లవ్ స్టోరీ సినిమా కథలోని మిగతా అంశాల్ని కాసేపు వదిలేస్తే… ఒక సీరియస్ అంశాన్ని మాత్రం శేఖర్ కమ్ముల మంచి చర్చకు పెట్టాడు… అఫ్ కోర్స్, ఈ సమస్యకు సరైన పరిష్కారం వైపు ప్రేక్షకుల ఆలోచనల్ని తీసుకుపోలేకపోయాడు..! ఆ అంశం చైల్డ్ అబ్యూస్… చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, దాడులు..! పెరుగుతున్నాయి… బాగా పెరుగుతున్నాయి… ఆందోళనకరమైన స్థాయికి చేరుతున్నాయి… మొన్నటికిమొన్న మనం సింగరేణి కాలనీ చిన్నారి చైత్ర మీద దారుణం చూశాం, ఉద్వేగపడ్డాం, చివరకు నిందితుడు ‘‘ఆత్మహతుడ’’య్యే దాకా ఊరుకోలేదు… నిజానికి సొసైటీలో రాజులు బోలెడు మంది ఉన్నారు, ఆ కారణాలకు చికిత్స జరగాలి, ఆ రోగలక్షణాలకు అసలు కారణాలు చర్చించబడాలి… ఈ ‘‘ఆత్మహతాలు’’ గాకుండా, వేగంగా కోర్టుల్లోనే సరైన పద్ధతిలో శిక్షింపబడాలి… కానీ అది జరగడం లేదు… పైగా మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే… బయటి వ్యక్తులే కాదు, నిజానికి చిన్నారులు సొంత కుటుంబసభ్యులకే చాలా సాఫ్ట్ టార్గెట్స్ అయిపోతున్నారు…
ఇది ఎవరో కాదు చెప్పింది… దేశంలోని ఏటా నేరాల సంఖ్యను, తీరును క్రోడీకరించి వెల్లడించే ఎన్‌సీఆర్బీ చెప్పిందే ఇది… గత ఏడాది తెలంగాణలో లైంగికదాడుల కేసులు 755 నమోదు కాగా, అందులో 98 కుటుంబసభ్యులు చేసినవే… 434 కేసులు పరిచయస్తులు, సన్నిహితులు చేసినవే… అయితే ఈ సంఖ్యలో చిన్నారులపై జరిగిన దురాగతాలెన్నో, వాటిల్లో కుటుంబసభ్యులే నిందితులుగా ఉన్న కేసులెన్నో బ్రేకప్, వివరణ లేదు…! ఇది ఓవరాల్ రేపుల సంఖ్య… పోక్సో చట్టం ఎవరినీ భయపెట్టలేకపోతోంది… కారణం ఏమిటంటే..? కామం కమ్మేసినప్పుడు, తనకేమీ కాదులే అనే ధీమా, బాధితులు బయటికి చెప్పుకోలేరులే అనే భావన, చెబితే చంపేస్తామనే బెదిరింపులు… ఇక్కడ వయస్సు తేడాలేమీ లేవు, చిన్నారులే కాదు, ముసలోళ్లు కూడా ఉన్నారు…
Ads
కామం కళ్లను, బుర్రను లోబరుచుకుంటే… నేరం హత్య దాకా పోతోంది… ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న భార్యల కేసులు పెరుగుతున్న తీరు చూస్తున్నాం కదా, కొన్నిసార్లు భర్తలతోపాటు చిన్నారులపైనా ప్రభావం పడుతోంది… కుటుంబతగాదాలను ఆసరాగా చేసుకుని దగ్గరివాళ్లే అత్యాచారాలకు చాన్స్ తీసుకుంటున్నారు… తండ్రులతో సమానులు కూడా కూతుళ్లపై… అమ్మలతో అక్రమబంధాల్ని పెట్టుకుని, బిడ్డలనూ వదలని కర్కోటకాల దాకా…! లైంగిక దాడులకు సంబంధించి తెలంగాణ 13వ స్థానంలో ఉంది… ప్రథమస్థానంలో ఉన్న రాజస్థాన్‌లో లైంగికదాడుల కేసుల సంఖ్య 5 వేలు… అంటే అక్కడ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు… ఎన్‌సీఆర్బీ పోక్సో నేపథ్యంలో… రాబోయే రోజుల్లో చిన్నారులపై జరిగే అత్యాచారాల కేసుల్ని, అందులో కుటుంబసభ్యులే నిందితులుగా ఉండే కేసుల్ని కూడా విడిగా నమోదు చేయాలేమో… ప్రత్యేకించి సవతి తండ్రులు, తండ్రులతో సమానుల చేసే అత్యాచారాలు…!! చైత్ర వంటి దారుణాలు జరిగినప్పుడు నాలుగు రోజులు హడావుడి గాకుండా… కారణాలు, పరిష్కారాలు, జాగ్రత్తలు, సర్కారు బాధ్యతల మీద సీరియస్ చర్చ సాగాల్సి ఉంది..!!
Share this Article