ఆమె పేరు అనురాధ చౌధరి… రాజస్థాన్ స్వరాష్ట్రం… ఎంబీఏ చేసింది… బ్యాంకింగ్ సెక్టార్‌లో కొలువు చేసింది… అప్పుడే మనీ లాండరింగ్‌కు పాల్పడింది… కొలువు ఊడింది, జైలు పాలైంది… ఒక్కసారి జైలుకు వెళ్లొచ్చాక మరింత రాటుదేలతారు కదా నేరస్థులు… అంతే, ఆమె కూడా అంతే… అదే రాజస్థాన్‌కు చెందిన ఆనందపాల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో చేతులు కలిపింది…
తనూ గ్యాంగ్ స్టర్ అయిపోయింది… ఆనందపాల్ 2017లో ఎన్‌కౌంటర్ అయిపోయాడు… నిజానికి ఆమెకు 2007లోనే ఓసారి వివాహమైంది… మొదటి భర్త పేరు దీపక్ మింజ్… భర్త పేరులో మింజ్ తరువాత కూడా కొనసాగింది ఆమెకు… అందుకే ఆమెను మేడమ్ మింజ్ అని పిలిచేవాళ్లు… మనీలాండరింగ్, కిడ్నాప్, బెదిరింపులు వంటి చాలా కేసులున్నయ్ ఆమె మీద… రాజస్థాన్ మాత్రమే గాకుండా ఢిల్లీలోనూ కేసులున్నయ్… ఇదీ ఆమె సంగతి…
గ్యాంగుల్లో తిరిగే ఓ ఫ్రెండ్ ద్వారా తనకు సందీప్ జంఝారియా అలియాస్ కాలా జతేదీ పరిచయమయ్యాడు… తను ఇంకా నొటోరియస్… ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ తను… లారెన్స్ బిష్ణోయ్ అనే పెద్ద గ్యాంగ్‌స్టర్‌కు సందీప్ సన్నిహితుడు… తనపై దోపిడీలు, హత్యలు, హత్యాప్రయత్నాలు కేసులున్నయ్… ఇది తన సంగతి…
Ads
ఇద్దరూ నాకు నువ్వు- నీకు నేను అనుకుంటూ ప్రేమలో పడిపోయారు… ఎంచక్కా ఇద్దరమూ కలిసి నాలుగు బ్లాక్ మెయిలింగులు, నాలుగు కిడ్నాపులతో నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చునని అనుకున్నారు… కలిసి తిరిగేవాళ్లు.,. పోలీసులకు చిక్కేవారు కాదు… కానీ 2021లో ఓ దాబా దగ్గర ఢిల్లీ పోలీసులకు దొరికిపోయారు… జైలులో పారేశారు ఇద్దరినీ…
కొన్నాళ్లకు ఆమెకు బెయిల్ దొరికింది… కానీ సందీప్‌కు బెయిల్ రాలేదు, తన మీద కేసుల తీవ్రత ఎక్కువ… ఈ కేసులు, విచారణలు జరుగుతూనే ఉంటాయిలే అనుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు… కానీ ఈమె బయట, తను లోపల… ఎలా..? సందీప్ పోలీసులకు చెబితే, పోలీసులు కోర్టుకు చెబితే కోర్టు వోకే అన్నది… పెరోల్ వచ్చింది… కానీ ఆరు గంటల పెరోల్ మాత్రమే, అంటే పెళ్లయ్యేవరకు మాత్రమే…
సందీప్ తరఫు లాయరే ఢిల్లీలోని ఓ ఫంక్షన్ హాల్ మాట్లాడాడు… కానీ సందీప్ నొటోరియస్, గతంలో ఓసారి హర్యానా పోలీసుల నుంచి తప్పించుకున్న ట్రాక్ రికార్డు ఉంది… మరి ఇప్పుడు పెరోల్ మీద బయటికి వచ్చాడు కదా, ఈ జంట అక్కడి నుంచి తప్పించుకుపోతే మళ్లీ దొరకడం ఎలా.,.? అందుకని ఆ ఫంక్షన్ హాల్ దగ్గర ఫుల్ బందోబస్తు పెట్టారు… డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, డ్రోన్లు… అబ్బో, ఓ సెలబ్రిటీ పెళ్లికి కూడా ఇంత బందోబస్తు ఉండదు, ఒక బెటాలియన్ ప్రత్యేక పోలీసు బలగాలను మొహరించారు…
నో మ్యూజిక్, నో ఫోన్స్.,. గెస్టు లిస్టును నిశితంగా పరిశీలించి, పోలీసులే కొన్ని మార్పులు చేశారు, ఎడిట్ చేశారు… 150 మందికి పరిమితం చేశారు… అందరూ ఐడీ కార్డులు చూపించాకే హాలులో ఎంట్రీకి పర్మిషన్… కొందరు దగ్గరి బంధువుల్ని కూడా అనుమతించలేదు… ఆ పరిసరాల్లోని షాపుల్ని సాయంత్రం 5 గంటలకే క్లోజ్ చేయించారు.,. పరిసరాల్లోని భవనాలపైనా నిఘా కెమెరాలు పెట్టారు… పెళ్లిలో రకరకాల స్టార్టర్లు, నాలుగైదు రకాల స్వీట్లు, దోశ, చాట్ కౌంటర్లు, హంగామా… ఇదీ ఆ పెళ్లి కథ… ఈ కథలోని నీతి ఏమిటి..? మీ ఇష్టం…!!
Share this Article