వోకే… అభిజిత్ చెప్పినమాట వినడు… గేమ్స్ ఆడడు… టాస్కులు చేయడు… రెటమతం… తలబిరుసు… లాజిక్కులు తీస్తాడు… ఇంగ్లిషు నుంచి దిగడు… ఇవన్నీ సరే గానీ… ఢాంఢూం, గేట్లు ఓపెన్ చేసేయండి, అభిజిత్ బయటికి నడువ్, తమాషా అనుకున్నావా అని సీరియస్ అయిపోయిన నాగార్జున ఎందుకు తనే చల్లబడ్డాడు..? అభిజిత్ సినిమాటిక్ స్టయిల్లో మోకాళ్ల మీద కూర్చుని, చేతులు జోడించి, క్షమించండి అనేసరికి కరిగిపోయి, సరే, సరే, గేట్లు మూసేయండి అన్నాడా..? హహహ… ఉత్త షో… అభిజిత్‌ను బయటికి పంపించేంత సీన్ లేదు…
అలా నిజంగా పంపించేయాలీ అనుకుంటే, అంత సీన్ ఉండి ఉంటే… గ్రేవ్‌యార్డు-మోనాల్ డేటింగు చేయను అన్నప్పుడే బిగ్‌బాస్ రెడ్ కార్డు చూపించి, బయటికి పంపించేసేవాడు… పైగా అలా ప్రతి తప్పుకీ కంటెస్టెంట్లను బయటికి పంపించే పక్షంలో రెండో వారానికే హౌస్ ఖాళీ అవడం ఖాయం… సో, అదంతా తూచ్… గతంలో జాఫర్, బాబు ఆడ వేషాలు వేయడానికి ససేమిరా అన్నారు… ఏం చేయగలిగాడు బిగ్‌బాస్…? అగ్రిమెంట్ కాగితాలు చింపేసి, బయటికి పంపిస్తే, రెమ్యునరేషన్ గనుక నిలిపివేస్తే, అభిజిత్ గనుక కోర్టుకెక్కితే బిగ్‌బాస్ టీం పీక్కోలేక ఏడిచేది… లా పాయింట్లు అలాగే ఉంటయ్ మరి…
Ads
సరే, వాటికీ సిద్దపడి ఒకవేళ బిగ్‌బాస్ టీం అభిజిత్‌ను బయటికి పంపించాలని నిర్ణయించిందీ అనుకుందాం… పర్ డిబేట్ సేక్… ఎందుకంటే… మరీ గేమ్ ఏకపక్షంగా వెళ్తోంది… ప్రేక్షకులు కూడా అభిజితే విన్నర్ అని ఫిక్సయిపోతున్నారు… అందుకని కాస్త తోక కట్ చేద్దాం అనుకుని, నాగార్జునతో తిట్టించి… హారికతో జతచేసి మరీ తిట్టించి… కొంత బ్యాడ్ చేయాలని బిగ్‌బాస్ టీం ప్లాన్ చేసిందీ అనుకుందాం…
అది ముదిరితే ఏమయ్యేది..? గతంలో కౌశల్ విషయంలో ఇలాగే చేయబోయింది బిగ్‌బాస్ టీం… దాంతో హోస్టు నాని విపరీతమైన ట్రోలింగుకు గురికావల్సి వచ్చింది… ఆ దెబ్బకు నాని నేలమీదకు దిగిరావడమే కాదు, తరువాత సీజన్ చేయవయ్యా బాబూ, నువ్వు అడిగినంత చెల్లిస్తాం అని చెప్పినా సరే, మళ్లీ బిగ్‌బాస్ జోలికి రాలేదు తను…
పోనీ, నాగార్జున ఇవేమీ పట్టించుకోడు కాబట్టి… ఫరమ్గా ఉన్నాడూ అనుకుందాం… అప్పుడు అభిజిత్ ఫ్యాన్స్ ఏం చేయగలరు..? అనే ప్రశ్న వస్తుంది కదా సహజంగానే… వాళ్లు బిగ్‌బాస్ నిర్మాతలకు తీసుకురాగల నష్టం ఏముంది అనేది ప్రశ్న కదా… కాస్త ఆలోచిస్తే తేలింది ఏమిటయ్యా అంటే… ఎందుకు బిగ్‌బాస్ అంత దూకుడుగా వెళ్లదు, వెళ్లలేదు అంటే… బిగ్‌బాస్ చిలుక ప్రాణం హాట్‌స్టార్ యాప్‌లో ఉంది… అసలే ఓటీటీల మధ్య విపరీతమైన పోటీ ఉంది… ఈ స్థితిలో… ఇదుగో అభిజిత్ ఫ్యాన్స్ ఆ ఒడుపు తెలిసి ఒత్తడం స్టార్ట్ చేశారు ఇలా…
