ఈ ప్లాటినం లవ్ బ్యాండ్ కొనండి! విరిగిన మనసులకు అతుకు పెట్టుకోండి!
——————-
కేవలం ఫిబ్రవరి పద్నాలుగు బతికి బట్టకట్టడం వల్ల- లోకంలో ప్రేమ బతకగలుగుతోంది. పోయిన పెద్దలను తలుచుకునే ఆ రోజే తద్- దినం తద్దినం. పోయినవారికి ఒక రోజే తద్దినం. పోకుండా ఉన్నవారికి ఎన్నెన్నో తద్దినాలు. థాంక్స్ గివింగ్ తద్దినం. నో ప్యాంట్స్ తద్దినం. నో టాప్ తద్దినం. ఇలా ఎన్నో దినాలు. వాటిలో ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినం కూడా ఒకటి. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది- అన్న మాటలో ఏదో నిందార్థం, అన్వయ దోషముంది అని అంతర్జాతీయ శునక సంఘాల సమాఖ్యకు మొదటి నుండి అనుమానంగా ఉంది. ఇది సోమవారం, థాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే లాంటి తిథి వార నక్షత్రాల ప్రస్తావన సాధారణంగా కుక్కలకు ఉండదు. ప్రతి కుక్కకూ ప్రతి రోజూ వస్తూనే ఉంటుంది- అని సామెతను తిరగరాయాలన్న శునక సమాఖ్య డిమాండు అర్థం చేసుకోదగ్గదే! అయినా మన గొడవ కుక్కల దినం గురించి కాదు. వాలెంటైన్స్ డే అనబడే ప్రేమ దినం లేదా ప్రేమికుల దినం గురించి.
“అవిసె పూవులు రెండు అందకున్నవి నాకు- వచ్చి నా సిగలోన తురిమిపోదువు కానీ!
రావోయి బంగారి మావా!
నీతోటి రాహస్యమొకటున్నదోయి!”
Ads
అని వెనకటికి ఘంటసాల ప్రయివేటు సాంగులో ప్రేయసి అవిసె పూవులు అందడం లేదన్న సాకుతో ప్రియుడిని పరోక్షంగా పిలిచింది. ఇంతా చేసి ఆ ప్రియుడు చెంతకు వస్తే ఆ ప్రేయసి ఏమి మాట్లాడిందన్నది రహస్యం. ఘంటసాల మనకు చెప్పలేదు. మనం అడగకూడదు. అడిగినా ఘంటసాల చెప్పడు. పొలం గట్టు మీద అవిసె చెట్ల చెంత ఏకాంతంలో వారి ప్రేమ ప్రేమకే పులకింత. తుళ్లింత. కవ్వింత. ప్రియుడిని ఆమె అడిగిన అపురూపమయిన బహుమతి అందని రెండు అవిసె పూలు కోసి, సిగలో తురమమని. ఎప్పుడో అరవై ఏళ్ల కిందటి ప్రేమలు. వ్యక్తీకరణలు. గ్రామీణ వ్యావసాయిక ప్రతీకలు. ఇప్పుడు కాలం మారింది. ట్రెండు మారింది. స్పీడు పెరిగింది. తొక్కలో అవిసె పూలకు విలువేముంది?
——————–
ఫిబ్రవరి నెల మొత్తం చెదిరిన ప్రేమలకు మళ్లీ అతుకులు పెట్టుకోవడానికి, విరిగిన మనసులకు ఫెవికాల్ పూసి మళ్లీ అతికించుకోవడానికి, పగిలిన గుండెలకు ప్లాస్టిక్ సర్జరీలు చేసి మళ్లీ ప్రేమ రక్తం ఎక్కించడానికి అనువైన మాసమట. ఒకే చూరు కింద ఉంటూ వేరు వేరుగా పగల పొగల సెగలతో రగిలిపోయే ప్రేయసీ ప్రియులయినా, భార్యాభర్తలయినా ఫిబ్రవరి ప్రేమ మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో ఒక నగల కంపెనీవాడు కళ్లు తెరిపించేలా చక్కటి తెలుగులో తాటికాయంత అక్షరాలతో మొదటిపేజీ ప్రకటనలిచ్చాడు. ఒక వజ్రాలు పొదిగిన ప్లాటినం బ్రేస్లెట్ కొని ప్రేయసి/భార్య చేతికి తొడగాలట. దాంతో పుష్కర కాలంగా ఉత్తర దక్షిణంగా మాటలే లేని మనసుల్లో ప్రేమ పురులు విప్పి నాట్యమాడి మనసులు మమతలతో గట్టిగా ముడిపడతాయట. బ్రేస్లెట్ చూడగానే ముందెన్నడూ చూడని ప్రేమాభిమానాలు పొంగి పరవళ్లు తొక్కి అలుగుపారుతుందట.
టాటా వారి తనిష్క్ నగల ప్రకటన కూడా దాదాపు ఇదే అర్థంతో ఉంది. కాకపోతే కొంచెం సంసార పక్షంగా.
నిజానికి ప్లాటినం బ్రేస్లెట్ వాడు విరిగిన మనసులను అతికించబోయి- ఆధునిక మహిళను ఘోరంగా అవమానిస్తున్నాడు. ఒకే చూరు కింద మాటల్లేకుండా మౌనంగా ఉన్న మహిళ మనసులో ఏముందో ప్లాటినమ్ కు ఏమి తెలుసు? బ్రేస్లెట్ బిస్కట్ వేయగానే- ఆమె గతం మరచి వచ్చి ఒళ్లో వాలుతుందా? ప్రేమికుల దినం రోజు మహిళను అభిమానిస్తున్నామా? అవమానిస్తున్నామా?
అప్పటి ప్రేమల్లో అవిసె పువ్వు- వజ్రం కంటే ఎక్కువ.
ఇప్పటి ప్రేమల్లో వజ్రం- అవిసె పువ్వు కంటే తక్కువ………………….. By…. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article