అక్కరకు రాని అంశాలెన్నింటి మీదో మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ సాగుతూ ఉంటుంది… ప్రత్యేకించి రాజకీయ అంశాలపై డిబేట్లు, వార్తలు, కథలు, కథనాలు, విశ్లేషణలు, మన బొంద, మన బోకె… అదొక క్షుద్రపూజ… ఇదుగో ఈ స్టోరీ ఓసారి చూడండి… ప్రజాశక్తి బ్యానర్ స్టోరీ… ఒక రోజంతా ఎదురు చూసినా, ఒక్కటంటే ఒక్కచోట దీని ప్రస్తావనో, చర్చో, విమర్శో, పోనీ, కనీసం అభినందనో కనిపించలేదు, వినిపించలేదు… నిజానికి మంచి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ, సంబంధిత జర్నలిస్టులకు అభినందనలు… హైదరాబాద్ లేదా అమరావతి బ్యూరోల్లో విద్యుత్తు సబ్జెక్టు చూసే రిపోర్టర్లు లేదా డెస్కుల్లో ఆ సబ్జెక్టు తెలిసిన సబ్ ఎడిటర్లు ఇంకాస్త కలగజేసుకుని, అదనపు విషయాలు జోడిస్తే ఇంకా బాగుండేదేమో స్టోరీ… నిజానికి ఇది ఇప్పుడు అవసరమున్న స్టోరీ కూడా… ఎందుకంటే..? మోడీ ప్రభుత్వం కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నది… విద్యుత్తు సంస్కరణలకు సంబంధించి..! అవి అమలు చేయకపోతే రాష్ట్రాల రుణపరిమితులకు కత్తెర పెడతామనీ చెబుతున్నది… ప్రత్యేకించి వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టడం మీద రైతాంగంలో ఆందోళన ఉంది… డిస్కమ్స్ ప్రైవేటీకరణ వంటి ముఖ్యాంశాలూ ఉన్నయ్… ఓసారి ఇక ఈ స్టోరీ పాయింట్లలోకి వద్దాం…
శ్రీకాకుళం జిల్లా… అన్ని పంపుసెట్లకూ మీటర్లు పెట్టేశారు… అంతే కాదు, నెలవారీ బిల్లులు ప్రిపేర్ చేస్తున్నారు, రైతులకు మెసేజులు పెడుతున్నారు… యూనిట్‌కు 6.40 చొప్పున లెక్కిస్తున్నారు… వైఎస్ హయాంలో అమలు ప్రారంభించిన ఉచిత వ్యవసాయ విద్యుత్తు విషయంలో జగన్ కూడా వెనుకకు వెళ్లే ప్రమాదం ఏమీ లేదు ఇప్పట్లో… ఈ బిల్లులేమీ రైతుల నుంచి వసూలు చేయడం లేదు కూడా… ఇదుగో నువ్వు ఈ నెలలో ఇంత వ్యవసాయ విద్యుత్తు వాడుకున్నవ్, ఆ బిల్లు ప్రభుత్వం కడుతోంది అనే స్పృహను ఎప్పటికప్పుడు రైతుల్లో తట్టిలేపడం… ఐతే ఇలా ఎన్నాళ్లు..? ఎందుకు..? తదుపరి దశలో ఏం చేస్తారు..? అసలే ప్రధాని మోడీ ‘‘ఉచితాల వ్యతిరేకి’’ అంటుంటారు కదా… ఇప్పుడు ఉత్తుత్తి బిల్లులు మాత్రమే ఇస్తున్నారు, వసూలు చేయడం లేదు సరే, కానీ రేప్పొద్దున ఏమిటి..? దీనికి జవాబు చెప్పేవాళ్లు లేరు…
Ads
ఇంకాస్త లోతుకు వెళ్దాం… పరిశ్రమలకు విద్యుత్తు ధర 6.70, వాణిజ్య సంస్థలకు విద్యుత్తు ధర 6.90… వ్యవసాయ విద్యుత్తు ధర 6.40… అంటే దాదాపుగా వ్యవసాయాన్ని కూడా వాణిజ్యం కేటగిరీలో లెక్కిస్తున్నారు మహానుభావులు..? అయితే..? ఈ ధరను ఖరారు చేసిందెవరు..? రెగ్యులేటరీ కమిషన్ ఫిక్స్ చేసిందా..? ఎప్పుడు..? దీనికీ జవాబు దొరకడం లేదు… ఒక డిస్కమ్ తను సప్లయ్ చేసే విద్యుత్తుకు అన్నిరకాల ఖర్చులూ లెక్కేసుకుని… ఇది మాత్రమే తాను అమ్మగలిగే రేటు అని చెబుతుందీ అనుకుందాం… అదే రేటును వ్యవసాయ విద్యుత్తుకూ అప్లయ్ చేస్తున్నారూ అనుకుందాం… మరిక రాబోయే రోజుల్లో క్రాస్ సబ్సిడీలు ఉండవా..? అంటే… ఎక్కువ చెల్లించగలిగిన కేటగిరీలు కొంతమేరకు తక్కువ చెల్లించగలిగే కేటగిరీలకు ఇచ్చే సబ్సిడీ అన్నమాట… ధనికులు పేదలకు ఇవ్వడం..! ఒకవేళ క్రాస్ సబ్సిడీలను ఎత్తిపారేస్తారు అనే సందేహాలే నిజమయ్యే పక్షంలో… 100, 200 యూనిట్లు మాత్రమే వాడుకునే పేదల మాటేమిటి..? యావరేజీ కాస్ట్ ఆఫ్ సప్లయ్… అంటే విద్యుత్తు సగటు కొనుగోలు ధర ప్లస్ ఉద్యోగుల జీతాలు ప్లస్ సాంకేతిక నష్టాలు లెక్కతీస్తే వచ్చే అంతిమ రేటు… ఈ సగటు విద్యుత్తు సరఫరా రేటును అన్ని కేటగిరీలకూ ఒకేతరహాలో వసూలు చేస్తారా..? ఈ ప్రశ్నలకు, ఈ సందేహాలకు జవాబులు చెప్పే బాధ్యత మంత్రిత్వ శాఖో, రెగ్యులేటరీ కమిషనో ఫీలవుతున్నాయా అసలు..?!
Share this Article