చింతపలుక పండు.. ఓ యాది
~~~~~~~~~~~~~~~~~~~~~
చింతపలుక పండు, నాకు మాలెస్స పీర్తి గలిగిన పండు.
ఒక్కసారి పదితినుమన్నా వద్దనకుంట ముద్దుగ తినుడే.
మంచిపండ్లు ఐదారు తింటేజాలు నిషా వచ్చినట్టయితది.
కని, మనకు పదితిన్నాసరే పరిగడుపుతోటి ఉన్నట్టే ఉంటది.
ఇష్టంలో దీనికి మరోపండు ఏనాటికీ అస్సలు సాటిరానేరాదు.
మాది నికార్సుగ గుట్టలుబోర్లు వాగులువొర్రెల రాజ్జముగదా.
ఏడవడితాడ అడుగడుక్కు చింతపలుక వనం మస్తుగుంటది.
ఇంటిముంగట ఇంటెనుక పక్కలకు సూరుకింద చేదబాయికాడ
కొట్టాలకాడ, రాళ్లగోడలపొంటి, బండ్లబాటలపొంటి,రోడుపొంటి
రొడ్డాములకాడ, రాపుల కాడ, వొర్రెల పొడుగూత అంతటా చెట్లే.
చేనుకాడ గెట్లమీద, వందురుపొలాలకాడ, బండలనిండా వనమే.
ఇది సాలదన్నట్టు గుట్టలమీద దొనెదొనెకు గనెగనెకు మస్తు చెట్లు.
రెండునెళ్ల పొద్దు తినితిని యాష్టకువచ్చేటన్ని చింతవల్కాయలు.
మా ఇంటెనుక పెద్దపెద్దగ వృక్షాలంతచెట్టు ఓ పదిగాల ఉండేటియి.
మా ఊరుచుట్టూ కుంటలే. చేదబాయిలనీళ్లు చేతికి అందుతుండే.
మావాడకట్టు వాలుకువున్న తడిగల్లజాగ గనుక,ముంతంత కాయ.
ఒక్కోకాయ దోసిట్ల పట్టనంత పెద్దది. గవ్వలకన్న పెద్దపెద్ద పుచ్చలు.
చెట్టుమీదనే గుడ్లుదెరిచి పట్టన పలిగినంక చిక్కేమేసి తెంపుదుము.
మామూలుగ చెట్టుమీద పండు రుచి అంటరు. కానీ అదిగాదు కథ.
ఇయ్యాల పొద్దునదెంపుతే రేపుమాపుకు బురబుర పండేదే బౌతీపి.
కంటికినచ్చిన ఇసొంటి పండ్లు ఏరుకుంట తిని పెరిగిన బాల్యమిది.
ఇంటెనుక పండ్లే మా ఇల్లందరికి తింటె దంగనంత పెద్దసముద్రము.
చేనుకాడ బండబండకు బోరుబోరుకు మస్తుచెట్లు ఉండుడేనాయె.
అయినగుడ నేను, చేనుకాడ నీటిసరిసెకు గింజలువోసి చెట్లువెట్టిన.
చింతపలుక పండ్లంటే అంతపీర్తి మరి. కంటికి నచ్చిన పండే కావాలె.
గువ్వం లేని బక్కపీసు పత్తిగింజల కాయలు మురికిసూచుడే లేదు.
బకాసురుని లెక్క బండెడుకాయలు తిన్నసరే మల్ల దివిలె ఎల్లినంక
బండబండకు కొమ్మకొమ్మకు వెతికి గొట్టెకాయలు ఏరుకచ్చుకునేది.
గొట్టెకాయలకు రెండుమూడేగింజలు, మిగిలిందంత గువ్వమేగదా.
ఇంటికాడిచెట్లు ఎక్కి కొనగొమ్మలు విరిగి కిందబడ్డ రోజులున్నయి.
గుట్టలుబోర్లు తిరిగి బండలు ఎక్కి జారిపడి, మోకాల్లు పల్గిన సరే,
రెండుగాళ్లకు ఏడెముండ్లు కుచ్చంగ, ఉత్తరేణికంకులు చీరుకపోంగ
జంగవిల్లులు మీదికెల్లి దునుకంగ, కొండ్రిగాళ్లు బెదిరియ్యంగ సుత
సొనికెసొనికె తిరిగినోణ్ణి. ఇగ కంటితీగెలు కుడితె భయపడుతనా ?
