దక్షిణ భారతంలో పెద్దగా ఎవరికీ సావర్కర్ తెలియదు… ఈశాన్యం అస్సలు పట్టించుకోదు… మహారాష్ట్ర, దానికి ఎగువన ఉన్న ఒకటీరెండు రాష్ట్రాల కొన్ని ప్రాంతాల్లో సావర్కర్ పేరు పరిచయం… కానీ రాహుల్ గాంధీ కోటరీ పైత్యం పుణ్యమాని ఇప్పుడు సావర్కర్ పేరు దేశమంతా మోగుతోంది… మంచిగా కావచ్చు, చెడుగా కావచ్చు…
రాహుల్‌కు నిజంగానే ఏమీ తెలియదు… పరిణతి కూడిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆలోచనలు, అడుగులతో గైడ్ చేయాల్సిన తన సలహాదారుల కోటరీ తనను మరింత తప్పుదారిలో నడిపిస్తోంది… ‘‘నేను సావర్కర్‌ను కాను, గాంధీని, నేను క్షమాపణ చెప్పను’’ అనే వ్యాఖ్య చేసిన మంచికన్నా చెడే ఎక్కువ… గతించిన సమరయోధులపై బురద జల్లడం విజ్ఞత కూడా కాదు… అది రాహుల్ చేసినా అంతే, మోడీ చేసినా అంతే…
దేశంలో ఏ పార్టీ కూడా సావర్కర్ మీద రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని పట్టించుకోలేదు, స్పందించాల్సిన అవసరం లేదని మిన్నకున్నాయి… కానీ శరద్ పవార్ మాత్రం స్పందించి, కాస్త నోరు మూసుకోవయ్యా మనమడా అని రాహుల్‌ను మందలించాడు… కారణం, రాహుల్ మీద ప్రేమో, సావర్కర్ మీద ప్రేమో, రాహుల్ కాస్త పరిణతి ప్రదర్శిస్తే మంచిదనో భావనో కాదు… అది తన కింద మంట పెడుతూ, సెగ తగులుతోంది కాబట్టి…
Ads
మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే దెబ్బకు శివసేన నిలువునా చీలిపోయి, ఠాక్రే చీలిక బలం ఘోరంగా పడిపోయింది… సావర్కర్ మహారాష్ట్రీయుడు… మహారాష్ట్ర ప్రజల్లో ఆయన పట్ల ఓ సానుకూలత ఉంది… పదేళ్లపాటు అండమాన్‌లో కఠినమైన, దుస్సహమైన జైలుశిక్ష అనుభవించిన ఆయనకు గుర్తుగా పోర్ట్‌బ్లయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తన పేరే పెట్టారు కూడా… కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమూ తనను అవమానించడానికి పూనుకోలేదు… మొదటిసారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో తనను అవమానిస్తోంది… అది సహజంగానే కాంగ్రెస్ పట్ల మహారాష్ట్రలో వ్యతిరేకతకు దారితీస్తుంది…
కాంగ్రెస్‌తో జతకట్టి, ఇంకా అంటకాగుతున్న శరద్ పవార్ పార్టీకి కూడా రాహుల్ వ్యాఖ్యలు నష్టాన్ని కలగజేస్తాయి… అదీ శరద్ పవార్ అసంతృప్తి… అందుకే సావర్కర్ మీద కాస్త నోరు మూసుకో అంటున్నాడు… వెంటనే రాహుల్ సావర్కర్ మీద గతంలో చేసిన ట్వీట్ వ్యాఖ్యల్ని తొలగించాడు… ఇది ఒకరకంగా…. ‘‘సావర్కర్ లాగా క్షమాపణ చెప్పేవాడిని కాను అంటూనే సావర్కర్‌కే క్షమాపణ చెప్పినట్టు…’’
దాదాపు 17 యాంటీ-బీజేపీ పార్టీలు కలిసి లోకసభ స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తాయట… ఈ ప్రతిపక్ష ఐక్యత మంచిదే… కానీ దాంతో వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు… కొన్నాళ్లు పత్రికల్లో వార్తలకు, చర్చలకు ఆస్కారం… పైగా సుప్రీంకోర్టే గతంలో ‘శిక్ష పడిన నేరస్థులపై’’ తక్షణం వేటు వేయాలని చెప్పింది, చట్టం అదే చెబుతోంది, దొరికింది చాన్స్ అనుకుని స్పీకర్ అదే పనిచేశాడు… లీగల్‌గా, టెక్నికల్‌గా తను కరెక్టే… పొలిటికల్‌గా, నైతికంగా కరెక్టా కాదానేది పెద్ద చర్చ…
మొత్తానికి ఒక మంచి జరిగింది… కాంగ్రెస్, దాని కూటమి పక్షాలు ప్రధానంగా రాజకీయ తెర మీదకు వస్తున్నాయి… మూడో టెంటు ప్రయత్నాల్లో ఉన్న మమత, కేసీయార్, అఖిలేష్ ఎట్సెట్రా నేతలు వెనకబడిపోయారు… కాంగ్రెస్ బలంగా ఉండటం ఈ దేశ రాజకీయ, ప్రజాస్వామిక అవసరం… ఎటొచ్చీ రాహుల్ గాంధీ వంటి అపరిణత నేత దానికి నాయకుడు కావడం, కాదనలేని పార్టీ దారిద్ర్యం కూడా ఓ ప్రజాస్వామిక విషాదమే… అంతే…
Share this Article