.
ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ‘హీరో’… ఆయన పేరు సేతుపతి…
…‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..’ అని వేటూరి రాసిన పాట ఒక్కోసారి నిజంగానే నిజమవుతుంది. ఎవరెవరో ఎందుకో కలుసుకొని, మరెందుకో విడిపోతారు. ఆ తర్వాత మరెవరో దూరంగా ఉండేవాళ్లు దగ్గరై, ఒకటవుతారు. అలాంటి కథే ఇది. ఇద్దరు హీరోయిన్లను ప్రేమించిన ఓ హీరో కథ. తమిళ వాళ్లకి ఈ కథ కొంత తెలుసు. అయితే తెలుగువారికి ఈ కథ పూర్తిగా కొత్తదే!
Ads
మనకు ఒకప్పుడు వెంకటగిరి, విజయనగరం రాజులు ఉన్నట్లే, తమిళనాడులోని రామనాథపురం/రామనాథ్ సంస్థానానికి రాజులు ఉండేవారు. అందులో చివరి రాజు షణ్ముఖ రాజేశ్వర సేతుపతి. వందల ఎకరాల భూములకు వారి కుటుంబం యజమానులు. తమిళనాడులోని అనేక గుళ్లకు వాళ్లే ధర్మకర్తలు.
1927లో ఆయన రాజుగా అధికార బాధ్యతలు పొంది, స్వాతంత్ర్యం వచ్చేదాకా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 1967లో మరణించారు.
ఆయన రాజు కాబట్టి ఆయనకు ఒకరికి మించిన భార్యలు ఉన్నారు. అందులో ఒకరు లీలారాణి. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఒకరు లత, మరొకరు రాజ్‌కుమార్ సేతుపతి. ఈ లతనే తమిళనాడులో ‘ఎంజీఆర్ లత’ అంటారు. తమిళ స్టార్ హీరో ఎంజీఆర్‌తో కలిసి ఆమె చాలా సినిమాల్లో నటించారు. చాలా పేరున్న నటి.
తెలుగులో అక్కినేని ‘అందాలరాముడు’ సినిమాలో ఆమే హీరోయిన్. ఆ తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించారు. ‘ఇది కథ కాదు’, ‘ఈనాటి రామాయణం’ లాంటి తెలుగు సీరియల్స్ చాలా చేశారు. ఆ మధ్య ‘అలీతో సరదాగా’ షోలో కూడా ఆమె పాల్గొన్నారు. లీలారాణి మూలాలు కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురానివి కావడంతో లతకు తెలుగు బాగా వచ్చు.
లత 1975 తర్వాత తమిళంలో చాలా పాపులర్ హీరోయిన్ అయ్యారు. ఆ సమయంలో ఆమె తమ్ముడు రాజ్‌కుమార్ ఇంకా కాలేజీలో చదువుతున్నాడు. చూసేందుకు కమల్‌హాసన్‌లా అందంగా ఉండే రాజ్‌కుమార్‌ని హీరో చేయాలని చాలామంది నిర్మాతలు ప్రయత్నించారు. అయితే తల్లి లీలారాణి మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
చదువు పూర్తయిన తర్వాతే సినిమాలు అని ఖరాఖండీగా చెప్పేసింది. అలా 1981లో ‘శూలం’ అనే తమిళ సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌కుమార్ చేసిన సినిమాలు బాగా ఆడుతుండటంతో ఆయనకు తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలైంది. తెలుగులో రాజ్‌కుమార్ ‘జగమొండి’, ‘మానసవీణ’ అనే సినిమాలు చేశారు.
తమిళంలో సినిమాలు చేస్తున్న సమయంలో హీరోయిన్ స్వప్నతో ఆయనకు పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ కలిసి చాలా తమిళ, మలయాళ సినిమాలు చేశారు. తెలుగులో ‘సంసారం ఒక సంగీతం’, ‘కథానాయకుడు’, ‘స్వప్న’, ‘ప్రియ’, ‘కోకిలమ్మ’ లాంటి చాలా సినిమాల్లో స్వప్న నటించారు.