అంబటాళ్లపూట చిట్టెండకు నిలువెడుగడ్డిల దయ్యమోలె తిరిగేది.
ఎక్కడ తెంపిన కాయలు అక్కడనే ఓపక్క మరుగున దాచివచ్ఛేది.
మల్ల రెండ్రోజులకువొయి చెత్తపక్కకుతీసి చూస్తే అన్ని పండుతుండె.
గంపెడుకాయ ఏమితింటం ? కనుక మల్లదాంట్ల మేలిమి ఎంపికలు.
ఎవరో తెంపి మాగేసుకున్న కాయల పుట్టిముంచుట్లగుడ ఘనుడనే.
పిసినారి మేనమామ (మేనత్త భర్త) తావులు నేను భలే దోచేవాడిని.
ఒక్కొక్కసారి మనం దాచిన ధనం కూడా మందిపాలవుతుండె మరి.
కొన్నిసార్లయితె దొంగతిండి దబదబతినుకుంట గింజలను మింగేది.
అవి బయటికి ఎల్లిపోయెదాక మల్ల అదో పెద్దభయం..ఎన్ని కథలో.
పెద్దబడికి పొరుగూరుకు పోవుడాయె. పోంగరాంగ తొవ్వొంటి ఉన్న
రాళ్లగోడల పొన్న చింతపలుకచెట్లన్నీ వెతికి తెల్లవడ్డకాయలుదెంపి
అటోయిటో జెరంత పక్కకు చిక్కగ పెరిగిన చిలుకముక్కి చెట్టకింద
పోద్దుము. కొన్నిసార్లు మనం బోసినతావు మనకే దొర్కక పోతుండె.
కాయలు మాగేసుడు కాడ మాదోస్తులమధ్యనే కొట్లాటలు ఔతుండే.
ఇవి చాలనట్టుగ పెద్దబతుకమ్మకు తంగేడు పువ్వుకు గుట్టకువొయి
నరునికన్ను, పువ్వుసగం చింతపలుక కాయలు సగం మోసుకచ్చేది.
బడికి బతుకమ్మ సెలవులు వచ్చీ, సత్తుపిండి తిండి ఎక్కవయిగుడ
ఎక్కడికాయలు అక్కడనే పండియెండి నల్లగ మాడి మసిబొగ్గయేవి.
పుచ్చెలన్ని ముందే ఒలిచేసి బోడపండు చేసుకోని తినుడు ఓ ఆట.
ఇంట్ల పెద్దపుచ్చలపంఢ్లు తినెటపుడు చెంచాతో గీక్కతినుడు మజా.
బురబురపండిన పుచ్చలను బుర్రుర్రుమని జుర్రుడు ఎంతకమ్మగనో.
ఎట్లదిన్న, ఎన్నిదిన్న ,ఇగజాలు అని అనిపించని పండు ఇదొక్కటే..!
చింతవలుక పండుతోటి.. గింత పసందైన సోపతి, గిన్నేండ్ల సోపతి.
ఇంతబతుకు బతికి ఇంటెనుక సచ్చినట్టు ఇదంత గడిచినముచ్చట.
ఇప్పుడు నాకు చింతపలుకపండంటే కొనుక్కతినుడు ఒక్కటే దారి.
నిరుడుమొయ్యేడుసంది పానం జిలజిలమనే రోజులు ఎదురాయె.
పీర్తికొద్ది పండు మధ్యలకు చుంచుతెజాలు. లోపలన్ని లుకలుకలు.
కంటితోటి చూడంగనే కడుపుల దేవినట్టు గావట్టే. మరుపురాదుగద
అందుకే ఇగ పురాతనే కొనుడు బందుజేసిన. తినుడు బందుజేసిన.
నీకూ నాకూ పానాపానం అనుకున్న పండు మనది కాకుండవాయె.
ఏం జేస్తం. ఎన్నిజూస్తె ఎన్నిరోస్తె మనిషి జన్మకు పొద్దుకుతది గనుక.
ఎన్నీల ఎలుతురు కొన్నిరోజులు.. ! అమాసచీకటి కొన్నిరోజులు…!!
~•~•~•~•~•~•~
ఇది… నాకు నచ్చిన పండు – నా పండువెనుకున్న చరిత్ర.
నేను అన్న పేరేనాదిగని… ఈ యాది, నా తరంల ప్రతివొక్కరిది.
~డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article
Ads