Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కార్పొరేట్ లెక్కలంటేనే అనేక ఒకట్లు… తోడుగా బోలెడు రెండులు, మూడులు…

April 28, 2024 by M S R

అనేక ఒకట్ల జె ఈ ఈ!… లేపాక్షి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటో తరగతిలో మా ఈశ్వరమ్మ టీచర్ సరిగ్గానే చెప్పారు. కొట్టకుండా అల్లారుముద్దుగా అక్షరాలు నేర్పించారు. పలక మీద ఒకటి- రెండు- మూడు అంకెలు సరిగ్గానే దిద్దించారు. సముద్రంకంటే సహనంతో “కాకి ఒకటి నీళ్లకు కావు కావుమనుచు…”లాంటి బాలగేయాలన్నీ జీవితాంతం గుర్తుండేలా నోటికి నేర్పించారు. సిలబస్ లో లేకపోయినా…పెద్ద బాలశిక్షను ఒంటపట్టించారు. చదువుల ప్రపంచంలోకి ఆమె తెరిచిన ఒకటో తరగతి తలుపే తొలిగడప. తరువాత ఎన్నెన్ని విశ్వవిద్యాలయాల మెట్లెక్కినా…ఆమె వెలిగించిన విద్యా దీపానికి ఆ వెలుగులు కొనసాగింపులే.

నిన్న ఉదయాన్నే వ్యాయామం తరువాత తలుపు తీసి గుమ్మంలో న్యూస్ పేపర్లు తీసుకోబోతే ఒక చేయి చాలలేదు. మూడు తెలుగు, రెండు ఇంగ్లిష్ పత్రికలను రోజూ ఒక చేతి మునివేళ్లతో తీసుకునేవాడిని. జె ఈ ఈ ఫలితాల తరువాత రోజు కావడంతో ప్రకటనలు ఎక్కువై…పేజీలు పెరిగి…అన్నీ బరువెక్కాయి. మోయలేక పేపర్ల కట్టను ఇంట్లోకి మోసుకొచ్చి…పేజీలు తిప్పితే వార్తలు దేవతావస్త్రాలయ్యాయి. అన్నీ ప్రకటనలే.

ఒకటి-ఒకటి- ఒకటి
రెండు-రెండు- రెండు
మూడు-మూడు-మూడు
లాంటి అంకెలు, సంఖ్యలతో నిండి ఉన్న ప్రకటనలు ఎలా చదవాలో అర్థం కాలేదు. వయసువల్ల వచ్చిన కళ్లద్దాలు తుడుచుకుని…రెండోసారి చదివినా అయోమయం పెరిగిందే కానీ…కళ్లముందు అంకెల విలువ తెలిసిరాలేదు.

Ads

“ఈశానస్సర్వ విద్యానా మీశ్వర స్సర్వ భూతానాం …” అని మంత్రపుష్పంలో చెప్పినట్లు ఒకటో తరగతిలో మా ఈశ్వరమ్మ అంకెల విద్యను చాలా స్పష్టంగానే చెప్పారు. ఒకటి అంటే ఒకటే; ఒకటికి ఒకటి కలిపితే రెండు; ఒకటికి రెండు కలిపితే మూడు- అని వేనవేల సార్లు పలకమీద బలపంతో దిద్దించి…నేర్పించారు.

యాభై అయిదేళ్ల వయసులో పలకా బలపం పట్టుకుని మళ్లీ బడికి వెళ్లాల్సినట్లుంది నా పరిస్థితి. జె ఈ ఈ ప్రకటనల్లో ఒక ఒకటే అనేక ఒకట్లుగా, ఒక రెండే అనేక రెండ్లుగా, ఒక మూడే అనేక మూళ్లుగా మారడంతో నా ఒకటో తరగతి ఒకటి- రెండు-మూడు అంకెల ప్రాథమిక విద్య ఎందుకూ పనికిరానిదిగా తోస్తోంది. అది మా టీచర్ తప్పు కాదు. ఆమె చదువుల సరస్వతి. చక్కగానే చెప్పారు. మా మట్టి బుర్రలకే సరిగ్గా ఎక్కాలు ఎక్కలేదు. ప్రభుత్వ వీధిబడిలో ఆరుబయట తెలుగు మీడియం వానాకాలం చదువు. ఇప్పుడు నడుస్తున్నది ఎండాకాలం. మా వానాకాలం చదువు ఈ ఎండాకాలంలో కూడా పనిచేయాలనుకోవడం అత్యాశ అవుతుందేమో!

ఇప్పటికీ హిందూపురం వెళ్లిన ప్రతిసారీ మా ఈశ్వరమ్మ టీచర్ కాళ్లకు నమస్కారం పెట్టి…ఆమె ఆశీర్వచనం తీసుకుంటూ ఉంటాను. ఈసారి వెళ్లినప్పుడు…ఒక ఒకటి ఒకటి కాకుండా; కొన్ని ఒకట్లు కలవకుండా అనేక ఒకట్లుగానే ఉండిపోయే జె ఈ ఈ సంఖ్యాశాస్త్రం కొత్త లెక్కలు దిద్దించమని టీచర్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడాలి. ప్రకటనల్లో అంకెలను అర్థం చేసుకోవడానికి పలకా బలపం పట్టుకుని మళ్లీ బడికే వెళ్లాలి! ఆమె తప్పకుండా చెబుతారు. ఒకవేళ ఆమె చెప్పినా…నాకర్థం కాకపొతే నాకు దిక్కెవరు?

దేవుడికైనా నారాయణ జె ఈ ఈ చైతన్య మంత్రమే దిక్కేమో!

ఒక ఒకటి వేనవేల ఒకట్లుగా ప్రతిధ్వనించే జె ఈ ఈ ప్రకటనల్లో తమ పిల్లలు కూడా ఒకటి కావాలని తల్లిదండ్రులు ఏటా పెట్టే ఖర్చు ఎన్ని వేల కోట్ల అంకెలో లెక్కకట్టే ఎక్కాలు నేర్చుకోవాలి.
ఎల్ కె జి నుండి ఐ ఐ టి ఎండమావుల వెంట పడే మధ్యతరగతి పోగొట్టుకుంటున్న విలువైన జీవితాల విలువ ఎంతో లెక్కగట్టే గణితం నేర్చుకోవాలి.
వందలోపు ర్యాంక్ లో ఉండాలంటే చైతన్యరహిత మందలోనే ఉండాలనే గొడ్లచావిటి విద్యా సూత్రం లెక్కల కొత్త స్టెప్స్ నేర్చుకోవాలి.
హిమాలయమంత పదిలోపు అంకెల పక్కన తమ పిల్లలు పిపీలికాలై నిలుచున్న ప్రకటన ఫోటోలను చూసుకోవడానికి తల్లిదండ్రులు సర్వస్వం పోగొట్టుకునే సున్నా శూన్యవిలువను నేర్చుకోవాలి.
ర్యాంక్ రాని జీవితాలు తమను తాము రద్దు చేసుకోవడానికి జె ఈ ఈ మొదటిపేజీ ప్రకటనలు పోసే ఆజ్యం విలువ నేర్చుకోవాలి.
ఈ ర్యాంకుల లక్షల కోట్ల వ్యాపారం సామాజిక పతనానికి ఎలా కారణమవుతోందో తెలుసుకునే లెక్కలు నేర్చుకోవాలి… -పమిడికాల్వ మధుసూదన్             9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions