రామోజీరావు బాగా అన్యాయం చేశాడు ఒక చరిత్రకు..! ఇక ఎవరూ అధిరోహించలేని రికార్డుల ఎవరెస్టు శిఖరాన్ని తన ఈటీవీ సీరియల్ ఒకటి ఎక్కుతుంటే, మధ్యలోనే కాళ్లు విరగ్గొట్టి, ఇక చాల్లేఫో దిగిపొమ్మన్నాడు… ఏం సార్, మీకిది న్యాయమా..? మీ టీవీ సీరియలే కదా… అది ఇంకా ఎన్ని శిఖరాలు ఎక్కితే అన్ని పేరుప్రఖ్యాతులు మీవే కదా… ఐనా ఏమిటీ నిర్దయ..? క్రియేటివిటీని చంపేయడం న్యాయమేనా..? ఒక చరిత్రకు ముగింపు పలకడం సమంజసమేనా..? బాగాలేదు, ఏమాత్రం బాగాలేదు…
అప్పట్లో మీ పత్రికలో దాసరి అనే పేరు కనిపిస్తే ఊరుకునేవాడివి కాదు, దాసరి నారాయణరావు వార్త ఎవడైనా పబ్లిష్ చేస్తే వాడి కొలువు గోవిందా… ఉదయం పత్రికతో ఢీ సరేసరి… అలాంటి మీరు ఆ దాసరి కథతోనే, ఆ దాసరి ఫ్యామిలీ తీసే అభిషేకం సీరియల్‌కు చాన్స్ ఇచ్చారు… మీది పే-ద్ద హృదయం కాబట్టి ఆ నిర్ణయం… 2008లో స్టార్ట్ చేస్తే 14 ఏళ్లపాటు… అంటే 4 వేల ఎపిసోడ్లు నడిచింది…
అసలు ఒక కథను… ఎలా తోస్తే అలా… పద్నాలుగేళ్లపాటు సాగదీయడం అంటే అది ప్రపంచరికార్డు… ఏ భాషలోనూ సోప్ ఒపెరా కేటగిరీలో ఈ రేంజులో రికార్డున్నట్టు తెలియదు… ఇక భారతీయ భాషల్లో అభిషేకం సీరియల్‌ను అందుకోవడం ఇప్పట్లో ఎవరి వల్లా కాదు… అందరూ జీడిపాకం సాగదీత అని వెక్కిరిస్తుంటారు గానీ… తెలుగు టీవీ ప్రేక్షకుల అమాయకత్వం, అజ్ఞానం మీద అతి నమ్మకంతో 4 వేల ఎపిసోడ్లు ఒక సీరియల్ సాగదీయడం అంటే మామూలు విషయమా..? ఇక కార్తీకదీపం అనే మరో చెత్తా సీరియల్ మాత్రమే దీన్ని బీట్ చేయగలదేమో…
అసలు ఈ కథ ఎక్కడ స్టార్టయిందో ఎవడికీ తెలియదు… ఇష్టారాజ్యంగా కథ బొచ్చెడు మలుపులు తిరుగుతూనే ఉంటుంది… ఎవరెవరో నటీనటులు ఈ సీరియల్‌లోకి వచ్చి చేరుతుంటారు, మాయమై పోతుంటారు… ఇదొక కాంగ్రెస్ ప్రవాహం… చూసేవాడి ఖర్మ… చాలా చీప్ ప్రొడక్షన్ కాస్ట్… ప్రసారం చేసేది ఎవరికీ పెద్దగా పట్టని మధ్యాహ్నం టైమ్… ఏదో దిక్కుమాలిన యాడ్ రాకపోదు, డబ్బులు రాకపోవు… అంతే… అదొక్కటే లెక్క… ఇక సాగదీయలేం మహాప్రభో అని రచయితలు, డైరెక్టర్లు చేతులెత్తేసేంత స్థాయికి లాగారు దాన్ని…
ఐనాసరే, ఇంకాస్త ప్రయత్నించమని చెప్పి ఉండాల్సింది… ఏమో, ఏ రాజమౌళి వంటి దర్శకుడో దొరికి ఉంటే… మరో మూడునాలుగైదు ఏళ్లు అలవోకగా లాగించి, సాగదీసి ఉండేవాళ్లేమో… ప్చ్, ఎదిగే మీ బిడ్డను మీరే తొక్కేశారు రామోజీరావూ… ఒక చరిత్రకు అడ్డుపడ్డారు… అదేమో అసలే మహిళా ప్రేక్షకులు లంచ్, వంటల్లో బిజీగా ఉండే టైమ్… చూస్తే గీస్తే కేరాఫ్ అనసూయ, మనిసిచ్చిచూడు వంటి ఇతర చానెళ్ల సీరియళ్లు ఉండనే ఉన్నాయి… దాంతో…
Ads
ఈ అభిషేకం సీరియల్ చివరకు దిగీ దిగీ, చివరకు రేటింగుల్లో దయనీయమైన స్థాయికి జారిపోయింది… ప్రస్తుతం 1.1 నుంచి 1.3 రేటింగుల మధ్యలో ఉంటుంది… ఐతేనేం, అది ఎక్కుతున్న ఎపిసోడ్ల సంఖ్య రికార్డుతో పోలిస్తే ఇదెంత..? సుత్తెలతో కొట్టి, గన్నులతో బాది, ఇంకాస్త సాగదీత ప్రయత్నం జరిగేలా ఎంకరేజ్ చేస్తే మీ సొమ్మేం పోయింది..?
సోప్ ఒపెరా కేటగిరీ సీరియళ్లలో… అంటే కుటుంబబంధాలు, కలహాలు, వ్యక్తిగత సంబంధాలు, లైంగిక- వివాహ సమస్యలు, ఆస్తి గొడవలు, కుట్రలు, నైతిక ఘర్షణల కేటగిరీ సీరియళ్లలో…. ‘అభిషేకం’ సీరియల్ రికార్డు చాలామందికి నిజానికి తెలియదు ఇన్నాళ్లూ… ప్రజెంట్ జనరేషన్ మీ ఈటీవీ సీరియళ్ల జోలికే రారు… చూడరు… కానీ మీ ఈనాడు పత్రికలోనే రాసి, ఓహో, ఈ ఘనమైన సీరియల్ ఒకటి వస్తోందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు… ఇక ఈ సీరియల్‌కు ఈరోజుతో సెలవు అని కూడా మీరే రాసుకొచ్చారు… అవును సార్, చిన్న డౌటనుమానం, ఇన్నేళ్లు ఆ సీరియల్‌లో ఏమీ లేకపోయినా, చప్పిడి పథ్యంకూడు వంటి నిస్సారమైన ఎపిసోడ్లను ఎలా మోశారు..? ఇప్పుడు ఒకేసారి దానిమీద వైరాగ్యం ఎందుకొచ్చినట్టు..? వద్దులెండి, చెప్పకండి, మరో 4 వేల ఎపిసోడ్లు చెబుతారు…!!
Share this Article