ఒరే నాన్నా… నువ్వు అనవసరంగా మా అభిజిత్‌కు కెలికి, బ్యాడ్ చేసి, టార్గెట్ చేసి, తిడితే… అడ్డుపడినా… బదనాం చేసినా… ఇక హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్లపై పడతాం చూసుకో అని అల్టిమేటం ఇవ్వడం మొదలుపెట్టారు… నిజమే, అది హాట్‌స్టార్‌కు నష్టదాయకమే… (వోటింగుకు, అన్‌సీన్ వీడియోలకు, ఎపిసోడ్ల స్ట్రీమింగుకు హాట్‌స్టారే వేదిక అని తెలుసు కదా…) సో, వెబ్ బేస్డ్ బిజినెస్ లింక్స్ ఉన్నప్పుడు… ఇదుగో ఇలా సున్నితంగానే ఉంటుంది యవ్వారం… అందుకే అందరూ కీలెరిగి వాతలు పెట్టడానికి ఎగబడుతూ ఉంటారు…
ఈ వెబ్ బిజినెస్ లింక్స్ గనుక లేనట్టయితే… నాగార్జున స్టూడియో ముందు ధర్నాలు చేసినా, బిగ్‌బాస్ టీంపై ధుమధుమలాడినా నష్టమేమీ ఉండదు… ఎటొచ్చీ ఇలా హాట్‌స్టార్‌తో లింక్ ఉండటంతో… నాగార్జున హాట్నెస్ కాస్తా చప్పున చల్లారింది… చల్లారాల్సిందే… బిగ్‌బాస్ టీమే చల్లారుస్తుంది… చల్లార్చింది…!!
నీకు కేవలం అభిజిత్‌కు అనుకూలంగా ఆడటం తప్ప ఇంకేమీ తెలియదా అని నాగ్ వెక్కిరించినందుకు… ఆ అపప్రథ పోగొట్టుకోవడానికి అన్నట్టుగా పాపం హారిక అభిజితను నామినేట్ చేసింది… ఇక్కడి దాకా వచ్చాక, పదే పదే తనను చీదరించుకునే అఖిల్‌తో ఇక తనకు కథేముంది అనుకుని మోనాల్ అఖిల్‌ను నామినేట్ చేసింది… ఈ స్టేజ్ దాకా వచ్చాక ఇక ఎవరి ఆట వాళ్లదే… త్యాగాలు, ప్రేమలు, కన్నీళ్లు, స్నేహాలు జాన్తా నై…
కానీ ఏమాటాకామాట… ఇప్పుడు హౌసులో ఉన్నది పాత మోనాల్ కాదు… స్టడీగా, ఫరమ్గా… తన గేమ్ తను ప్లే చేస్తూ… కొత్త షేడ్స్ చూపిస్తోంది… మధ్యలో ఎవరైనా సలహాలు ఇవ్వబోతే కూడా కస్సుమంటోంది… ముగ్గురు ‘A’ లను… అంటే అవినాష్, అభిజిత్, అఖిల్ లను నామినేట్ చేసి పారేసింది… ముగ్గురూ షాక్… అఖిల్, మోనాల్ చెబుతోంది… Play with heart, not with brain only… సో, రన్నరప్ ప్లేస్ కోసం అరియానా, మోనాల్ నడుమ పోటీ గట్టిగానే ఉండేట్టుగా ఉంది చూడబోతే…
హారిక, అఖిల్, అభిజిత్, మోనాల్, అవినాష్… ఈసారి నామినేషన్ల లో ఉన్నారు….
Share this Article