్కింది కూడా 1995…
ఆ రాళ్లూరప్పల నడుమే ప్రమాణ స్వీకారం చేశాడా..? అప్పటిదాకా అండమాన్ సెంటినలీస్‌లాగా బట్టల్లేకుండా ఆ రాళ్లురప్పల్లో పడి తిరుగుతున్న తెలంగాణ ఆదివాసీలు చంద్రబాబును చూసి చప్పట్లు కొట్టారా..? ప్రజాజీవితంలో ఉన్నప్పుడు, ప్రజల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రతి మాటకూ కొంత విలువ ఉండాలి, తెలియకపోతే తెలుసుకోవాలి, లేకపోతే మూసుకోవాలి… కానీ ఇప్పటికీ ఈ ప్రాంతం మీద పడి బతుకుతూ ఈ ప్రాంతాన్నే కించపరచడం ఏమిటి..?! దీన్నే ‘‘తిన్న దగ్గరే డ్యాష్ డ్యాష్’’ అంటారు..!!
Share this Article