‘టిక్ టిక్ టిక్’ సినిమాలో కూడా ఆమెను గుర్తుపట్టొచ్చు. సినిమాలు కలిసి చేస్తున్న క్రమంలో రాజ్‌కుమార్, స్వప్న మధ్య ప్రేమ పుట్టింది. అది పెళ్లి దాకా చేరేదే, కానీ మధ్యలో హిందీ పరిశ్రమ వారిని దూరం చేసింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే స్వప్న హిందీ సినిమాల వైపు వెళ్లారు. 1983 నుంచి మొదలుపెట్టి హిందీలో చాలా సినిమాలు చేశారు. అక్కడున్న అగ్రనటుల సరసన నటించడంతో చెన్నై రావడం, రాజ్‌కుమార్‌ని కలవడం అరుదుగా మారింది.
దీంతో వారి మధ్య ప్రేమ మెల్లగా తగ్గిపోయింది. ఆ విషయాన్ని గుర్తించి, సామరస్యంగా విడిపోతే సమస్య లేదు. అయితే అక్కడే మరో గందరగోళం నెలకొంది. ‘నేను హిందీలో పెద్ద స్టార్ అయ్యాను. చాలామందితో నాకు పరిచయం ఏర్పడింది. నేనింకా చాలా ఎత్తుకు ఎదగాలి. మన ప్రేమ నా కెరీర్‌కి అడ్డుపడుతుంది. కాబట్టి నేను నీతో ఉండలేను’ అని స్వప్న రాజ్‌కుమార్‌తో చెప్పినట్లు సమాచారం.
రాజ్‌కుమార్ ఆ వయసులోనే పరిపక్వంగా ప్రవర్తించారు. ఆమెను ద్వేషించకుండా, ప్రేమించాల్సిందే అని ఒత్తిడి చేయకుండా తన ప్రేమను వదులుకున్నారు. కొందరికి చాలా చిన్న వయసులోనే ఆ పరిపక్వత సాధ్యపడుతుంది.
ఆ తర్వాత ఆయన మెల్లగా సినిమాలు తగ్గించి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. ఆయన పట్టిందల్లా బంగారమైంది. ఆయన కుటుంబానికున్న పేరు కలిసొచ్చింది. కోట్లలో లాభాలు తెచ్చిపెట్టింది. ఆ సమయంలోనే ఒక న్యూఇయర్‌కి ఆయన పార్టీ ఏర్పాటు చేశారు.
దానికి నటి, దర్శకురాలు శ్రీప్రియ వచ్చారు. శ్రీప్రియ అప్పటికే తమిళంలో చాలా ఫేమస్ నటి. తెలుగులో కూడా ‘చిలకమ్మ చెప్పింది’, ‘వయసు పిలిచింది’, ‘పొట్టేలు పున్నమ్మ’ లాంటి చాలా సినిమాలు చేశారు. మెల్లగా రాజ్‌కుమార్‌తో ఆమె పరిచయం పెరిగి, వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
వారిద్దరూ 1988లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. రాజ్‌కుమార్ నిర్మాతగా మారి తమిళంలో ‘మాలిని 22 పాలయంకోట్టై’ (తెలుగులో ‘ఘటన’), తెలుగులో సురేశ్‌బాబుతో కలిసి ‘దృశ్యం’, ‘దృశ్యం 2’, తమిళంలో ‘పాపనాశం’ (‘దృశ్యం’ తమిళం వెర్షన్) తీశారు. ఈ సినిమాలన్నింటికీ శ్రీప్రియే దర్శకురాలు.
రాజ్‌కుమార్ కుటుంబం కొన్ని ఆలయాలకు ధర్మకర్తలుగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురం సుంకులమ్మ గుడిలో మొదటిపూజ ఇవాళ్టికీ వారిదే. చాలాసార్లు ఆయన కుటుంబసమేతంగా అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు.
ఆయన ఏది పట్టినా బంగారమవుతుందని, ఆయన చేత్తో డబ్బులిస్తే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. ఆయన కూడా అనేక ఆలయాలకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు దానధర్మాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత కాలంలో నటి స్వప్న నిర్మాత అనిల్ శర్మను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అందరూ ఎవరి జీవితాల్లో వాళ్లు ఆనందంగా ఉన్నారు. ప్రేమ వైఫల్యాలంటూ ఆవేశపడకుండా, పరిపక్వంగా ఆలోచించినందుకు ఇవాళ అందరూ వాళ్ల జీవితాలు వాళ్లు జీవిస్తున్నారు. Source: KPTV(Tamil Youtube Channel) – విశీ (వి.సాయివంశీ)
Share this Article